గాజా : గాజాలో మంగళవారం ఘోర ఘటన జరిగింది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆసుపత్రిపై జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ దుర్ఘటన పశ్చిమాసియా దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ ఘటనపై హమాస్-ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ దారుణానికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపించగా.. ఇది ఉగ్రమూకల దుశ్చర్యేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
నెతన్యాహు ఖండన...
ఇజ్రాయెల్ వైమానిక దాడులే ఈ దుర్ఘటనకు కారణమని హమాస్ ఆరోపించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. '' ఈ విషయాన్ని యావత్ ప్రపంచం తెలుసుకోవాలి. గాజాలోని అనాగరిక ఉగ్రమూకలే.. అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయి. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) కాదు. మా పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన ఆ ఉగ్రవాదులు.. ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారు '' అని నెతన్యాహు ఆరోపించారు. అటు 'ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్' కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రి సమీపంలో పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఐడీఎఫ్ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో, కొన్ని పోస్టులు చేసింది.