Oct 08,2023 07:59
  • దేశం యుద్ధంలో ఉంది: నెతన్యాహు
  • రక్షించుకునే హక్కు పాలస్తీనీయులకు ఉంది: అబ్బాస్‌
  • హమాస్‌ తొలుత జరిపిన దాడిలో 100 మంది మృతి

రమల్లా : ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై జరిపిన దాడిలో 200 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారని, మరో 1600మందికి పైగా గాయపడ్డారు. పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ 'ఆపరేషన్‌ అల్‌ అక్సా' పేరుతో తొలుత జరిపిన ఆకస్మిక రాకెట్‌ దాడుల్లో 100 మంది ఇజ్రాయిలీ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ ఏకంగా యుద్ధం ప్రకటించింది. ఇరు పక్షాల మధ్య ఈ స్థాయిలో భీకర దాడులు జరగడం గత యాభై ఏళ్లలో ఇదే మొదటిసారి.
          గాజాలో హెల్త్‌ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ తన మంత్రివర్గ సహచరులతోను, పిఎల్‌ఓ కార్యవర్గ సభ్యులతోను, రక్షణ దళాల ఉన్నతాధికారులతోను శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాలస్తీనీయుల ప్రాణాలను రక్షించేందుకు, వారిలో దృఢతాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. హమాస్‌ రాకెట్‌ దాడి గురించి ప్రస్తావిస్తూ పాలస్తీనీయులకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని అన్నారు. హమాస్‌ చర్యను ఇరాన్‌ ప్రశంసించింది. అల్‌అక్సా మసీదును ఇజ్రాయిలీ సైన్యం అపవిత్రం చేసినందుకు మిగతా 2లో ప్రతీకారంగా ఇజ్రాయిలీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయం హమాస్‌ జరిపిన రాకెట్‌ దాడిలో 100 మంది చనిపోయారని, హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌ భూ భాగంలోకి చొరబడి కొంతమ ంది సైనికులను బందీలుగావించారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కూడా దీనిని ధ్రువీకరించారు. ఇందుకు శత్రువులు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. న్యాయ వ్యవస్థ అధికారాలను హరించే చట్టాన్ని తీసుకువచ్చి, రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు' దేశం యుద్ధంలో ఉంది' అని ప్రకటించారు. హమాస్‌ గతంలో ఎన్నడూ లేనంత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల కాలంలో పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ ఆర్మీ, సెటిలర్‌ గ్యాంగ్‌ల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. పాలస్తీనా భూ భాగాల ఆక్రమణను అవి కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనిపై పాలస్తీనీయుల్లో ఉన్న ఆగ్రహం, నెతన్యాహు తన అధికారాన్ని సుస్థిర పరచుకునేందుకు న్యాయ వ్యవస్థ అధికారాలను కబళించడంపై సైన్యంతో సహా ఇజ్రాయిలీయులు పెద్ద యెత్తున వీధుల్లోకి వస్తుండడం, అలాగే ఇజ్రాయిల్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యకు అమెరికా యత్నాలు ఒక కొలిక్కి వస్తున్న దశలో హమాస్‌ ఈ ఆకస్మిక దాడికి దిగడం గమనార్హం.
 

                                      అలర్ట్‌గా ఉండండి : ఇజ్రాయిల్‌లోని భారతీయులకు ఎంబసీ సూచన

ఇజ్రాయిల్‌ దక్షిణ ప్రాంతంలో యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తినందున భారతీయులెవరూ బయటకు రావద్దని, ఇంటిపట్టునే ఉండాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ ఎంబసీ సూచించింది. హమాస్‌ శనివారం ఉదయం రాకెట్ల దాడికి ప్రతీకారం పేరుతో ఇజ్రాయిల్‌ పెద్దయెత్తున వైమానిక దాడులకు దిగడంతో అక్కడి పరిస్థితి యుద్ధాన్ని తలపిస్తోంది.