జెరూసలేం : గాజాలో తాజాగా నెలకొన్న పరిణామాలు, హమస్ సాగిస్తున్న పోరుకు ప్రధాన బాధ్యత ఇజ్రాయిల్ ఆక్రమణ శక్తులదేనని ప్రపంచవ్యాప్తంగా గల కమ్యూనిస్టు పార్టీలు పేర్కొన్నాయి. పాలస్తీనా పీపుల్స్ పార్టీ ఆదివారం ఒక ప్రకటన చేస్తూ, పాలస్తీనా ప్రజలు తమ చట్టబద్ధమైన హక్కులను పొందకపోతే ఈ ప్రాంతంలో, ప్రపంచంలో శాంతి, భద్రత, సుస్థిరతలు సాధించలేమని తాజా ఘర్షణలు రుజువు చేశాయని పేర్కొంది. నెతన్యాహు ప్రభుత్వం అనుసరిస్తున్న నేరపూరితమైన ఆక్రమణ విధానాన్ని ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ (ఎంకెఐ) తీవ్రంగా విమర్శించింది. తూర్పు జెరూసలేంతో సహా వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ ఆక్రమణనలు తక్షణమే ఇజ్రాయిల్ నిలుపుచేయకపోతే ఈ ప్రాంతంలో శాంతి వుండదని బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి రాబర్ట్ గ్రిఫిత్ పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌ను నులిమివేయడానికి పాల్పడుతున్న చర్యలను తక్షణమే విరమించాలన్నారు. పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మద్దతు, సంఘీభావం లభిస్తున్న వేళ కమ్యూనిస్టు పార్టీల ప్రకటనలు వెలువడ్డాయి. పాలస్తీనియన్లకు మద్దతుగా అమెరికా, యూరప్, బ్రిటన్, అరబ్ దేశాల్లోని పలు నగరాలు, పట్టణాల్లో ఆదివారం ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు ఇజ్రాయిల్ వరుస బాంబు దాడులతో గాజాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఐక్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ, తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరారు. అర్ధవంతమైన చర్చలు జరగాలన్నారు. దశాబ్దాల తరబడి ఇలాంటి చర్చలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. చైనా రాయబారి ఝాంగ్ జున్ కూడా రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు.