Aug 15,2023 07:18

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సూచిక విడుదల చేసింది. దాని ఆధారంగా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని ప్రకటించింది. గత 70 సంవత్సరాలుగా దేశంలోగాని, అంతర్జాతీయంగాగాని పేదరికానికి సంబంధించి ఉన్న అర్ధానికి భిన్నమైన రీతిలో ప్రభుత్వం పేదరికం గురించి చెప్తోంది. కుళాయినీరు, విద్యుత్‌ కనెక్షన్‌, రేకుల ఇల్లు గాని స్లాబు ఇల్లు గాని, బ్యాంక్‌ అకౌంట్‌ ( అందులో సున్నా బ్యాలెన్స్‌ ఉన్నా సరే) ఉంటే పేదరికం లేనట్టే.

           గడిచిన మూడు దశాబ్దాల కాలపు నయా ఉదారవాద విధానాల కాలంలో దేశ ప్రజల పౌష్టికాహార లభ్యత క్రమంగా దిగజారుతోంది. దేశ ప్రజలు పౌష్టికాహారం పొందుతున్నదీ లేనిదీ అయిదేళ్ళకోమారు సర్వే చేస్తారు. ఈ సర్వేలు తలసరి కేలరీల లభ్యత, మాంసకృత్తుల లభ్యత తగ్గిపోతున్నట్టు సూచిస్తున్నాయి.. ( ఐతే అధికాదాయం పొందుతున్న వారిలో కొవ్వు పదార్ధాల వినియోగం పెరుగుతున్నట్టు కూడా సర్వేలు వెల్లడి చేస్తున్నాయి) ఈ పౌష్టికాహార లోపం ముందు గ్రామీణ ప్రాంతాలలో, ఆ తర్వాత పట్టణ ప్రాంతాలలో సైతం బైటపడింది. మనకి ఎక్కువ శక్తిని ఇచ్చేవి తృణధాన్యాలు, పప్పు దినుసులు. మొత్తం పండించే ఆహారధాన్యాలలో 90 శాతం తృణధాన్యాలే. ఒక సగటు గ్రామీణ పౌరుడు పొందే శక్తి లో మూడింట రెండొంతులు వీటిద్వారానే లభిస్తున్నాయి. కాని నయాఉదారవాద కాలంలో ఈ తృణ ధాన్యాల వినియోగం బాగా తగ్గిపోయింది. ఆఫ్రికా దేశాలలో కన్నా, అభివృద్ధిలో బాగా వెనుకబడిన చాలా దేశాలలో కన్నా మన దేశంలో తగ్గిపోయింది. ( పాలు, గుడ్లు, కోడి మాంసం వంటివి ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే మేత గా వినియోగించే తృణధాన్యాలను కూడా లెక్కలోకి తీసుకున్నా)
             అంతేగాక, గత కొన్ని దశాబ్దాలుగా ఆహారం మీద వెచ్చించే తలసరి వ్యయం వాస్తవ లెక్కల ప్రకారం తగ్గిపోతోంది. (అన్ని ఆహార వస్తువుల మార్కెట్‌ ధరలపైన వినిమయ ధరల సూచిక లో వచ్చే పెరుగుదల ప్రభావం తగ్గించి లెక్కిస్తే వాస్తవ ధర నిర్ధారించవచ్చు) ఒక పక్క జిడిపి వృద్ధి చాలా ఎక్కువగా నమోదు అవుతున్న దేశంలో ఆహారం మీద వెచ్చించే తలసరి వ్యయం తగ్గిపోవడం చాలా అసాధారణ విషయం. ఆదాయాల్లో అసమానతలు తీవ్రంగా పెరిగిపోవడం, జనాభాలో పౌష్టికాహారాన్ని పొందలేని పేదవారి సంఖ్య పెరిగిపోవడమూ దీనికి కారణం
చాలా కాలంనుంచీ ఈ విధంగా పడిపోతున్న పౌష్టికాహార స్వీకరణ గురించి కొందరు ఆర్థిక వేత్తలు చాలా తప్పుడు వాదనలు ముందుకు తెస్తున్నారు. యాంత్రీకరణ ఫలితంగా ఇప్పుడు తక్కువ శక్తి సరిపోతున్నదని, జనాభా వయస్సు పొందిక మారిపోయినందువలన కనీసంగా అవసరమైన శక్తి స్థాయి తగ్గిపోతోందని, ప్రజల రుచులు మారిపోయినందువలన వారు పౌష్టికాహారాన్ని తీసుకోడానికి విముఖంగా ఉన్నారని - ఇలా నానా రకాల పనికిమాలిన వాదనలూ తెస్తున్నారు.
              అధిక జనాభా కలిగివుండి, జనాభాలో మన మాదిరిగానే వయస్సు పొందిక ఉన్న దేశాలు మన మాదిరిగానే అభివృద్ధి చెందుతున్న చోట్ల మన దేశంలో కన్నా ఎక్కువ యాంత్రీకరణ జరిగినా వారి పౌష్టికాహార స్వీకరణ స్థాయి ఏ మాత్రమూ తగ్గిపోవడం లేదు. పైగా మనకన్నా ఎక్కువ మోతాదులో వారు ఎక్కువ పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఐరాస కు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) 2019లో విడుదల చేసిన లెక్కల బట్టి( ఇవే ఇప్పటికి లభిస్తున్న తాజా లెక్కలు) భారతదేశంలో తలసరి తృణధాన్యాల వినిమయం171 కిలోలు. ( ఇందులో మనం వినియోగించే పాలు, గుడ్లు, చికెన్‌ వంటివి ఉత్పత్తి కావడానికి అవసరమైన మేతలో వాడే తృణ ధాన్యాలను కూడా కలిపి లెక్కించారు) ఇదే ఆఫ్రికా ఖండంలో 190 కిలోలు ఉంది. అతి తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 205 కిలోలు ఉంది. ప్రపంచ సగటు 304 కిలోలుఉంది. చైనాలో, బ్రెజిల్‌ లో దానిని మించి 360 కిలోలు ఉంది. ఇక రష్యాలో 407 కిలోలు ఉంది. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లో 494 కిలోలు ఉంది. యూరపియన్‌ యూనియన్‌ దేశాల్లో, అమెరికాలో ఇది 590 కిలోలు! ఇక్కడ గుర్తుంచుకోవలసినది ఒకటుంది. ఎఫ్‌ఎఓ తనంతట తానుగా లెక్కల్ని తయారు చేయదు. ఆ యా ప్రభుత్వాలు అందించే సమాచారం ఆధారంగానే వివరాలు రూపొందిస్తుంది. కాబట్టి ఈ లెక్కలు తప్పుడు తడకలని చెప్పి మన ప్రభుత్వం తప్పించుకోడానికి కుదరదు. అందుచేత 121 దేశాలకు గాను ప్రపంచ ఆకలిసూచికలో మనదేశం 107వ స్థానంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించదు.
            2017-18 నాటి జాతీయ శాంపిల్‌ సర్వే వివరాలను ఆ సంస్థ గతేడాది బహిరంగంగా పోర్టల్‌ లో అందుబాటులో ఉంచింది. దానిని బట్టి 2011తో పోల్చితే 2017-18 నాటికి వినిమయ వస్తువులమీద, సేవలమీద ప్రజలు చేసే ఖర్చు పడిపోయింది. అంతకుముందు దశాబ్దాలనుండీ పౌష్టికాహారంమీద చేస్న్ను ఖర్చు తగ్గిపోవడం గురించి ముందే తెలిపాను, దానికి అదనంగా అన్ని రకాల ఖర్చూ తగ్గిపోవడం అనేది తోడైంది. ఈ నివేదికను వెంటనే ప్రభుత్వం పోర్టల్‌ నుండి తొలగించి ప్రజలకు కీలకమైన సమాచారం అందకుండా కప్పిపుచ్చింది. ఇటువంటిఅసాధారణ చర్య గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు.
          కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ ( జనాభాకు సంబంధిచిన శాస్త్రాన్ని అధ్యయనం చేసే సంస్థ) ముంబైలో ఉంది. దాని డైరక్టర్‌ ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ సంస్థ అయిదేళ్ళకోసారి జాతీయ స్థాయిలో కుటుంబ ఆరోగ్య పరిస్థితిని సర్వే చేస్తుంది. 2019-21 లో చేసిన 5వ సర్వే వివరాలను ఆ సంస్థ వెల్లడి చేసింది. దాని ప్రకారం 2015-16 నాటి 4వ సర్వేతో పోల్చితే చిన్న పిల్లలకు, మహిళలకు సంబంధించిన ఆరోగ్య సూచికలు గణనీయంగా పడిపోయాయి. ఈ వాస్తవాలు ప్రభుత్వాన్ని తగు చర్యల దిశగా కదిలించాలి. కాని అందుకు భిన్నంగా ఆ వాస్తవాలను బైట పట్టినందుకు కంపెనీ డైరక్టర్‌ పదవి నుండి సస్పెండ్‌ అయారు. ఆరోగ్య సూచికలు పతనం కావడానకి అతగాడు ఏ విధంగానూ బాధ్యుడు కాడు. కేవలం వాటిని సేకరించి వెల్లడించడమే అతని బాధ్యత. ఆ వివరాలను గ్రహించి పరిస్థితిని సరిదిద్దడం పోయి ఆ వస్తవాలను తెలియజెప్పినందుకు అతనిపై వేటు వేసింది ఈ ప్రభుత్వం.
ఆరోగ్యసూచికలన్నీ కేవలం పౌష్టికాహారం మీదనే ఆధారపడివుండవు. రక్షిత మంచినీటిని అదరికీ అందించడం ద్వారా, రోగాలను వ్యాప్తి చేసే దోమల వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా, పేగులలోనులిపురుగులను నిర్మూలించడం ద్వారా, పారిశుధ్యాన్ని మెరుగపరచడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచవచ్చు. చాలా దేశాలలో మాదిరిగానే మన దేశంలో కూడా ఈ విషయాలలో పురోగతి నత్తనడకన సాగుతోంది. ఐతే తక్కిన ఆరోగ్య సూచికలు ఎక్కువగా పౌష్టికాహారం తీసుకోవడం మీదనే ఆధారపడివుంటాయి. అటువంటి ఆహారం దొరకనప్పుడు ఆ సూచికలు దిగజారుతాయి.
           4వ కుటుంబ, ఆరోగ్య సర్వే తో పోల్చినప్పుడు 5వ సర్వేలో కూడా ప్రసూతి, శిశు మరణాల రేటు తగ్గడం అనేది కనిపించింది. ( అది గతం కన్నా స్వల్పంగానే తగ్గింది) అదే సమయంలో చిన్న పిల్లలలోను పెద్ద వారిలో కూడా రక్తహీనత బాగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఈ రక్తహీనత ఇదివరకే బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మరింత పెరిగింది. 6 నెలల నుండి 5 ఏళ్ళలోపు చిన్న పిల్లల్లో రక్త హీనత ఉన్నవారు 2015-16 లో 59 శాతం ఉంటే 2019-21 నాటికి 67 శాతానికి పెరిగారు. వీరిలో తీవ్ర స్థాయిలో రక్తహీనత ఉన్నవారు 30.6 శాతం ,ఉండి 38.1 శాతానికి పెరగడం మరీ ఆందోళనకరం.
పెద్ద వారిలో కూడా , అందులో ముఖ్యంగా మహిళలలో రక్తహీనత ఇదే కాలంలో 53 శాతం నుండి 57 శాతానికి పెరిగింది. తీవ్ర రక్తహీనత ఉన్నవారు 28.4 శాతం నుండి 31.4 శాతానికి పెరిగారు. ఇదే మగవారిలో ( 49 సం.లోపువారికి) తీవ్ర రక్తహీనత ఉన్నవారు 23 శాతం నుండి 25 శాతానికి పెరిగారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది. ఈ వాస్తవాలను గమనించి దానిని చక్కదిద్దే చర్యలు తీసుకోవడం పోయి ప్రభుత్వం ఆ వాస్తవాలను గుర్తించడానికి నిరాకరిస్తోంది.
             చిన్న పిల్లల పౌష్టికాహారానికి సంబంధించిన సూచికలు కూడా అంచనాలకన్నా కూడా హీనంగా ఉన్నాయి. 2015-16లో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 36 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 38 శాతం పిల్లలకు వయస్సుకు తగ్గ పొడవులు లేవు. 2019-20 నాటికి తక్కువ బరువు ఉన్నవారి శాతం 32కి, వయస్సుకు తగ్గ పొడవు లేనివారి శాతం 36 కి స్వల్పంగా తగ్గింది. ఎత్తుకు తగ్గ బరువు లేనివారి శాతం కూడా 21 నుండి 19 కి తగ్గింది. ఐదేళ్ళ క్రితం ఐదు రాష్ట్రాల్లో ఈ సూచికలు జాతీయ సగటు కన్నా చాలా హీనంగా ఉండేవి. ఈ కాలంలో ఆ ఐదు రాష్ట్రాల్లో కొంత మెరుగుదల వచ్చినందువలన జాతీయస్థాయిలో కూడా మెరుగుదల కనిపించింది. ఇంకా ఎక్కువ రాష్ట్రాల్లో అవసరమైనమేరకు దిద్దుబాటు చర్యలు తీసుకోవలసివుంది.
            ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సూచిక విడుదల చేసింది. దాని ఆధారంగా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని ప్రకటించింది. గత 70 సంవత్సరాలుగా దేశంలోగాని, అంతర్జాతీయంగాగాని పేదరికానికి సంబంధించి ఉన్న అర్ధానికి భిన్నమైన రీతిలో ప్రభుత్వం పేదరికం గురించి చెప్తోంది. కుళాయినీరు, విద్యుత్‌ కనెక్షన్‌, రేకుల ఇల్లు గాని స్లాబు ఇల్లు గాని, బ్యాంక్‌ అకౌంట్‌ ( అందులో సున్నా బ్యాలెన్స్‌ ఉన్నా సరే) ఉంటే పేదరికం లేనట్టే. తన అంచనాలో పౌష్టికాహారానికి ఆరో వంతు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే పౌష్టికాహారం అందుతున్నదీ లేనిదీ తేల్చడానికి వారు స్వీకరించే ఆహారాన్ని బట్టి కాకుండా, శరీరం ఎత్తుకు, బరువుకు నడుమ ఉండే నిష్పత్తి (బాడీ-మాస్‌ ఇండెక్స్‌) ఆధారంగా తీసుకున్నారు. మన దేశంలో ఎక్కువమంది తక్కువ ఎత్తు, తక్కువ బరువు కలిగివుంటారు. వయస్సుకు తగ్గ ఎత్తు గాని బరువుగాని ఉన్నవారు పేదల్లో తక్కువ. అటువంటప్పుడు ఆ కొలబద్ద యధాతథంగా మన ప్రజలకు వర్తించదు. ఇదంతా చాలదన్నట్టు పౌష్టికాహారానికి సంబంధించి కూడా ప్రమాణాలను ఏ విధంగా తగ్గించాలన్న కసరత్తు ఇప్పుడు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆప్‌ మెడికల్‌ రిసెర్చి ద్వారా సాగిస్తున్నారు.తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం శాస్త్రీయ అధ్యయనాలను ఎంత దారుణంగా దెబ్బ తీస్తున్నారో చూస్తే వెగటు పుడుతున్నది. త్వరలోనే మన దేశంలో పేదరికం పూర్తిగా అంతరించిపోయిందన్న లెక్కలు మన ముందు ప్రత్యక్షం అయినా పాఠకులెవరూ ఆశ్చర్యపోకూడదు మరి !
 

(స్వేచ్ఛానుసరణ)
ఉత్సా పట్నాయిక్‌

ఉత్సా పట్నాయిక్‌