Oct 30,2023 16:44

గాజా సిటీ :   ఇజ్రాయిల్‌ హమాస్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైన అనంతరం సాయంతో కూడిన అతిపెద్ద కాన్వాయ్  ఆదివారం గాజాకు చేరుకుంది. సుమారు మూడు డజన్లకు పైగా వాహనాలు గాజాలోకి ప్రవేశించాయని ఆర్మీ తెలిపింది. అయితే పిండి, మందులు, ఇతర పదార్థాలను తీసుకునేందుకు వేలాది మంది ప్రజలు ఎగబడుతున్నట్లు మానవతా సిబ్బంది తెలిపారు. యుద్ధ ప్రాంతంలో ఈ సాయం ఏమాత్రం సరిపోదని అన్నారు. శుక్రవారం నుండి గాజాలో నిలిపివేసిన ఇంటర్నెట్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌ను ఆదివారం పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

8,000ను దాటిన మృతుల సంఖ్య
పాలస్తీనియన్లతో సహా మృతుల సంఖ్య 8,000ను దాటిందని గాజా ఆరోగ్య మంత్రి వెల్లడించారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. యుద్ధం రెండో దశకు చేరుతుందని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది యుద్ధ ట్యాంకులతో పాటు గాజా సరిహద్దులో భారీగా సైన్యం మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. గాజా నగరానికి దక్షిణాన ఉన్న జైతున్‌ జిల్లాలోకి యుద్ధ ట్యాంకులు ప్రవేశించాయని సోమవారం పేర్కొన్నారు. యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగానికి ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న కీలకమైన రహదారిని ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వ్యూహం ప్రకారమే సైన్యం కదలికలు : ఇజ్రాయిల్‌
గడిచిన 24 గంటల్లో 600కు పైగా లక్ష్యాలను చేధించినట్లు సైన్యం మీడియాకు తెలిపింది. ఆదివారంతో పోలిస్తే 450 పెరిగినట్లు పేర్కొంది. ఉత్తర గాజాలో భారీ దాడి జరిగినట్లు హమాస్‌ కూడా వెల్లడించింది. గాజాస్ట్రిప్‌లో ఇజ్రాయిల్‌ సైన్యం క్రమంగా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని ప్రధాన సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి మీడియాకు వివరించారు. అర్థరాత్రి డజనుకి పైగా హమాస్‌ ఉగ్రవాదులను హతమార్చామని హగారి తెలిపారు. గాజాలోని ప్రధాన రహదారిపై ఇజ్రాయిల్‌ ట్యాంకులు తిరుగుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, అది ఏ ప్రాంతమన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు ఆయన నిరాకరించారు.