Sep 10,2023 10:07
  • భూ కంప తీవ్రత రిచ్‌టర్‌ స్కేలుపై 6.8గా నమోదు
  • వెయ్యి మందికి పైగా మృతి
  • 1200 మందికి గాయాలు
  • ఐరాస, జి20 దేశాధినేతల దిగ్భ్రాంతి

రాబట్‌ : ఉత్తరాఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన పెను భూకంపంలో వెయ్యి మందికి పైగా మరణించారు. మరో 1200 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భూ కంపం ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ముర్రాకేష్‌లోని పాత బస్తీలోని కొన్ని భవనాలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. భూకంపం తీవ్రత రిచ్‌టర్‌ స్కేలుపై 6.8 గా నమోదయింది. భూకంప నాభి యురేసియన్‌, ఆఫ్రికన్‌ ఫలకాల మధ్య 18.5 కి.మీ లోతున ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలోని మర్రాకేష్‌ ప్రాంతం ఎటు చూసిన శవాల గుట్టలతో మరుభూమిని తలపిస్తోంది.మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతటా హృదయవిదారకమైన పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆస్పత్రులు కిక్కిరిసి పోయాయి. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలోనూ కనిపించింది. అయితే, అక్కడ ఎలాంటి నష్టం సంభవించలేదు. 2004లో మొరాకోలోని ఉత్తర రిఫ్‌ పర్వతాల్లో సంభవించిన భూకంపంలో 600 మంది మరణించారు. ఆ తరువాత మొరాకోలో సంభవించిన అత్యంత ఘోర భూకంపమిదే. 1980లో అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 2, 500 మంది మరణించగా, మూడు లక్షల మంది నిరాశ్రయలుగా మారారు. ఈ ఏడాది తుర్కియే సైతం ప్రకృతి ప్రకోపానికి గురైన సంగతి తెలిసిందే.
            మొరాకో భూ కంపంలో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకోవడం పట్ల ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో మొరాకో ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జి20 శిఖరాగ్ర సదస్సు కూడా మొరాకో భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కష్ట కాలంలో ప్రపంచ దేశాలన్నీ మొరాకో ప్రజలతోనే ఉన్నాయని ఈ సదస్సు ప్రారంభానికి ముందు జి20కి ఆతిథ్యమిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌, రష్యా నేత పుతిన్‌ భూ కంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ విషాద సమయంలో మొరాకో ప్రజలకు అండగా వుంటామని తెలిపారు. మొరాకోకు అవసరమైన సాయాన్ని అందిస్తామని అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ తెలిపారు. మొరాకోలోని భారత జాతీయులెవరైనా అవసరమైతే ఫోన్‌ చేయాలంటూ భారత ఎంబసి కార్యాలయం హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఇచ్చింది.