- డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 10 వికెట్లతో గెలుపు
నేపాల్ ఇన్నింగ్స్ 230/10 పల్లెకల్ : పల్లేకల్ : ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సూపర్-4కు భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ లక్ష్య ఛేదన సమయంలో 2.1 ఓవర్ల వద్దకు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కొద్ది సేపు నిలిచిపోయింది. వర్షం తగ్గిన అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. రోహిత్ శర్మ (74 పరుగులు), శుభమన్ గిల్ (67) ధాటిగా ఆడటంతో ఈ లక్ష్యాన్ని భారత్ 20.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా, 147 పరుగులు చేసి, ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా ప్రపంచ క్రికెట్ అగ్రజట్టు, సూపర్‌స్టార్స్‌తో నిండిన టీమ్ ఇండియాపై చారిత్రక వన్డేలో నేపాల్ అద్వితీయ ప్రదర్శన చేసిందని భావించాలి. ఇటీవల భారత్-ఏతో మ్యాచుల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయిన నేపాల్ జాతీయ జట్టు.. తాజాగా ఆసియా కప్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో విశేషంగా ఆకట్టుకుంది. ఓపెనర్లు ఆసిఫ్ షేక్ (58, 97 బంతుల్లో 8 ఫోర్లు), కుశాల్ బి (38, 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సోంపాల్ కామి (48, 56 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ టాప్, లోయర్ ఆర్డర్ రాణించటంతో 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (3/61), రవీంద్ర జడేజా (3/40) మూడేసి వికెట్లు పడగొట్టారు.
ఔరా నేపాల్..! : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్‌తో వర్షార్పణమైన మ్యాచ్‌లో భారత బౌలర్లకు అవకాశం చిక్కలేదు. దీంతో నేపాల్‌పై తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించారు. కొత్త బంతితో పేసర్లు మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లు అవకాశాలు సృష్టించినా.. ఫీల్డర్లు నిరాశపరిచారు. తొలి ఐదు ఓవర్లలోనే ఏకంగా మూడు క్యాచులు నేలపాలయ్యాయి. అందివచ్చిన జీవనదానాలతో నేపాల్ ఓపెనర్లు కదం తొక్కారు. భారత బౌలర్లను ఎదుర్కొని 100 పరుగులైనా చేస్తుందా? అనే అనుమానాలు చవిచూసిన నేపాల్ ఏకంగా 48.2 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుకుని 230 పరుగులు చేసింది.










