
- స్కిల్ కేసులో ముగిసిన వాదనలు
ప్రజాశక్తి-అమరావతి : స్కిల్ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. గురువారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంటు కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో సీమెన్స్ సంస్థ 90 శాతం నిధులను ఖర్చు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.330 కోట్లను విడుదల చేసి అవినీతికి తెరతీసిందని సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. టిడిపి అధికారంలో ఉండగానే ఈ స్కాం వెలుగులోకి వచ్చిందని, ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే స్థాయిలో పలుకుబడి ఆయనకు ఉందన్నారు. ఈ వాదనను చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తోసిపుచ్చారు. చట్టసభలకు ఎన్నికలు జరగబోయే సమయంలో కావాలని ప్రభుత్వం చంద్రబాబుపై కేసులు నమోదు చేసిందన్నారు. ఒక కేసు తర్వాత మరో కేసు నమోదు చేసి చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయాలనే కుట్రలో ప్రభుత్వం ఉందన్నారు. 2018 నుంచి స్కిల్ కేసు ఉందని, ఇప్పుడు హడావుడిగా కేసు విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్‌ను పూర్తిగా పరిశీలన చేయలేదని రాశారని చెప్పారు. చంద్రబాబును కేసులో ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రిపోర్టు చేసినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో ఉందని తెలిపారు. స్కిల్ కేసులో అరెస్టయిన పిటిషనర్ చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు ఉన్నారని, రెండు రోజులపాటు చంద్రబాబును పోలీసుల కస్టడీకి ఎసిబి కోర్టు ఇచ్చిందని, ఆ తర్వాత మళ్లీ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిందని అన్నారు. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని, అవి తారుమారయ్యే ఆస్కారం లేదని చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది.