
- ఛేదనలో రాహుల్, కోహ్లి జోరు
- జడేజా, కుల్దీప్, అశ్విన్ మ్యాజిక్
- ఆసీస్‌పై భారత్
ఘన విజయం లక్ష్యం 200 పరుగులు. ఛేదనలో రెండు పరుగులకే టాప్ ఆర్డర్‌లో మూడు వికెట్లు పతనం. రోహిత్, కిషన్, అయ్యర్ సున్నా పరుగులకే నిష్క్రమించారు. బంతి తిరుగుతున్న పిచ్‌పై మాక్స్‌వెల్, జంపా మాయను కాచుకుని నిలువటం సాధ్యమేనా అనే అనుమానాలు. ఇక్కడే విరాట్ కోహ్లి (85), కెఎల్ రాహుల్ (97) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అర్థ సెంచరీలతో నాల్గో వికెట్‌కు 165 పరుగులు జోడించిన కోహ్లి, రాహుల్.. చెన్నైలో కంగారూ కొట్టి ప్రపంచకప్ వేటను షురూ చేశారు. చెన్నై : ఐసీసీ 2023 ప్రపంచకప్ వేటలో టీమ్ ఇండియా తొలుత ఆస్ట్రేలియా మెడలు వంచింది. ఆదివారం చెన్నైలో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల ఛేదనలో కెఎల్ రాహుల్ (97 నాటౌట్, 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (85, 16 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఖాతా తెరవకుండానే నిష్క్రమించటంతో 2/3తో నిలిచిన భారత్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుంది. రాహుల్, కోహ్లి జోడీ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని అందించింది. తొలుత రవీంద్ర జడేజా (3/28), కుల్దీప్ యాదవ్ (2/42), జశ్‌ప్రీత్ బుమ్రా (2/35) రాణించటంతో ఆస్ట్రేలియా 199 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో డెవిడ్ వార్నర్ (41, 52 బంతుల్లో 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (46, 71 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. ఛేదనలో చెలరేగిన కెఎల్ రాహుల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
భయపడినా..అదరగొట్టారు : ఛేదనలో టీమ్ ఇండియాకు ఆసీస్ పేసర్లు గట్టి షాక్ ఇచ్చారు. లక్ష్యం చిన్నదే అయినా.. 2 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకోవటంతో ఆతిథ్య జట్టు విజయావకాశాలు అమాంతం పడిపోయాయి. జోశ్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగటంతో రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇన్నింగ్స్ తొలి 12 బంతులకే పెవిలియన్ బాట పట్టారు. ఈ సమయంలో విరాట్ కోహ్లి (85), కెఎల్ రాహుల్ (97 నాటౌట్) అద్భుత ఆటతీరు చూపించారు. ఛేదనలో మొనగాడు కోహ్లికి రాహుల్ చక్కటి సహకారం అందించాడు. కోహ్లి 12 పరుగుల వద్ద ఓ జీవన దానం పొందాడు. అవకాశం చక్కగా సద్వినియోగం చేసుకున్న కోహ్లి.. మూడో వికెట్‌కు రాహుల్‌తో కలిసి గెలుపు భాగస్వామ్యం నిర్మించాడు. కోహ్లి మూడు ఫోర్లతో 75 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. రాహుల్ ఐదు ఫోర్లతో 72 బంతుల్లో అర్థ శతకం కొట్టాడు. అర్థ సెంచరీల అనంతరం ఇద్దరూ గేర్ మార్చారు. చివర్లో కోహ్లి అవుటైనా.. హార్దిక్ పాండ్య (11 నాటౌట్) తోడుగా రాహుల్ లాంఛనం ముగించాడు. 41.2 ఓవర్లలోనే భారత్ 201 పరుగులు చేసి ప్రపంచకప్‌లో తొలి విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ (3/38) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.
మనోళ్ల మాయ : టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత ఎంచుకుంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (0)ను బుమ్రా పవర్‌ప్లేలోనే సాగనంపి బ్రేక్ ఇచ్చాడు. కానీ డెవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) జోడీ ఆసీస్‌ను నిలబెట్టారు. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. బంతి స్పిన్నర్ల చేతికి అందటంతో కథ మారింది. వార్నర్‌ను కుల్దీప్.. స్మిత్‌ను జడేజా సాగనంపగా.. ఆ తర్వాత మరో బ్యాటర్ క్రీజులో కుదురుకోలేదు.
మార్నస్ లబుషేన్ (27), గ్లెన్ మాక్స్‌వెల్ (15)లను సైతం జడేజా, కుల్దీప్ జోడీ వెనక్కి పంపించింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. కామెరూన్ గ్రీన్ (8), ఆడం జంపా (6)లు సైతం ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ (15), మిచెల్ స్టార్క్ (28) కాసిన్ని పరుగులు జోడించారు. 49.3 ఓవర్లలో కుప్పకూలిన ఆస్ట్రేలియా 199 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు కూల్చారు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (ఎల్బీ) హాజిల్‌వుడ్ 0, ఇషాన్ కిషన్ (సి) కామెరూన్ గ్రీన్ (బి) మిచెల్ స్టార్క్ 0, విరాట్ కోహ్లి (సి) లుబుషేన్ (బి) హాజిల్‌వుడ్ 85, శ్రేయస్ అయ్యర్ (సి) వార్నర్ (బి) హాజిల్‌వుడ్ 0, కెఎల్ రాహుల్ 97 నాటౌట్, హార్దిక్ పాండ్య 11 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (41.2 ఓవర్లలో 4 వికెట్లకు) 201.
వికెట్ల పతనం : 1-2, 2-2, 3-2, 4-167.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 8-0-31-1, జోశ్ హాజిల్‌వుడ్ 9-1-38-3, పాట్ కమిన్స్ 6.2-0-33-0, గ్లెన్ మాక్స్‌వెల్ 8-0-33-0 , కామెరూన్ గ్రీన్ 2-0-11-0, ఆడం జంపా 8-0-53-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : వార్నర్ (సి,బి) కుల్దీప్ యాదవ్ 41, మిచెల్ స్టార్క్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0, స్టీవ్ స్మిత్ (బి) రవీంద్ర జడేజా 46, లబుషేన్ (సి) రాహుల్ (బి) రవీంద్ర జడేజా 27, మాక్స్‌వెల్ (బి) కుల్దీప్ యాదవ్ 15, అలెక్స్ కేరీ (ఎల్బీ) రవీంద్ర జడేజా 0, కామెరూన్ గ్రీన్ (సి) హార్దిక్ పాండ్య (బి) అశ్విన్ 8, పాట్ కమిన్స్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) బుమ్రా 15, మిచెల్ స్టార్క్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) సిరాజ్ 28, ఆడం జంపా (సి) కోహ్లి (బి) హార్దిక్ పాండ్య 6, హాజిల్‌వుడ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (49.3 ఓవర్లలో ఆలౌట్) 199.
వికెట్ల పతనం : 1-5, 2-74, 3-110, 4-119, 5-119, 6-140, 7-140, 8-165, 9-189, 10-199.
బౌలింగ్ : బుమ్రా 10-0-35-2, మహ్మద్ సిరాజ్ 6.3-1-26-1, హార్దిక్ పాండ్య 3-0-28-1, అశ్విన్ 10-1-34-1, కుల్దీప్ యాదవ్ 10-0-42-2, రవీంద్ర జడేజా 10-2-28-3.