
చూడండి చూడండి
పగిలిన పత్తికాయల్లా కళ్ళు విప్పార్చుకుని
చూడండి తనివితీరా చూడండి
ఎత్తైన నునుపైన గుండ్రని అందమైన
నా రొమ్ముల్ని చూడండి
బాగా చూడండి
శిశుదశలో ఆకలికి ఆబగా తడుముకొని
పాలు తాగిన స్తనాలే కదా!
ఎవరు తొలగిస్తే నేమి
సిగ్గు వస్త్రాలు విప్పేసి వివస్త్రలుగా వీధుల్లో ఊరేగుతున్నప్పుడు
ధైర్యముంటే సిగ్గు లేకుండా చూడండి
ఇంద్రునిలా ఒళ్లంతా కళ్ళు చేసుకుని
రెండు తొడల మధ్య మర్మస్థానాన్ని
ఉమ్మనీటి సంద్రంలో తుళ్ళింతలాడుతూ
బాహ్య ప్రపంచంలోకి తొంగి చూచింది
ఆ జన్మభూమి నుండే కదా!
ఏముందక్కడీ
మీ అమ్మకి అక్కకి ఎవరికైనా అవే అవయవాలు కదా!
***
ఏమనాలి మిమ్మల్ని
మానవ మృగాలంటే
మృగాలకే అవమానం
తోటి జంతువులపై
అత్యాచారం పంజా విసరదు
అసురుడు అందామా
కీచకుడైనా ఆమె సౌందర్య జలపాతంలో
వివశుడయ్యాడే గాని
కొనగోటితోనూ ఆమె దేహవీణ మీటలేదు
రావణుడైనా అల్లంత దూరంలో
అశోకవనం చిరునామాలో ఉంచాడు గానీ
అంత్ణపురంలో దాచలేదు
***
నొప్పి సూదులు గుచ్చుకుని లుంగలు చుట్టుకుపోతూ
నెలనెలా మూడు రోజులు నరకం అనుభవించిన
ఈ దేహపుష్పం నాదేననుకున్నాను ఇప్పటివరకు
తొమ్మిది నెలలు నాది కాని బరువు మోసి మోసి
పిల్లలకు ప్రాణం పోసి మరో సృష్టి సంతకాన్నై
కొత్త జన్మ ఎత్తిన కరకు హింసాక్షణాల్లో
ఈ దేహనది నాదేననుకున్నాను
ఆనాడు కురుసభలో వస్త్రాపహరణ పరాభవం నుండి
నేడు మణిపురం వీధుల్లో నగ్న ఊరేగింపు వరకు
ఈ శరీరం నాది కాదని
ఈ మగాహాంకార సమాజం ప్రేలాపనలు
***
సామ్రాజ్యం కోసమో సంపదల కోసమో
ఉన్మత్త రణబీభత్సానందంలో మునిగిపోతూ
విజయ గర్వంతో మీసాలు మెలేసి
చెరుకు తోటలో ఏనుగులు తొక్కి విధ్వంసం చేసినట్లు
శత్రురాజ్య స్త్రీల దేహ వనంలో అడుగుపెట్టి
అహంకారాగ్నిని చల్లార్చుకోవాలనుకుంటావు
దేవతలుగా పూజించిన చేతులతోనే
దేహరాజ్యాన్ని దురాక్రమిస్తావు
***
కాలికడ్డం వచ్చిన రాయిలా
నేలలో తడిసి నానిన కొయ్య ముక్కలా
వానల్లో ఎండల్లో తడుస్తూ పగుళ్లు బారిన
శిధిల ప్రతిమలా ఎంత లోకువ
మీకిష్టం వచ్చినప్పుడు సవస్త్రలుగానో
ఇష్టం లేనప్పుడు వివస్త్రలుగానో ఊరేగడానికి
మేమేమీ మీ చేతి బొమ్మలం దిష్టిబొమ్మలం కాము
***
ఎదురు తిరిగామంటే
ఒక్కొక్కరం భద్రకాళులం రుద్రమదేవులం
ఖబడ్డార్! ఒళ్ళు దగ్గర పెట్టుకోండి
చరిత్రను కొత్తగా రాస్తాం మేమిప్పుడు !
- మందరపు హైమవతి
94410 62732