
- కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు
- జీరో అవర్‌లో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆక్రమణదారుల చేతుల్లో ఎస్‌టిలు ముఖ్యంగా యానాదులకు సంబంధించిన భూములు ఉన్నాయని, వీరికి కొందరు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని కందుకూరు వైసిపి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి జీరో అవర్‌లో గురువారం శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. కందుకూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాల క్రితం ప్రభుత్వం యానాదులకు భూములిచ్చిందని, కొందరు భుక్తి కోసం వలసలు వెళ్లడంతో వారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని, అటువంటి వారి భూములను గుర్తించి ఆక్రమించిన వారి చేతుల్లో భూములను రెవెన్యూ అధికారులు కొమ్ముకాసి రికార్డుల్లో నమోదు చేశారని అన్నారు. అటువంటి భూములకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. రెవెన్యూకు సంబంధించి నిర్ధిష్ట సూచనలను కింది స్థాయి ఉద్యోగులకు ఇప్పటి వరకు అందలేదన్నారు. భూముల రీ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాల్లో రద్దు చేస్తున్నట్లు, లేక అవసరం లేదని కూడా ఉదహరించకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని మహీధర్‌రెడ్డి శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. నిషేధిత జాబితాలో పెట్టిన వాగులు, వంకలు, కుంటలు, చెరువుల భూములను రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కొంత భాగం సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇచ్చారని, అటువంటి వాటిపై ప్రభుత్వం ఏమి చేయబోతుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. జగనన్న భూరక్ష-శాశ్వత భూహక్కు విజయవంతం కావాలంటే రెవెన్యూ సిబ్బందిని క్షేత్రస్థాయిలో భర్తీ చేయాలని, సర్వేయర్లను అవసరమైన మేర పెట్టకపోతే తప్పులు దొర్లే అవకాశముందని అన్నారు. వెంకటాద్రిపాలెంలో సర్వే నెంబర్ 116లో 999 ఎకరాలు భూమిని 300 నుంచి 400 మంది రైతులు వందేళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారని, వారికి శాశ్వత హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి మహీధర్‌రెడ్డి విజ్ఞఫ్తి చేశారు.
నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులు అధికంగా ఉండే తీరప్రాంతం, రామాయపట్నం వెళ్లే తుమ్మలపెంట ప్రధాన రహదారి గుంతల మయంగా మారిందని, కాంట్రాక్టరు పనులు నిలిపేయడంతో ఇబ్బందిగా మారిందని శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు.
బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. బొబ్బిలిలో 50 పడకల ఆస్పత్రిని ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ 35 పడకల ఆస్పత్రికి ఉన్న సౌకర్యాలు కూడా లేవని సభ దృష్టికి తీసుకొచ్చారు. స్పెషలిస్టులు కూర్చోవడానికైనా ఇబ్బందిగా ఉందన్నారు. తక్షణమే సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రజకులను కొందరు కులం పేరుతో అవమానపరుస్తూ మాట్లాడారని, అటువంటి వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఓవరాల్‌గా సమాధానం చెబుతున్నారని, అలా కాకుండా లిఖిత పూర్వకంగా సమాధానాలిప్పించాలని స్పీకరుకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వచ్చిన కళింగ వైశ్య, బుడగ జంగాలకు కుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం తక్షణమే వారికి సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. కోడుమూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని, పట్ణణంలో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు.