Oct 23,2023 10:01

దసరా నవరాత్రులు మొదలవగానే - అమ్మ వారిని స్తుతించే గీతాలూ, గానాలూ హోరెత్తిపోతాయి. పలు వేదికలపై మహిళాశక్తిని మహత్తర శక్తిగా ప్రస్తుతించే ప్రవచనాలు ఉధృతంగా ప్రవహిస్తాయి. అమ్మ వారిని రోజుకొక అలంకరణలో ప్రదర్శిస్తూ, ఆ అలంకరణకు ఉన్న ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించటం ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా ఆనవాయితీగా నడుస్తోంది. దుష్టత్వాన్ని దునుమాడే మహా బలశాలిగా మహిళకు మంగళారతులు, జేజేల గానామృతాలూ సమర్పించటం... దసరా వేళల్లో మనకు ఒక మామూలు సంప్రదాయంగా సాగుతోంది.

         కొన్ని తరాలుగా జరుగుతున్న ఈ పండగలోని పరమార్థం అందరికీ నిజంగానే వంటబడితే- వర్తమానం ఇలా ఉంటుందా? పూజల్లో అమ్మను స్తుతించటం, వ్యవహారంలో ఆ అమ్మనే అవమానించే తిట్ల దండకాలను అందుకోవడం సమాజంలో ఒక పరిపాటిగా కనిపిస్తోంది. ఒకపక్క స్త్రీల గురించి ఘనంగా కీర్తిస్తూనే- అదే స్త్రీలను ఇంటికీ, వంటకీ పరిమితం చేసే సూత్రాలను వల్లించటం చెల్లుబాటుగా సాగిపోతోంది. దాయాదుల మధ్య వివాదంలోనైనా, దేశాల మధ్య యుద్ధ సందర్భంలోనైనా 'మహిళ' ఒక కక్షపూరిత లక్ష్యమవుతుంది. ఆమెను అవమానించటం, అపహరించటం, హత్యాచారాలకు గురిచేయడం - ఆధిపత్యం చెలాయించాలనుకునే వారికి ఒక అలవాటుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితికి మూల కారణం ఏమిటి? దానిని పసికట్టి, పనిగట్టుకొని నిర్మూలించినప్పుడే కదా, జయజయ మహిషాసుర మర్థని అన్న మాటకు నిజమైన అర్థం చేకూరుతుంది.
       ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబ అవసరాల కోసం కానిస్టేబులు ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగం కోసమే ఆమె వ్యాయామ శిక్షణ పొందిందని, ఆ శిక్షణ ఇచ్చిన ప్రేమికుడికి తెలుసు. తీరా ఆమె ఉద్యోగంలో చేరాక పరిస్థితి మారిపోయింది. తగిన సమయంలో కుటుంబానికి కేటాయించటం లేదని భర్తగా అతడు ఆమెతో గొడవ పడ్డాడు. కలవటానికి అని ఇద్దరూ ఓ హోటలు గదికి చేరారు. మళ్లీ మాటా మాటా పెరిగింది. తుపాకీ తీసి నిర్దాక్షిణ్యంగా ఆమెను కాల్చేసి, అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆపదలో ఉండే ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ఉద్యోగ విధి ఆమెది. కానీ, తనను తాను కాపాడుకోలేక పోయింది.. ఇది జరిగింది నిన్నగాక మొన్న బీహార్‌ రాజధాని పాట్నాలో.
          కొన్ని నెలల క్రితం మణిపూర్‌లో జరిగిన ఘోరం ప్రపంచం మొత్తానికి తెలుసు. మైతీ అనే తెగకు చెందిన గుంపు - కుకీ తెగకు చెందిన మహిళలపై ఉన్మాదంతో విరుచుకుపడింది. వారిని వివస్త్రలను చేసి, రెండు మూడు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా నడిపించారు. అత్యంత అమానవీయంగా, జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు అక్కడ ఎన్నో జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించాడు. గుజరాత్‌లో బిల్కీస్‌ బానో తదితర మహిళల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇజ్రాయేల్‌ దాడుల తరుణంలోనూ ఇదే జరుగుతోంది.
         ఒక మనిషికి మరో మనిషికీ విభేదం వచ్చినా, ఒక కుటుంబం మరో కుటుంబం మధ్య వివాదం తలెత్తినా, ఒక మతానికి మరో మతం మీద విద్వేషం చెలరేగినా, ఒక దేశం మీద ఇంకో దేశానికి ప్రతీకారం పేట్రేగినా- తొట్ట తొలి బాధితులు మహిళలు అవుతున్నారు. మనల్ని ఘనంగా పాలించారు అని చెప్పే రాజులూ, పురాణ పురుషులూ ఇదే చేశారు. ఆధునిక నాగరిక సమాజంలోనూ ఇలాగే కొనసాగుతోంది.
 

                                                                   ఎందుకిలా జరుగుతోంది ?

కాలాలూ, పాలనా వ్యవస్థలూ ఎన్ని మారినా వ్యవస్థీకృతమైన భావజాల దృక్పథం మారకపోవడం దీనికి ప్రథమ కారణం. ఆధునిక మానవుడిని సైతం పురాతన కాలపు మతమూ, అది ప్రతిపాదించిన విలువలే నడిపిస్తున్నాయి. మహిళల ఘనతల గురించి ఘనంగా చెప్పే మతం- వారు ఏ వయసులో స్త్రీ ఎవరి రక్షణలో ఉండాలో శ్లోకాలను ఏకరువు పెడుతుంది. మహిళలు ఏఏ విలువలను ఎలా పాటించాలో నిర్దేశిస్తుంది. మగవాళ్లకు విలువలకు సంబంధించిన విధి విధానాలు ప్రత్యేకంగా ఉండవు. ఆధునికంగా మారిన, మారుతున్న సమాజాన్ని పురాతన మత దృక్కోణ ఛట్రంలో బిగించి ఉంచడం ఏ దేశంలో అయినా మతాచారాలు చేసే పని.
        మహిళలను అణగదొక్కే భావాలను మగాళ్లు మాత్రమే అమలు చేయరు. ఈ సమాజంలో చేత రూపొందింపబడిన మహిళలు, ఇతర బాధితులు సైతం భాగస్వాములు అవుతారు. ఒక రాజకీయ నాయకుడిని తక్కువ చేసి, అవమానించటానికి ఒక రాజకీయ పార్టీ నాయకురాలు అతడికి 'గాజులు' పార్సిలు చేసి పంపుతానని చెబుతుంది. మరొక పార్టీ మహిళానేత మరొక సందర్భంలో తమ ప్రత్యర్థి నాయకుడికి 'చీరలు' పంపిస్తానని ఎకసెక్కాలాడుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు నాయకుడు శక్తిహీనుడని చెప్పటం వారి ఉద్దేశం. గాజులు, చీరలు ధరించటం అబలత్వానికి చిహ్నం అని వారి మాటల పరమార్థం. తమకు తామే అవమానించుకుంటున్నామని గ్రహించలేనంత భావజాల బానిసత్వంలో ఆ మహిళా నేతలు ఇద్దరూ ఉన్నారు. వారే కాదు, అత్యధికులు ఇలాగే ఉంటారు.
           సూర్యరాయాంధ్ర నిఘంటువులో స్త్రీ అనే మాటకు 300 వరకూ పర్యాయ పదాలు ఉన్నాయి. అందులో అత్యధిక పదాలు స్త్రీల అందాన్నో, సౌకుమార్యాన్నో సూచించేవిగా ఉంటాయి. మన పురాణ కథల్లో, ప్రబంధగాథల్లో, సినిమాల్లో ... అన్నిటా దాదాపుగా ఇదే ఒరవడి. అందమూ, అలంకరణా, అణుకువా, అజ్ఞానమూ, పురుషుడే లోకంగా బతికేసే గుణమూ మహిళలకు అనుసరణీయాలు అవుతాయి. వాటిని దాటి సొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవసరాన్ని, అవకాశాన్ని మన ఆధిపత్య సమాజం వారికి ఇవ్వదు.
        అలా అని అణచివేత భావాలదే పై చేయిగా ఈ సమాజం నడిచిపోదు. వాటి నుంచి విడువడుతూ, మార్పు దిశగా ఏ కాలంలోనైనా గట్టి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా అలాగే ఉండి తీరాలీ అన్న సనాతన భావం ఆరచణలో నిలబడదు. అలా నిలబడితే మన రోజువారీ జీవనం ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఆచరణతో కూడిన ఆధునికత జయిస్తున్నది కనుకనే సమాజం ముందుకు నడుస్తోంది. భావజాలంలోనూ అలాంటి మార్పు నిరంతరంగా రావాలి. పాత దానిని పట్టుకు వేలాడే రాజీగుణం, అదే గొప్పది అని చెప్పే పటాటోపం ఉన్నంత కాలం ఆధునిక జీవితంలో గందరగోళం కొనసాగుతుంది. అది ఆధిపత్యవాదులకు బలంగానూ; మహిళలకు, ఇతర బాధితులకు అణచివేతగానూ, అదనపు భారంగానూ దాపురిస్తుంది.
        ఈ స్థితిని, ఈ భావజాల బరువునీ ఇలాగే ఉంచుకొని - మహిళల అభివృద్ధి గురించి, బలసంపన్నత గురించీ మాట్లాడుకోవడం సమాజ ద్వంద్వ విలువలను సూచిస్తోంది. అందుకనే ఒక పక్క పూజల్లో, పురాణాల్లో, ప్రసంగాల్లో వినిపించే మహిళాభ్యుయం ఆచరణలో పూర్తిగా కనిపించటం లేదు. పూజల మాటెలా ఉన్నా- తొలుత స్త్రీలను సొంత ఆలోచన, అభిప్రాయమూ, వ్యక్తిత్వమూ ఉన్న మనుషులుగా గుర్తిస్తే - ఎంతో అభ్యుదయం సాధ్యమవుతుంది. ప్రబంధాల సౌందర్యంగానో, మార్కెట్టు సరుకుగానో కాదు; మనిషిగా ఉనికినివ్వాలి మొదట. అప్పుడే ఎల్లెడలా మహిళాశక్తికి జయ జయ ధ్వానాల పల్లవుల పాట !
- శాంతిమిత్ర