మాలె: హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత దేశం అతిపెద్ద వాటాదారు అని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చెప్పారు. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత మహ్మద్ ముయిజ్జు విజయం సాధించడంతో తన అతి పెద్ద పొరుగు దేశంతో మాల్దీవుల సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన సలహాదారు, పిపిఎం పార్టీ ఉపాధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ (ముండు) స్పష్టం చేశారు. ముయిజ్జును అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.' కాల పరీక్షకు తట్టుకుని నిలబడిన భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, హిందూ మహా సముద్ర ప్రాంతలో సహకారాన్ని పెంపొందించుకోడానికి భారత్ కట్టుబడి ఉంది' అని ఆ ట్వీట్‌లో మోడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ద్వీప దేశంలో భారత సైన్యం కార్యకలాపాలకు సోలీ ప్రభుత్వం అనుమతించడాన్ని ముయిజ్జు తీవ్రంగా విమర్శించారు. మొదట్లో 'ఇండియా అవుట్' అని పిపిఎం-పిఎన్‌సి ప్రతిపక్ష కూటమి నినదించడంతో ముయిజ్జు బీజింగ్‌కు సన్నిహితంగా ఉన్నారనే భావన ఏర్పడింది. గతంలో పిపిఎం పార్టీకి చెందిన యామీన్ ప్రభుత్వం (2013-18) అధికారంలో ఉండగా భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. 2018లో ద్వీప దేశం నుంచి భారత సైన్యాన్ని, హెలికాప్టర్లను వెనక్కి తీసుకోవాలని యామీన్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఆ తరువాత ప్రతిపక్షంలో ఉండగా కూడా దీనిపై డిమాండ్ చేసింది. మాల్దీవుల భూభాగం విస్తీర్ణం మొత్తం 298 చదరపు కిలో మీటర్లు. జనాభా 5.21 లక్షల జనాభా, బ్రిటిష్ పాలన నుండి 1965 జులైలో స్వాతంత్య్రం పొందిన ఈ ఇస్లా మిక్ దేశం షాంఘై సహకార కూటమిలో డైలాగ్ పార్టనర్‌గా ఉంది.