
'చెయ్ జగము మరచి జీవితమే సాధన/ నీ మదిని తరచి చూడటమే శోధన' అంటాడు వేటూరి. ఇష్టపడిన క్రీడల కోసం జీవితం అంకితం చేసి, కఠోర సాధనతో లక్ష్యం చేరాలని క్రీడాకారులు కోరుకుంటారు. 'వృధా పోదు నీ తర్ఫీదు/ నిన్ను నువ్వు ఉలివై మలుచుకో/ శ్రమించనిదే ఏదీ రాదు/ విశ్రమిస్తే విజయం లేదు/ పట్టుదలతో లక్ష్యం గెలుచుకో' అంటాడో కవి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రీడాకారులు తాము ప్రాణంగా భావించే క్రీడల కోసం ప్రాణం పెడతారు. వ్యక్తిగత క్రీడల నుంచి జట్టుగా ఆడే క్రీడల వరకు, సాంప్రదాయ ఆటల నుంచి ఆధునిక అథ్లెటిక్స్ వరకు లెక్కలేనన్ని క్రీడలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో మొదటి స్థానం ఫుట్‌బాల్ (సాకర్)దే. దాదాపు 200 దేశాల్లో... 25 కోట్ల మంది ఆటగాళ్లున్నారు. వీరికి 350 కోట్ల మంది అభిమానులున్నారు. అలాగే క్రికెట్, బాస్కెట్‌బాల్, హాకీ, టెన్నిస్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ వంటి ఆటలకు లక్షల సంఖ్యలో ఆటగాళ్ళు...కోట్లలో అభిమానులు వున్నారని ఒక సర్వే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏదోక దేశంలో ఏదోక క్రీడా ఈవెంట్స్ ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. వీటితోపాటు ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలలో ప్రసిద్ధి చెందిన క్రీడలూ అనేకం వున్నాయి. ఈ ఆటల కోసం జీవితాలను అర్పిస్తారు. ఆటే ప్రాణంగా బతుకుతారు.
పురాతన క్రీడలలో ఒకటైన అథ్లెటిక్స్‌పై అవగాహన కల్పించడం, క్రీడలలో పాల్గొనడం, ఆరోగ్యకరమైన జీవనం, ఐక్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రతి ఏడాది మే 7వ తేదీన 'ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం' జరుపుతారు. అలాంటి ఒక సమయంలో ...భారత కీర్తి ప్రతిష్టలను విశ్వకేతనంగా నిలిపిన రెజ్లర్లు దేశ రాజధాని వీధుల్లో ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఎదురైంది. తమను లైంగికంగా వేధించిన డబ్లుఎఫ్‌ఐ చీఫ్, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌ను అరెస్టు చేయాలంటూ నిరసన తెలుపుతున్న రెజ్లర్ల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. న్యాయమడిగిన గొంతులను అణచివేస్తూ...మానసికంగా, భౌతికంగా దాడులకు దిగుతున్నారు. నాలుగు పతకాలు సాధించిన బజరంగ్ పూనియా...'నా పతకాలన్నీ వెనక్కి తీసుకోవాల'ని నినదిస్తున్నారు. దీన్నిబట్టే అర్థమౌతోంది... కేంద్ర బిజెపి ప్రభుత్వం నిందితుడ్ని ఎంతగా వెనకేసుకొస్తోందో. చిన్న చిన్న దేశాలు సైతం తమ క్రీడాకారులకు సమున్నత గౌరవాన్నిచ్చి, తమ దేశానికి సింబల్‌గా మార్చుకుంటున్నారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలుపుతున్నారు. చిన్న దేశమైన క్యూబా... వందల సంఖ్యలో పతకాలు సాధిస్తోంది. 142 కోట్ల మంది వున్న భారత్‌లో పదుల సంఖ్యలోనూ పతకాలకు నోచుకోని పరిస్థితి. క్రీడలకు, క్రీడాకారులకు అంత ప్రోత్సాహం లేని దేశంలో...సొంత ప్రతిభతో రాణించి, దేశానికి గర్వకారణంగా నిలిచిన వారిపై వేధింపులకు పాల్పడటం పాశవికం. వీరి దేశభక్తి మాటలకే పరిమితమా? అనేది వారే చెప్పాలి. ఒకవైపు 'బేటీ బచావో' అంటూనే...రెజ్లర్లకు మద్దతు తెలిపిన విద్యార్థినులపై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఆందోళనకరం. దేశ రాజధానిలోనే అమ్మాయిలకు రక్షణ లేదని మరోసారి రుజువవుతోంది. ఇది నిరసనకారుల గొంతు నులిమే చర్య. నిరసనను విధ్వంసం చేసే కుట్ర. మహిళా సాధికారత అంటే... గర్జించే గొంతులను నులిమేయడం, నినదించే చేతులకు సంకెళ్లు వేయడం, నిందితులకు రక్షణ కల్పించడం- బిజెపి లక్షణంగా మారింది. దీనికి కథువా, ఉన్నావో, హత్రాస్, బిల్కిస్ బానో వంటి ఉదంతాలే ఉదాహరణ.
ఈ సమయంలో 'అందరికీ అథ్లెటిక్స్- ఒక కొత్త ప్రారంభం'... అనే థీమ్‌తో అథ్లెటిక్స్‌ను ప్రోత్సహించేందుకు ఐఎఎఎఫ్ నిర్వహిస్తోన్న అథ్లెటిక్స్ దినోత్సవం క్రీడాకారులకు ఒక నూతన ప్రారంభం కావాలి. నేడు 'నీదొక నూతన పురాణం/ విజయ విప్లవ కేతనం/ ఆశయమన్నది నీ లక్ష్యం అయితే/ తలవంచును అంబరం సైతం' అంటాడో కవి. శారీరక బలిమిని మానసిక బలిమిగా మార్చుకో, బిగించిన పిడికిలి బిగి సడలనివ్వకు నేస్తం. మీ వెంటే వున్నది దేశం మొత్తం. ఓ కవి చెప్పినట్టుగా... 'నొప్పి లేని పోరాటం/ ఏ గొప్ప ఇవ్వదులే/ నిప్పుల నడకలు తప్పవులే/ గమ్యం చేరే దారుల్లో/ గాయాలన్నీ మామూలే/ ప్రతి ఆట పోరాటమంటూ/ పట్టు బిగించు'. అది ఆటైనా... ఆందోళనైనా విజయమే నీ లక్ష్యం.