అమరావతి : భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అరుదైన ఫీట్ సాధించి విజయపథంలో దూసుకుపోతుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ... ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత క్రికెట్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇలా మూడు ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానం చేరుకోవడం ఇదే తొలిసారి. భారత్ కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్ ఆ జాబితాలో చేరింది.
వన్డే ర్యాంకింగ్స్‌లో 116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. టెస్ట్‌లు 118 పాయింట్లతో.. టీ20ల్లో 264 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌లో ఉండగా.. పాకిస్థాన్ (115), ఆస్ట్రేలియా (111) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఆసీస్‌తో సిరీస్‌ను నెగ్గితే వరల్డ్ కప్‌నకు అగ్రస్థానంతో బరిలోకి దిగే అవకాశం భారత్‌కు ఉంటుంది.










