Aug 21,2023 07:46

'దగ్ధగోళం' దీర్ఘ కవితా సంపుటి పేరులోనే ఎంతో ఆవేదనని, బాధని, పొంగిపొర్లే ద్ణుఖాన్ని మమేకం చేసుకొని ఉంది. కోవిడ్‌ కారణంగా ప్రపంచమంతా అల్లాడిపోయిన దు:ఖభరిత సందర్భాలకు ఈ దీర్ఘ కవిత అక్షర రూపం. దీనిని వెలువరించిన డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆచార్యులుగా విద్యార్థులకు తెలుగు భాషలోని తియ్యందనాల్ని అందించారు. డోలు, ఘటం, కంజీర వాద్యాల్లో ఉన్నతశ్రేణి కళాకారునిగా ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి, డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గార్లతో కలిసి కచేరీల్లో పాల్గొన్న గొప్ప కళాకారులు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన కరోనా వైరస్‌ భూగోళాన్ని దగ్ధం చేస్తుంటే - ప్రపంచ మానవుని ఆర్తనాదాలను తన బాధలుగా భావించి 18 భాగాలుగా ఈ దీర్ఘ కవితను అందించారు.
        మొదటి భాగంలో కరోనా మన దేశంలోకి వచ్చీ రావడంతోనే నెలకొన్న అయోమయ వాతావరణాన్ని వివరించారు. పోరాటం సాగిస్తున్న కొద్ది అది తీవ్ర రణరంగంగా మారిందంటారు. మనిషిలోని స్వార్థం, అత్యాశల ఫలితమే కరోనా మనిషిని పచ్చి పుండులా చేసిందన్నారు. కరోనా రూపంలో ప్రకృతి విలయతాండవం చేస్తుంటే మానవుడు చావు కేక పెట్టడం తప్పించి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని ఎంతో ఆవేదనగా చెప్పారు.
       రెండవ అధ్యాయంలో ఎంతోమంది పెద్దలకు చాకిరీ చేస్తూ, వాళ్ళ కాలి కింద చెప్పులా సామాన్యుడు బలి పశువు అవుతున్న సామాజిక పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఒక్క ప్రాణం హరిస్తే ఆ ప్రాణిని ఆసరాగా చేసుకుని ఎన్ని జీవాలు నిరాధారమైనా న్యాయదేవతకు ఒకింతయినా కనికరం లేదంటారు. మరణించిన వారి కోసం కనీసం కాటిదాకా కూడా వెళ్లలేని స్థితిలో మానవుడు ఉన్నాడని బాధపడ్డారు. మూడవ అధ్యాయంలో - ప్రకతి మనకు అన్ని ప్రసాదించి ముందుకు నడిపిస్తున్నా కూడా మనిషి భూమాతని కాలదన్ని ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంటే కాలం కూడా నిశ్చేష్టురాలయిందని అన్నారు. పోగొట్టుకున్న కాలాన్ని తిరిగి తెచ్చుకోలేమని తెలిసి కూడా ధనం కోసం పాకులాడుతూ మునగడానికి సిద్ధంగా ఉన్న పడవలా ఉన్నాడు మనిషి అంటారు రచయిత. కరోనా విపత్తుతో నాలుగు గోడల మధ్య జీవనం సాగిస్తూ సూర్య కాంతిని కూడా చూడలేక ప్రతిరోజూ అమావాస్య లాగే జీవిస్తున్నాడని ఆవేదనగా చెప్పారు.
నాలుగవ అధ్యాయంలో కోవిడ్‌ కాటుకు బలైన మనుషులు కుప్పలు తెప్పలుగా శవాలుగా మారిన వైనాన్ని తెలియజేశారు. రుద్ర భూములన్నీ యుద్ధ భూములై శత్రువుని చూడకుండానే దీపం తాకిన మిణుగురులా విలవిల్లాడుతున్నారు అంతా. నదులన్నీ శవపేటికల్ని మోస్తుంటే హారతులన్నింటిని శవపేటికలు అందుకుంటున్నాయని అన్నారు. ఐదవ అధ్యాయంలో కంటికి కనిపించని వైరస్‌ ఎన్ని యుద్ధాలు సష్టించినా, రక్తం ఓడుతున్నా అన్నింటినీ తన కడుపులోనే దాచుకుంది భూమాత. మనిషి కూడా మాట పలుకు లేక భయంతో కంపించి పోతున్నాడు. అతి తెలివితో తయారుచేసిన మారణాయుధాలు వైర విక్రయాలై రగులుతూ శాపాలుగా మారాయని కవి బాధాతప్త హృదయంతో చెప్పారు.
           ఆరవ అధ్యాయంలో శబ్దజీవి అయిన మనిషి తీరుని చెప్పారు రచయిత. పుడుతూనే కెవ్వుమనే శబ్దంతో పుట్టిన మానవుడు నిశ్శబ్ద వైరస్‌ సష్టిస్తున్న అలజడికి శబ్ద తరంగాలు అన్ని మూగబోయి ఫోన్‌ పలకరింపులతో రేపటి తరానికి గుణపాఠంగా నిలిచాయి అంటారు. ఏడవ అధ్యాయంలో దిన దిన గండంగా మారిన మానవుని జీవనయానం గురించి కన్నీటి పర్యంతరంగా చెప్పారు. ఎనిమిదవ అధ్యాయంలో కరోనా విజృంభణ తరుణంలో కొందరు నకిలీ వస్తువులు, నకిలీ మందులు అమ్ముతూ స్వార్థం ప్రదర్శిస్తున్నందుకు ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదవ అధ్యాయంలో ఇప్పుడిప్పుడే దేశాలన్నీ కళ్ళు తెరుస్తూ కళ్ళకు కప్పేసిన పొరలని తొలగించుకున్న వైనాన్ని చెప్పారు. పదవ అధ్యాయంలో కుటుంబ బంధాలు దూరమై ఇగిరిపోతున్న గంధంలా పొరులు పొరలుగా రాలిపోతూ ఎడారి బతుకుల్లా మిగిలిపోతున్న వైనాన్ని చెప్పారు. 11వ అధ్యాయంలో కరోనా కల్లోలానికి మనిషి కారాగార వాసం అనుభవిస్తూ పని దొరికితే కానీ తిండి దొరకని పేదవాడి ఆవేదనని తెలియజేశారు. ధనవంతుడు కరోనా కాదు కదా కరోనా తాత వచ్చినా కూడా అరచేతిలో వైకుంఠాన్ని చూస్తాడంటారు. ఇదే అదనుగా వ్యాపారస్తులు, ప్రభుత్వాలు దోచుకుంటున్న వైనాన్ని వివరించారు. 12వ అధ్యాయంలో కుటుంబ సభ్యులు ఎవరూ రాని ఏకాంత వాసంలో వైద్యులు, రక్షకభటులు, నర్సమ్మలు, ఎందరో సేవకులు అందించిన సేవల్ని ప్రాణదాతలుగా అభివర్ణించారు.
            13వ అధ్యాయంలో కరోనా విపత్తులో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలను ప్రస్తావించారు. 14వ అధ్యాయంలో కరుకురాతి గుండెల్లో కరుణ రసం నింపుకొని అహౌరాత్రులు శ్రమించి కరోనా రక్కసిని ఎదిరించిన తీరుని చాలా చక్కగా చెప్పారు. 15వ అధ్యాయంలో వలస కూలీల వెతలను ప్రస్తావించారు. 16వ అధ్యాయంలో కొందరు పెద్ద మనసుతో రోడ్డున పడ్డ ఎందరో అభాగ్యులకి సహాయపడిన తీరును కరుణరసాత్మకంగా చెప్పారు. 17వ అధ్యాయంలో కవులు ఈ కష్టకాలంలో తమ ఆవేదనను, ఆసరాను కవిత్వీకరించి మానవత్వాన్ని తట్టి లేపారని కితాబునిచ్చారు. 18వ అధ్యాయంలో కరోనాతో పాటు ఇంకా అనేక వ్యాధులు అలజడిని రేపినా, మానవుడు ప్రకృతికి తలపెడుతున్న కీడుని ఎంతో బాధగా చెప్పారు. ఇలా ఒక దు:ఖభరిత కల్లోల సమయాన్ని కవి దీర్ఘ కవితగా రికార్డు చేయడం అభినందనీయం. పుస్తకం కోసం కవిని 98483 61627 నంబర్లో సంప్రదించవచ్చు
 

- పింగళి భాగ్యలక్ష్మి
97047 25609