టరొంటో : భారత్-కెనడా మధ్య ఖలిస్థానీ చిచ్చు తీవ్ర ఉద్రిక్తమయ్యింది. కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది. కానీ, సదరు దౌత్యవేత్త ఎవరు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్ ఎనాలసిస్ వింగ్ అధిపతిని బహిష్కరించే అవకాశాలున్నాయి. అయితే ఈ ఆరోపణలను భారత్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.
కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడోతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. భారత్-కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు