బాలిక అంటే భారం. ఆడపిల్లంటే అత్తారింటికి వెళ్లి పోయేదే. అమ్మాయంటే ఆట పట్టించే వస్తువు....నేటికీ మన మధ్య వున్న కొన్ని అభిప్రాయాలివి. నిర్భయలు, ఉన్నావ్‌లు, హత్రాస్‌లు, దిశల గత భయానక అనుభవాలు అనుక్షణం వెన్నాడుతూనే వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు వయసున్న బాలికలు 110 కోట్లు. విశ్వవ్యాప్తంగా బాలికలకు సంబంధించిన పలు సమస్యలు, భద్రత, సాధికారత, లింగ వివక్ష, విద్య వంటి అంశాలను చర్చించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కెనడా మహిళ 'రోనా ఆంబ్రోస్' చొరవతో ఐక్యరాజ్యసమితి 2012 నుండి ప్రతి యేటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
బాలికలను విద్యకు దూరం చేయడం, అమ్మాయిల్ని వంటింటికి పరిమితం చేయడం, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, హక్కుల్ని కాలరాయడం, కుటుంబంలో నిర్ణయాధికారం లేకుండా ద్వితీయ శ్రేణి పౌరురాలిగా పక్కన బెట్టడం, వివక్ష, లైంగిక హింసలు, మానభంగాలు, బాలికల్ని కార్మికులుగా మార్చడం, వైద్య సదుపాయాల లేమి, లింగ వివక్ష లాంటి పలు సమస్యలు అనాదిగా వస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా 6.2 కోట్ల మంది బాలికలు నిరక్షరాస్యతతో సతమతమవుతూ వంటింటికి, వృత్తులకే పరిమితం అవుతున్నారు. బాలికల్లో 25 శాతం బలవంతంగా బాల్యవివాహాల ఉచ్చులో పడుతున్నారు. మన దేశంలో పదేళ్లు దాటిన బాలికలు నేటికీ బాల్య వివాహాలు, ఫిమేల్ జనిటల్ మ్యుటిలేషన్ లాంటి దురాచారాలకు గురవుతున్నారు. పేద కుటుంబాలలో 80 శాతం బాలికలు ప్రాథమిక విద్యకు కూడా దూరమవుతున్నారు. ప్రపంచ బాల్యవివాహాలలో 33 శాతం భారత్ లోనే జరుగుతున్నాయని అంచనా. భారత మహిళల్లో 75 శాతం ఏదో ఒక గృహహింసకు గురవుతున్నారు. గ్రామీణ బాలికలు వ్యవసాయ క్షేత్రాలు, బీడీ పరిశ్రమలు, వంట శాలలు, ఇటుక బట్టీలు...వంటి అసంఘటిత రంగాల్లో తమ బాల్యాన్ని కోల్పోతున్నారు.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం-2023 సందర్భంగా ''డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్'' నినాదం తీసుకున్నారు. కౌమార దశలో ఉన్న అమ్మాయిలను లింగ వివక్ష లేకుండా సాధారణ జన జీవన స్రవంతిలోకి ఆకర్షించడానికి ప్రభుత్వాలు పలు చట్టాలను చేశాయి. బాలికలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్య సదుపాయాలు, గౌరవప్రద జీవితం, ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, లైంగిక వేధింపుల కట్టడి, అత్యాచారం చేసిన వారికి కఠిన దండన, హక్కుల కల్పన, ఆస్తి హక్కు, నాయకత్వ అవకాశాల కల్పన, గృహ హింస లేకుండా చూడడం, నైపుణ్యాభివృద్ధి, మహిళా భద్రత, అన్ని రంగాల్లో సమానత్వానికి సకారాత్మక చర్యలు తీసుకోవడం వంటివి జరగాలి. అయితే క్షేత్ర స్థాయిలో ఇవి నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అబ్బాయిలతో సమానంగా విద్య, వైద్య, ఉద్యోగ ఉపాధి, లింగ సమానత్వం, వృత్తి నైపుణ్య వికాసం, పోషకాహారం అందించడం, బాల్య వివాహాలు-బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం, ఆచారాల పేరుతో అమ్మాయిల అణచివేతను వ్యతిరేకించడం, విద్యాలయాల్లో టాయిలెట్ల ఏర్పాటు, సదుపాయాల కల్పన, ఆస్తి హక్కు కల్పన, ప్రసూతి ఆసుపత్రుల అందుబాటు, అత్యాచారాల కట్టడి, పరిసరాల పరిశుభ్రత లాంటి చర్యలను తీసుకోవాలి.
భారతదేశంలో 2020 అంచనాల ప్రకారం 108 మంది పురుషులకు 100 మంది మహిళలు ఉన్నారు. భారత జనాభాలో 51.96 శాతం పురుషులు, 48.04 శాతం మహిళలు. ప్రపంచవ్యాప్తంగా పురుషులు 50.4 శాతం, స్త్రీలు 49.6 శాతం ఉన్నారు. ఆరోగ్య సదుపాయాల లేమి, బాల్యవివాహాల వల్ల కౌమార దశలోనే గర్భం దాల్చడం, ప్రసూతి ఆసుపత్రులు సమీపంలో లేకపోవడం, అవిద్యతో అవగాహనా లేమి...అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. భ్రూణహత్యల్లో 90 శాతం గర్భస్థ శిశువు ఆడపిల్లని తెలిసి జరిగినవని తేలింది. దీనిని గమనించిన ప్రభుత్వాలు లింగ నిర్థారణ పరీక్షలను నిషేధించినా భ్రూణ హత్యల పరంపర కొనసాగుతూనే వుంది. అయితే భ్రూణహత్యల నిరోధానికి 'కిశోరి శక్తి యోజన', ప్రసూతి వైద్య సదుపాయాల కల్పనకు 'సమృద్ధి యోజన', వైద్య సదుపాయాల కల్పనకు 'ఆయుస్మతి యోజన' పథకాలను తీసుకొచ్చారు. కేంద్రం 2015లో తెచ్చిన ''బేటీ బచావో, బేటీ పఢావో'' పథకం పేరుకు మాత్రమే కనిపిస్తున్నది. ఎందుకంటే మణిపూర్‌లో మహిళల నగ ఊరేగింపు, హత్యాచారాలు దేనికి సంకేతం ?
దేశంలో నిత్యం ఏదో ఓ చోట బాలికలకు రక్షణ లేదనేది దీన్నిబట్టి తెలుస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పన్నెండేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి కేంద్రం అసమర్థతను తెలియజేస్తోంది. ఆడపిల్లల్ని రక్షించుకోవడం, ఉన్నత విద్య అందించడం, భ్రూణహత్యలను నిరోధించడం, మహిళలపై అత్యాచారాలను కట్టడి చేయడం లాంటి చర్యలతో లింగ వివక్ష సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అమ్మాయిల మానసిక, సాంఘిక, భౌతిక, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తగు చర్యలు తీసుకోవాలి. వీటికి తోడు యువతులపై యాసిడ్ దాడులు, కిడ్నాపులు లాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
- బి.ఎం.ఎస్. రెడ్డి,
సెల్ : 9949700037