
- పేరు మార్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ యత్నం
- కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైల్వే మంత్రిత్వశాఖ 'ఇండియా' పేరును తొలగించి 'భారత్' పేరుతో భర్తీ చేయాలని ప్రతిపాదించింది. పేరు మార్పునకు సంబంధించి కేంద్ర మంత్రివర్గానికి తెలిపింది. భారత్ పేరు వినియోగానికి సంబంధించి ఇలాంటి ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు రావడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ శాఖలు భారత్ అనే పేరును ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే పేర్లకు సమాన ప్రాధాన్యత ఉందని, అందువల్ల కేంద్ర మంత్రివర్గం భారత్ అనే పేరును ఉపయోగించడంలో తప్పులేదని ప్రభుత్వం వాదిస్తోంది. జి-20 సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన విందుకు సిద్ధం చేసిన ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. జి-20 నేతల సదస్సులో ప్రధాని మోడీ టేబుల్ ముందు భారత్ అని రాశారు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల్లో కూడా ఇండియా పేరును తొలగించి, దానికి బదులు భారత్‌ను ఉపయోగించాలని ప్రతిపాదించారు.