
- సెప్టెంబర్ 17న కొల్లా వెంకయ్య 25వ వర్థంతి
కామ్రేడ్ కొల్లా వెంకయ్య శాసన సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, పొగాకు మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికలలో గెలిచిన అరుదైన రైతు నాయకుడు. విశాఖ ఉక్కు ఆందోళనలో ప్రభుత్వ దమనకాండకు నిరసనగా పార్లమెంటును 90 నిముషాలు స్ధంబింపచేసి సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదిలేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మైదాన ప్రాంత రీజినల్ కమిటీ కార్యదర్శిగా, శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రాంతానికి ప్రత్యక్షంగా వెళ్ళి వారి వెన్నుతట్టిన నాయకుడు. డిటెన్యూగా, పార్వతీపురం కుట్ర కేసు ముద్దాయిగా పది సంవత్సరాలు జైలులో వున్నా, నాల్గు సంవత్సరాలు రహస్య జీవితం గడిపినా పట్టు వదలలేదు. గ్రామీణ పేద ప్రజల విముక్తి కోసం, భూసంస్కరణల కోసం చివరికంటా పోరాడారు.
పెదనందిపాడు పక్కనేవున్న పుసులూరు గ్రామంలో 1921లో గ్రామ అధికారులు సభ జరిపి తమ పదవుల రాజీనామాకి నిర్ణయించి సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా జరిగిన శాంతిసేన ఊరేగింపు, బహిరంగ సభలలో పది సంవత్సరాల వయసులోనే వెంకయ్య పాల్గొన్నారు. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూనే, 1934 అక్టోబర్‌లో జరిగిన బొంబాయి కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా వెళ్లారు. 1936లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నప్పటి నుండి మరణించే వరకూ వెనక్కి తిరగలేదు. పీడిత ప్రజల విముక్తి కోసం రాజీ లేని పోరాటం కొనసాగించారు.
బాపట్ల తాలూకా కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజర్ పెండ్యాల లోకనాథంతో కలిసి గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘానికి రూపమిచ్చారు. 1939లో జిల్లా రైతు సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండీ 1946లో రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి వరకూ రాష్ట్ర రైతులను సంఘటిత పరిచారు. కాలి నడకన గుంటూరు నుండి పల్నాడు మీదుగా ఒంగోలు ప్రాంత గ్రామాలన్నీ తిరిగేవారమని ఆయన సహచరులు మాదాల నారాయణ స్వామి తెలిపారు. అప్పాపురం ప్రాజెక్టు రైతుల సమస్యలూ, బుంగపోత రైతుల సమస్యలు, ఎరువులు సక్రమ ధరలకు అందించాలనీ రైతులలో ప్రచారం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం ప్రభావంతో పెదనందిపాడు గ్రామంలో రైతులు, మాదిగలను, మాలలను ప్రోత్సహించి చెరువులో నీరు ముంచుకునేట్లు చేశారు.
భూమి లేని నిరుపేదలకు భూమి హక్కును కల్పించటం కోసం భూసంస్కరణలను అమలు పరచాలని కొల్లా వెంకయ్య అన్ని పోరాట రూపాలనూ ఎంచుకున్నారు. భూసంస్కరణల కోసం సభలు, సమావేశాలు, సదస్సులు, పాదయాత్రలు-ప్రజాందోళన నుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆందోళన, సుప్రీంకోర్టులో రిట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం వరకూ పాల్గొన్నారు. జూపూడిలో చర్చి కౌలు భూములపై పోరాటం తీవ్రరూపం దాల్చింది. నర్సాయపాలెంలో గ్రామాధికారులు అక్రమంగా అనుభవిస్తున్న బంజరు భూముల కోసం పోరాటం సాగించారు. ప్రఖ్యాత రొంపేరు బంజరు సత్యాగ్రహం ఆయన నాయకత్వంలో జరిగింది. బళ్లారిలో జైలు శిక్ష అనుభవించారు. పోరాట ఫలితంగా 15 వేల ఎకరాలకు పైగా బంజరు భూమిపై పేదలకు యాజమాన్యం లభించింది. వేలాది ఎకరాల మిగులు భూములను పోరాటాల ద్వారా సాధించుకోగలిగారు. 1973 భూగరిష్ట పరిమితి చట్టం వచ్చినా ఆచరణకు నోచుకోలేదు. చట్టాన్ని అమలు పరచటంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించి సుప్రీంకోర్టులో ఆయన ప్రజా ప్రయోజన కేసు వేశారు. చట్టాన్ని అమలు పరచవలసిందిగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజా ఉద్యమాలు బలంగా లేనపుడు ప్రభుత్వాలు, చట్టాలు వున్నవారికి చుట్టాలయ్యాయి. అయినా కొల్లా వెంకయ్య గారు తమ జీవిత చరమాంకంలో కూడా మిగులు భూమి పంపకం కోసం కృషి చేశారు. ప్రజా సమస్యలపై నిరంతర అధ్యయనం, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అన్వయించి ఆచరించటమే కామ్రేడ్ కొల్లా వెంకయ్యకు నివాళి.
- డా|| కొల్లా రాజమోహన్,
నల్లమడ రైతు సంఘం, సెల్ : 9000 657799