Aug 29,2023 22:29

వట్లూరు వెమ్‌టెక్నాలజీ బాధిత రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ఏడేళ్లు దాటినా అందని పరిహారం
అప్పట్లో పరిశ్రమ పేరుతో రైతుల నుంచి 340 ఎకరాలు స్వాధీనం
ఎకరాకు రూ.2.50 లక్షలు పరిహారం ఇచ్చేలా ఒప్పందం
ప్రభుత్వం మారడంతో పరిశ్రమ ఏర్పాటు వెనక్కి
మా భూములు మాకివ్వాలంటున్న రైతులు


ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : వట్లూరులో వెమ్‌ టెక్నాలజీ (విమాన విడిభాగాల తయారీ) పరిశ్రమ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారమూ ఇవ్వకుండా, భూములు లేకుండా చేసిన వైనమిది. ఏడేళ్లుగా తమకు న్యాయం చేయాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో తమ భూములు తిరిగిచ్చేయాలంటూ రైతుల రోడ్డెక్కుతున్నారు. అటు పరిహారం ఇవ్వకుండా, ఇటు భూములు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం రోడ్డున పడేసింది.
టిడిపి ప్రభుత్వ హాయాంలో 2016లో వెమ్‌టెక్నాలజీ పరిశ్రమను వట్లూరులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పెదపాడు మండలం వట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 495, 496, 497లోనూ, పెదవేగి మండలంలోని సర్వే నెంబర్‌ 210-29 పరిధిలోని దాదాపు 340 ఎకరాలను వెమ్‌ టెక్నాలజీ సంస్థకు ఎపిఐఐసి ద్వారా కేటాయించారు. దాదాపు 300 మంది సన్న, చిన్నకారు రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. రికార్డుల ప్రకారం ఈ భూములు చెరువు భూములుగా ఉన్నాయి. అయితే గడిచిన వందేళ్లుగా ఈ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అనే పేరుతో రైతులకు ఎటువంటి పరిహారమూ ఇవ్వకుండా భూములు లాగేసుకున్నారు. దీనిపై అప్పట్లో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎకరాకు రూ.2.50 లక్షల పరిహారం చెల్లించేలా నిర్ణయించారు. అయితే రైతులకు ఒక్క చిల్లిగవ్వ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రభుత్వం మారడంతో పరిశ్రమ ఏర్పాటు వెనక్కిపోయింది. దీంతో అగ్రిమెంట్‌ రద్దు చేసుకుని 2022 ఏప్రిల్‌లో ఈ భూములను వెమ్‌ టెక్నాలజీ నుంచి ఎపిఐఐసి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. రైతులు మాత్రం రోడ్డున పడ్డారు. ఎంతోమంది రైతులు ఆ భూములను ఆడపిల్లలకు పసుపు కుంకుమ కింద ఇచ్చి వివాహాలు చేశారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోని దుస్థితి నెలకొంది.
మా భూములు మాకిచ్చేయండి: రైతులు
వెమ్‌ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటు పేరుతో సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న వందల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పరిశ్రమ ఏర్పాటు లేదని తేలిపోయింది. ప్రస్తుతం భూములన్నీ బీడుగా ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదని, పరిహారం ఇవ్వకపోవడంతో తమ భూములు తమకిచ్చేయాలని బాధిత రైతులు పోరుబాట పట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వట్లూరులోని వెమ్‌ టెక్నాలజీ బాధిత రైతులకు న్యాయం చేయాలని అంతా కోరుతున్నారు.
భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి
కె.శ్రీనివాస్‌, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి

వట్లూరులో వెమ్‌ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని ఏడేళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదు. రైతులకు భూములు వెనక్కివ్వాలి. ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటే పరిహారం చెల్లించాలి. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు కేసులు పెట్టడం సమంజసం కాదు. రైతులకు న్యాయం చేయకపోతే రైతుసంఘం బాధిత రైతులకు అండగా నిలబడి పోరాడుతుంది.
మా భూములు మాకివ్వాలి
వల్లముల రామాంజనేయులు, వట్లూరు

మా కుటుంబానికి సంబంధించి నాలుగెకరాల భూమి కోల్పోయాం. మా పిల్లలకు పసుపు కుంకుమ కింద ఇవే భూములిచ్చాం. ప్రభుత్వం చిల్లిగవ్వ పరిహారం ఇవ్వలేదు. పరిశ్రమ నిర్మాణం ఆగిపోయింది. మా భూములు మాకిచ్చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రోడ్డున పడ్డ రైతులకు న్యాయం చేయాలి.
భూమిలేక ఆదాయం కోల్పోయాం


పిడిగే జోసఫ్‌, వట్లూరు, బాధిత రైతు
మా కుటుంబం మొత్తం ఐదెకరాల భూమిని కోల్పోయాం. దీంతో ఏడేళ్లుగా చిల్లిగవ్వ ఆదాయం లేని పరిస్థితి నెలకొంది. 2016లో భూములు తీసుకున్నప్పుడు ఎకరాకు రూ.2.50 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ రూపాయి ఇవ్వలేదు. పరిహారం ఇవ్వకుండా, పరిశ్రమ ఏర్పాటు చేయకుండా భూములను బీడుగా పెట్టారు. మా భూములు మాకిచ్చేస్తే సాగు చేసుకుంటాం. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం.