
- ఇడి, జిఎస్‌టి ఇంటెలిజెన్స్, ఇన్‌కంట్యాక్స్ దర్యాప్తులే కీలకం
- వాటి ఆధారంగానే స్కిల్ స్కాం ప్రైమాఫెసీ
- సిఐడి విచారణకు ఆదేశం
- కడకు చంద్రబాబు అరెస్టు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కాం జరిగిందా లేదా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారా లేదా అనే విషయాలపై వైసిపి ప్రభుత్వం, టిడిపిల బహిరంగ వాదనల్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర మరుగున పడుతోంది. 'స్కిల్' కుంభకోణానికి ఉప్పందించింది కేంద్ర దర్యాప్తు సంస్థలని చంద్రబాబు అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిఐడి స్పష్టం చేసింది. స్కాం జరిగిందన డానికి మూలం ఎప్పుడో 2018లో మహారాష్ట్రలో జిఎస్‌టి, ఆదాయపన్నుశాఖ (ఐటి), ఆ తర్వాతి కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నిర్వహించి న విచారణలని సిఐడి పేర్కొంది. ఆ నివేదకలే సిఐడి దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలు. వాటిని బట్టే కేసు నమోదు చేసినట్లు విజయవాడ ఎసిబి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
పూణెలో మూలాలు
స్కిల్ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న డిజైన్‌టెక్ పూణె బేస్డ్ సంస్థ. ఎటువంటి వ్యాపార కార్యకలాపాలూ లేని సింగపూర్‌లో రిజిస్టరైన డొల్ల కంపెనీల పేరిట రూపొందించిన నకిలీ ఇన్వాయిస్‌లతో వస్తువులు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేయడంపై 2017-18లోనే పూణెకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) దర్యాప్తు చేపట్టింది. ఆ వెంటనే పూణె ఇన్‌కంట్యాక్స్ యూనిట్ విచారణ చేసింది. ఎపి ప్రభుత్వం, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా డిజైన్‌టెక్‌కు విడుదలైన రూ.371 కోట్లలో కనీసం రూ.241 కోట్లు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించాయి. షెల్ కంపెనీలు బోగస్ ఇన్వాయిస్‌లు ఇవ్వడం వలన ఇది చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, కోర్స్‌వేర్, ఇతర వస్తువులు, సేవలు అందించకుండానే బ్యాంక్ ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడి నుంచి హవాలా పద్ధతుల ద్వారా సొమ్ము బదిలీ చేశారని తొలుత కనుగొన్నది జిఎస్‌టి ఇంటెలిజెన్స్, ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంట్లే. ఇదంతా సరిగ్గా ఎన్‌డిఎ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలిగిన, వైదొలుగుతున్న సమయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఐటి నోటీస్‌తో కదలిక
ఈ సమాచారంతోనే వైసిపి సర్కారు వచ్చాక అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం స్కిల్ స్కాంపై అంతర్గతంగా విచారణ జరిపించి, ప్రాథమిక సాక్ష్యాధారం ప్రైమాఫెసీ ఉందని, సిఐడి దర్యాప్తునకు 2021 సెప్టెంబర్ 7న లేఖ రాశారు. అదే ఏడాది డిసెంబర్ 7న సిఐడి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వెనువెంటనే 13.12.2021న స్కిల్ కార్పొరేషన్‌కు డైరెక్టరుగా పనిచేసిన గంటా సుబ్బారావును తొలి నిందితునిగా అరెస్టు చేసింది. కాగా షెల్ కంపెనీలన్నీ సింగపూర్, ఇతర దేశాల బేస్డ్ కావడంతో మనీలాండ రింగ్ జరిగిందంటూ ఇడి 2022 మార్చి 20న ఇసిఐ ఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. 4.3.2023న సీమెన్స్ ఇండియా మాజీ ఎమ్‌డి సౌమాద్రి శేఖర్ బోస్, డిజైన్‌టెక్ ఎమ్‌డి వికాస్ వినాయక్ ఖన్వెల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌ను ఇడి అరెస్టు చేసింది. ఆ పూర్వరంగంలోనే 4.8.2023న హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ (24) ఇన్‌కంట్యాక్స్ అధికారి దొండపాటి వెంకట హరీష్ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చారు. కేసులో 22వ నిందితునిగా ఉన్న యోగేష్ గుప్తా, మనోజ్ వాసుదేవ పరదేశి మధ్య ఆర్థిక లావాదేవీలు ఆ నోటీస్‌కు ఆధారం. ఏతావాతా చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర దర్యాప్తు సంస్థలే కీలకంగా పని చేశాయని జనవాక్యం.