పెరుగుతున్న ఆయిల్‌పామ్ విస్తీర్ణం
నూజివీడు ప్రాంతంలో సారవంత భూములు
ఉద్యానశాఖ జిల్లా అధికారి ఎస్.రామ్మోహనరావు
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
జిల్లాలో ఉద్యానశాఖ ఎంతో కీలకం. ఒకప్పుడు చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాలకే పరిమితమైన అటవీ ప్రాంతాలు కొత్త జిల్లాల ఏర్పాటుతో నూజివీడు, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాలకు విస్తరించింది. ప్రధానంగా జిల్లాలో మామిడి విస్తీర్ణం భారీగా పెరిగింది. దాంతో ఏలూరు జిల్లా ప్రపంచపటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అయితే కొత్తజిల్లాల ఏర్పాటుతో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖపరంగా జరిగిన మార్పులను ఆ శాఖ జిల్లా అధికారి (డిప్యూటీ డైరెక్టర్) ఎస్.రామ్మోహనరావు 'ప్రజాశక్తి' ముఖాముఖీలో వివరించారు.
ప్రశ్న : జిల్లాలో ఎంతమేర ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయి?
జిల్లాలో 1.8 లక్షల హెక్టార్లలో ఉద్యానపంటలు విస్తరించి ఉన్నాయి. వీటిల్లో కొబ్బరి 14 వేల హెక్టార్లు, మామిడి 14 వేల హెక్టార్లు, కోకో 15 వేల హెక్టార్లు, జీడీ మామిడి ఏడు వేల హెక్టార్లు, నిమ్మ 6500 హెక్టార్లు, కాయగూరలు 1500 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి.
ప్రశ్న : కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యానపంటలు పెరిగినట్లా ? తగ్గినట్లా?
కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ఉద్యానపంటలు ఎప్పటిలాగానే ఉన్నాయి. నూజివీడు మండలంలో మామిడి, ఆయిల్‌పామ్ పంటలు అధికంగా ఉన్నాయి. కైకలూరు మండలం పూర్తిగా వరిసాగు నియోజకవర్గమైనప్పటికీ ఉద్యాన పంటల విస్తీర్ణం ఏ మాత్రమూ తగ్గలేదు.
ప్రశ్న : జిల్లాలో ఏయే పంటల సాగు లాభదాయకంగా ఉంది?
ఆయిల్‌పామ్ టన్ను ధర 2022 మేలో రూ.23,340గా ఉంది. 2023 మేలో అదికాస్తా రూ.12,844కు పడిపోయింది. గతంలో వేసిన పంట కాలం పూర్తయింది. ఇప్పుడు వేసేవి వచ్చే 25 ఏళ్ల వరకూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరపంటల సాగే లాభదాయకం. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా కోకో వేసుకుంటే ఒకదానిలో లాభం లేకున్నా.. మరో దానిలో లాభం ఉంటుంది. కూలీ, ఇతరాలకు ఒక పంట పోయినా, మరో పంట ఆదాయంగా ఉంటుంది.
ప్రశ్న : సంప్రదాయ సాగు చేస్తున్న రైతులకు మీరిచ్చే సలహా ఏమిటీ?
ఏ పంట అయినా ఆధునిక సాంకేతికతను వినియోగించడం ఉత్తమం. సమగ్ర ఎరువుల విధానం, ఇంటిగ్రేటెడ్ సాగు పద్ధతులను రైతులు వినియోగించాలని సూచిస్తున్నాం.
ప్రశ్న : జిల్లా భూగర్భ జలాలు అందుబాటు ఎలా ఉంది?
జిల్లాలో నూజివీడు ప్రాంతంలో భూసారం బాగుంది. నీరు కూడా అందుబాటులో ఉంది. టి.నరసాపురం, చింతలపూడి, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో నీరు బాగుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంది. దీంతో క్యాజురైనా, యుకలిఫ్టస్ తగ్గింది. పొగాకు కూడా తగ్గింది. ఆయిల్‌పామ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఏడువేల హెక్టార్లకు పెంచాలని నిర్ణయించాం. 1500 హెక్టార్లు పెంచాము.
ప్రశ్న : మొక్కలు సరఫరా చేస్తున్నారా?
వేగివాడలో కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ద్వారా నాణ్యమైన మొక్కలు అందిస్తున్నారు. విజయరాయి, తుక్కులూరు నర్సరీల్లో సబ్సిడీపై మొక్కలు అందిస్తున్నారు.
ప్రశ్న : ప్రభుత్వ సబ్సిడీ ఎంతమేర ఇస్తున్నారు?
ఆయిల్‌పామ్‌పై ప్రభుత్వం నాలుగేళ్లు సబ్సిడీ ఇస్తోంది. హెక్టార్‌కు నాలుగేళ్లకు రూ.29 వేలు చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. అంతరపంటలకు రూ.21 వేలు, కోకో వేసుకుంటే మూడేళ్లకు రూ.20 వేలు చొప్పున సబ్సిడీ ఇస్తారు.
ప్రశ్న : కోల్డ్ స్టోరేజ్‌లకు ఎంతమేర సబ్సిడీ ఇస్తున్నారు?
రైతులు సంఘాలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే కోల్డ్ స్టోరేజ్‌లకు 75 శాతం సబ్సిడీ వస్తుంది. యూనిట్ కాస్ట్ రూ.15 లక్షలు ఉంటే, సబ్సిడీ రూ.11.50 లక్షలు ఇస్తారు. ఇలా పలురకాల సబ్సిడీలను ప్రభుత్వం అందిస్తుంది.










