
తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక సమావేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తర కొరియా తరహా పాలన సాగుతోందని పోల్చారు. ఉత్తర కొరియా ఒక సోషలిస్టు దేశం. అంటే శ్రామికుల రాజ్యం. కష్టపడేవారి తరపున నిలబడే ప్రభుత్వం. ఆ శ్రామిక రాజ్యాన్ని కూల్చాలని కుట్రలు పన్నే బడా పెట్టుబడిదారుల భరతం పట్టడానికి, ఆ కుట్రలను భగం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించి, ఆ శ్రామిక రాజ్యాన్ని కాపాడుకోవడం అక్కడి ప్రభుత్వ బాధ్యత. అప్పుడు మాత్రమే అనేక మంది త్యాగాలతో ఏర్పడిన ఆ సోషలిస్టు రాజ్యాన్ని ఎలాగైనా కూల్చేసి, తిరిగి దోపిడీ పాలనను రుద్దాలనే దుష్టుల నుండి కాపాడుకోవడం సాధ్యం. అదే సందర్భంలో ప్రపంచ మార్కెట్లన్నింటినీ కబళించాలని బరితెగించి, విర్ర వీగుతున్న అమెరికా సామ్రాజ్యవాద ఎత్తుగడల నుండి కూడా తనని తను కాపాడుకోవడం ఆ దేశానికి సాధ్యం. ఈ రెండు కర్తవ్యాలను ఆ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే సందర్భంలో తన దేశంలోని సుమారు 2 కోట్ల 60 లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా తన విధానాలను రూపొందించు కుంటోంది.
ఆ దేశంలో విద్య, వైద్యం అందరికీ ఉచితం. ఆహారం, గృహ వసతి అత్యంత సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అందిస్తోంది. ప్రజలు వాడే ఏ సరుకు మీదా ఏ రకమైన పన్నులూ అక్కడ లేవు. మన దేశంతో బాటు, అమెరికా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం కకావికలం కావడానికి కారణమైన కోవిడ్ మహమ్మారిని తన దరిదాపులకు కూడా రాకుండా చేసింది. ఆ దేశ కమ్యూనిస్టు ప్రభుత్వం తన ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడడమే కాకుండా, అనేక దేశాలకు సహాయకారిగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉత్తర కొరియాలోని ప్రభుత్వం అత్యధికమంది ప్రజల తరపున నికరంగా నిలబడి, ఆ ప్రజానుకూల ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్రలు పన్నుతున్న దుష్టుల పట్ల సింహ స్వప్నంగా ఉంటోంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ దేశంలో అత్యధిక మంది ప్రజలకు ప్రజాస్వామ్యం, దుష్టులకు నియంతృత్వం అమలవుతోంది. దేశంలోను, బయట నుండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, ఇటువంటి ప్రజానుకూల పాలనను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది.
నారా లోకేష్ నేడు ఆంధ్ర రాష్ట్రంలోని పాలనను ఉత్తర కొరియా పాలనతో పోల్చడమంటే, అంత ప్రజా రంజక పాలన ఇక్కడ కూడా సాగుతోందనా? లేక తెలుగుదేశం అధ్యక్షులను అరెస్టు చేసి జైల్లో పెట్టించడం ఉత్తర కొరియాలో ప్రభుత్వం దుష్టులను శిక్షించడంతో పోలికా? అలాగైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చినట్లే. ఇదే లోకేష్ ఉద్దేశమా? ఒక్కోసారి మాట్లాడే మాటలు, పోల్చే పోలికలు సక్రమంగా లేకపోతే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. ఏమైనా ఈయన పోలిక అర్ధ రహితం, అసంబద్ధం. నేడు రాష్ట్రంలో అనేక తరగతుల ప్రజలపై తీవ్ర నిర్బంధం సాగుతోంది. తన దాకా వస్తేనే కానీ తెలీదన్నట్లు కాకుండా, రాష్ట్రం లోని నేటి అన్ని రకాల, తాజాగా అంగన్‌వాడీలపై నిర్బంధాలను కూడా ఖండించడం సముచితంగా ఉంటుంది.
- ఎ. అజ శర్మ,
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
ప్రధాన కార్యదర్శి.