Sep 12,2023 12:19

కొలంబో : ఆసియా కప్‌ 2023 సూపర్‌-4 లో భాగంగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌.. మంగళవారం శ్రీలంకతో తలపడనుంది. రోహిత్‌ సేన సన్నద్ధమయ్యింది. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్‌ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయాన్ని సాధిస్తే ... 2023 ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా రికార్డులకెక్కుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఫైనల్‌ కు చేరే అవకాశం భారత్‌కు ఉంటుంది. అయితే ... భారత్‌, శ్రీలంక మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని కొలంబో వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొలంబోలో ఈ రోజు ఉదయం 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. ఆకాశం 98 శాతం మేఘావృతమై ఉండగా.. మ్యాచ్‌ జరిగే సమయంలో వాన కురవొచ్చని చెబుతున్నారు. దీంతో మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశాలపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కొలంబోలో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉందని సమాచారం.

                                                  నేటి మ్యాచ్‌ రద్దయినా.. భారత్‌కు కలిసొచ్చే అంశమే...

ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే.. భారత్‌, శ్రీలంక ఖాతాలో చెరో పాయింట్‌ చేరుతుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు కాబట్టి ఈరోజే ఫలితం తేలుతుంది. సూపర్‌-4లో ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచిన భారత్‌, శ్రీలంక జట్ల ఖాతాలలో రేండేసి పాయింట్స్‌ ఉన్నాయి. నేటి మ్యాచ్‌ రద్దయితే భారత్‌, శ్రీలంక ఖాతాలలో మూడేసి పాయింట్స్‌ ఉంటాయి. అప్పుడు ఫైనల్‌ రేసులో భారత్‌, శ్రీలంకతో పాటు పాకిస్తాన్‌ కూడా ఉంటాయి. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు మరో బెర్త్‌ కోసం శ్రీలంక, పాకిస్తాన్‌ మధ్య పోటీ నెలకొంటుంది. నేటి మ్యాచ్‌ రద్దు అయినా రోహిత్‌ సేనకు కలిసొచ్చే అంశమే.