Oct 15,2023 10:05

న్యూఢిల్లీ : హమస్‌ సాయుధులను అణిచేసే పేరుతో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దురాక్రమణ దాడులను అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ (ఐప్సో) తీవ్రంగా ఖండించింది. పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీతో కలిసి ఐప్సో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహించింది. సామూహిక మారణహోమ ముప్పును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐకెఎస్‌ తదితర కార్మిక, ప్రజా సంఘాలు కూడా పాల్గొన్నాయి. ర్యాలీలో పాల్గొన్నవారిని ఉద్దేశించి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యులు, ఐప్సో ప్రధానకార్యదర్శి అరుణ్‌కుమార్‌, నాయకులు జి దేవరాజన్‌, ఎంపి పి సంతోష్‌కుమార్‌, ఎఐకెఎస్‌ కోశాధికారి పి క్రిష్ణప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు విపి సాను, న్యాయవాదుల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పివి సురేంద్రనాథ్‌, ప్రొఫెసర్‌ శాశ్వతి మజుందార్‌, న్యాయవాది సుభాష్‌ చంద్రన్‌, వివేక్‌ శర్మ, ఐద్వా నాయకులు మైమూనా మొల్లా, సాయి ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణకు తెర దింపుదాం..పాలస్తీనాను కాపాడుదాం అని నినదించారు. మానవ హక్కులను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు.
 

                                                               స్వదేశానికి మరో 235 మంది భారతీయులు

హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో...ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే 'ఆపరేషన్‌ అజరు' రెండో విడతలో భాగంగా 235 మంది భారతీయులతో కూడిన విమానం శనివారం ఢిల్లీకి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున టెల్‌ అవీవ్‌ నుంచి బయలుదేరిన తొలి బ్యాచ్‌ ప్రత్యేక విమానం ద్వారా 212 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం స్వదేశానికి చేరుకున్న రెండో బ్యాచ్‌ 235 మంది భారతీయులకు కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. 'ఆపరేషన్‌ అజరు'లో భాగంగా రెండు విడతలు పూర్తయ్యాయి.
 

                                                  18 వరకు టెల్‌ అవీవ్‌కు ఎయిరిండియా సర్వీసులు బంద్‌

ఇజ్రాయెల్‌కు వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా తాత్కాలికంగా నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ విమానాల రద్దును మరికొన్ని రోజులు పొడిగించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఢిల్లీ - టెల్‌ అవీవ్‌ మధ్య రాకపోకలు సాగించే విమానాలను ఈ నెల 18 వరకు నిలిపేస్తున్నట్లు ఎయిరిండియా అధికారి శనివారం వెల్లడించారు. అయితే, అవసరాన్ని బట్టి ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఛార్టెర్డ్‌ విమానాలను నడుపుతుందని ఆ అధికారి తెలిపారు.