Oct 28,2023 21:42

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :'చంద్రబాబునాయుడును జైలులో బంధించి 50 రోజులైంది. ఏ తప్పూ చేయకపోయినా వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఆయనను ప్రజల మధ్యకు రానీయకుండా రాష్ట్ర ప్రభుత్వం జైల్లోనే నిర్బంధించింది' అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. 'గతంలో రాజకీయ కక్షసాధింపు చూశాం. ఇప్పుడు వ్యక్తిగత కక్షసాధింపులు చూస్తున్నాం. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ మంత్రులు, వైసిపి ఎంపిలు, ఎంఎల్‌ఎలు స్టేట్‌మెంట్లు ఇస్తుండడంతో మా నాయకుడి భద్రతపై మాకు సందేహాలు ఉన్నాయి. నిజం గెలవాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నందునే మా తల్లి భువనేశ్వరిని కూడా జైలుకు పంపుతామని మహిళా మంత్రి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు' అని అన్నారు. స్కిల్‌ డవలప్‌మెంట్‌ స్కాం జరిగిందని చెప్తోన్న ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయిందని తెలిపారు. చంద్రబాబుని జైలులో ఉంచడానికి కోట్లాది రూపాయలను లాయర్లకు ఖర్చు పెడుతోందని, ముకుల్‌ రోహత్గీతో వారం వారం వాయిదాలు అడుగుతూ బెయిల్‌ రాకుండా జాప్యం చేయిస్తోందని విమర్శించారు. 'ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ చేస్తున్నా. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి' అని అన్నారు. చంద్రబాబు ఎలాంటి అవినీతీ చేయలేదని చెప్పారు. 'స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది నిజం. 85 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చింది నిజం. ఫైబర్‌ గ్రిడ్‌లో పది లక్షల కనెక్షన్లు ఇచ్చింది నిజం. ఏటా వంద కోట్ల రూపాయలు టర్నోవర్‌ చేస్తోన్న ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటు నిజం. గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఐటి రిటర్న్స్‌ స్క్రూటినీ జరగలేదు. మేం నిజాయితీగా ఉన్నాం' అని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి మా నాయకుడిని దీర్ఘకాలం జైల్లోనే బంధించి ఉంచాలని చూస్తే ఊరుకోబోమని, న్యాయపోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 17ఎపై రెండు వారాల్లో జడ్జిమెంట్‌ రానుందని, అందుకోసం వేచి చూస్తున్నామని తెలిపారు.