Sep 20,2023 07:39

రాజుకు లెక్కలంటే భయం. మిగిలిన సబ్జెక్టుల్లో మాత్రం మంచి మార్కులు వస్తాయి. అదే క్లాసు చదువుతున్న సుదర్శన్‌ ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వస్తాడు. ప్రత్యేకించి లెక్కలలో నూటికి నూరు మార్కులు వస్తాయి. అయితే క్లాసులో తనతో పోటీపడుతూ మంచి మార్కులు తెచ్చుకునే రాజుపై సుదర్శన్‌కు కోపం వుంది. లెక్కల్లో డౌట్లు చెప్పమని రాజు ఎంత బతిమాలినా వినిపించుకోడు. ఒకసారి క్లాసుకు కొత్తగా విక్రమ్‌ వచ్చాడు. రాజుతో అతనికి స్నేహం కుదిరింది. ఏ రోజు పాఠాలు ఆ రోజు ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు. లెక్కలను కూడా రాజుకు అర్థమయ్యేలా విక్రమ్‌ చెబుతున్నాడు. ఒకరోజు లెక్కల మాస్టారు ఇచ్చిన హోంవర్కును రాజు, విక్రమ్‌ మాత్రమే చేశారు. సుదర్శన్‌ కూడా ఆ రోజు క్లాసులో చెప్పిన లెక్కలు అర్థం కాక హోంవర్కు చేయలేదు.
ఎప్పుడూ బాగా చేసుకొచ్చే సుదర్శన్‌ హోంవర్కు చేయకపోయేసరికి మాస్టారుకి కోపం వచ్చింది. బాగా తిట్టారు. అందరిముందూ అవమానం జరిగిందని సుదర్శన్‌ ఆ రోజునుండి చదువుపై శ్రద్ధ పెట్టలేదు. బాగా వెనకపడిపోయాడు. రాజుకు చాలా బాధేసింది. విక్రమ్‌ని తీసుకుని సుదర్శన్‌ దగ్గరికి వెళ్లాడు.
'సుదర్శన్‌ నువ్వు బాగా చదివేవాడివి. ఎందుకు ఇలా అయిపోయావు. విక్రమ్‌ మన క్లాసుకు కొత్తగా వచ్చాడు. అయినా ఎటువంటి అహంకారం లేకుండా మనతో కలిసిపోయాడు. తెలియని విషయాలు కూడా బాగా అర్థమయ్యేలా చెబుతాడు. నేను విక్రమ్‌ని చూసి చాలా నేర్చుకున్నాను. నువ్వు కూడా మాతో స్నేహంగా ఉండు. మునుపటిలా చదువుపై శ్రద్ధ పెట్టు. చదువులో నువ్వు వెనుకబడిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది' అని చెప్పాడు. తను ఎంతలా ద్వేషించినా తన మంచి కోసం రాజు పడుతున్న తాపత్రయం చూసి సుదర్శన్‌ చలించిపోయాడు. స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి రాజు, సుదర్శన్‌, విక్రమ్‌ మంచి స్నేహితులయ్యారు. బాగా చదువుకుంటున్నారు.
 

- కనుమ ఎల్లారెడ్డి, 93915 23027.