ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, రాష్ట్ర పౌర విమానయాన శాఖ మంత్రి వి.కె సింగ్ లకు లేఖ రాశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూలల నుంచి స్వామి దర్శనానికి విచ్చేస్తుంటారని, పర్యాటకులు ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి నగరాల విమానాశ్రయాలను ఆశ్రయించి అక్కడి నుంచి తిరుపతికి కష్ట సాధ్యమైన ప్రయాణం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు, పొరుగు జిల్లాలలో అత్యధిక మంది జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తుంటారని, వీరు కూడా సుదూర నగరాలైన చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాదు వంటి విమానాశ్రయాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. 2017లో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించినప్పటికీ అంతర్జాతీయంగా విమాన సర్వీసులు లేకపోవడం వలన విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీయులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని., పై విషయాలను సమగ్రంగా పరిశీలించి తిరుపతిలో అంతర్జాతీయ పౌర విమానయాన సర్వీసులు పునరుద్ధరించాలని ఈ లేఖలో పేర్కొన్నారు.










