స్టాక్‌హౌం : ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌లో ఖైదు చేయబడిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదికి దక్కింది. ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి, అలాగే మానవ హక్కుల పరిరక్షణ, అందరికీ స్వేచ్ఛ కోసం సాగించిన ఉద్యమానికి ఈ అవార్డు లభించింది. నార్వేజియన్ రాయల్ స్వీడిష్ అకాడెమీ కమిటీ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. ఈ ఏడాది నోబెల్ పురస్కారాల్లో చివరిది అయిన ఆర్థిక నోబెల్ బహుమతి సోమవారం ప్రకటిస్తారు.
ఇరాన్ హక్కుల కార్యకర్త నర్గీస్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహిళల హక్కుల కోసం, మరణ శిక్ష రద్దు కోసం, ఇరాన్ జైళ్లలో స్థితిగతుల మెరుగుదల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ధీర వనిత నర్గీస్. ఆమెను ఇరాన్ ప్రభుత్వం 13సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు దోషిగా తేల్చింది. మొత్తంగా 31ఏళ్లు ఆమెకు జైలు శిక్ష విధించింది. 154 కొరడా దెబ్బలు కూడా విధించింది.'మహిళలుా జీవితాం స్వేచ్ఛ' అనేది నర్గీస్ మొహమ్మది నినాదం. కుర్దిష్ మహిళ మాషా జినా అమినిని ఇరాన్ పోలీసులు హత్య చేసినప్పుడు దానికి నిరసనగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. అమిని చనిపోయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక వ్యాసాన్ని రాసి నార్గెన్ జైలు నుంచే పంపించారు. అది న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైంది. మహిళా ఖైదీల వేధింపులు, ఇబ్బందులు, దిగ్భ్రాంతి గొలిపే పరిస్థితులు, దూషణలు వంటి వాటి గురించి ఆ వ్యాసంలో ఆమె వివరించారు.
- ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు
అనేక ఉరిశిక్షలు అమలు చేసిన ఇరాన్‌లో మరణ దండనకు వ్యతిరేకంగా నర్గీస్ గళమెత్తారు. కాలేజీ విద్యార్ధిగా వున్నప్పటి నుంచి ఆమె మహిళల హక్కుల కోసం బలంగా పోరాటం చేస్తున్నారు. ఖైదీలైన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు తోడ్పాటునందించినందుకుగాను 2011లో తొలిసారి ఆమె అరెస్టయ్యారు. రెండేళ్ల తర్వాత విడుదలైన ఆమె మరణశిక్షకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమం చేపట్టారు. 2015లో ఇరాన్‌లోని మితవాద, మతతత్వ ప్రభుత్వం ఆమెను మళ్లీ అరెస్టు చేసింది. బయటకు వచ్చిన తర్వాత రాజకీయ ఖైదీలు ముఖ్యంగా మహిళలపై లైంగిక హింస, వేధింపులను ఆపాలని, జైళ్ల స్థితిగతులను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. జైలులో ఉండగా ఆమె తన సహచర ఖైదీల్లో సంఘీభావానికి కృషి చేశారు. దీంతో జైలు అధికారులు ఆమెపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు.