ప్రజాశక్తి -రేపల్లె :మొక్కజన్న పంటనష్టం నమోదులో అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యం. విజయ నిర్మల తెలిపారు. మండలంలోని బేతపూడి గ్రామ సచివాలయంలో గురువారం రైతులను, అధికారులను విచారింస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విచారణాధికారి విజయ నిర్మల మాట్లాడుతూ. 2023 ఎప్రియల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాంతంలో వేసిన మొక్కజన్న పంటకు కొంత మేర నష్టం వాటిల్లిందని అన్నారు. పంటనష్టం జరిగిన రైతులను నమోదు చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు ఈ క్రాఫ్ నమోదు చేసుకున్న రైతుల పంటలకు నష్టం జరిగితే నమోదు చెయ్యాలని, పంటనష్టం జరిగిన పొలములో సంబంధిత రైతుతో ఫోటోలు తీసి నష్టపరిహారం నమోదు చెయ్యాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు నిబంధనలు పాటించ కుండా అనర్హులైన వారితో, పొలము లేకున్నా, ఈక్రాపు నమోదు లేకున్నా నమోదు చేశారని, నిజమైన పంటనష్టం జరిగిన రైతుల పేర్లు నమోదు చెయ్యలేదనే ఫిర్యాదులు అందటంతో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారులను, రైతుల వద్దనుండి లిఖిత పూర్వక ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. విచారణ పూర్తి అయిన తరువాత జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో చీరాల వ్యవసాయ సహాయ సంచాలకులు ఎఫ్రాయిము రైతులు పాల్గొన్నారు.










