Sep 18,2023 11:59

జెనీవా : పంచదారకు సంబంధించిన వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం భారత్‌ - బ్రెజిల్‌ పరస్పర చర్చలను ప్రారంభించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఒ)లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయని, ఇథనాల్‌ ఉత్పత్తి సాంకేతితను బ్రెజిల్‌ భారత్‌తో పంచుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పంచదార, ఇథనాల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే బ్రెజిల్‌ అగ్రస్థానంలో ఉంది. ఇథనాల్‌ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికత విషయంలోనూ బ్రెజిల్‌ ముందుంది. ఇప్పటికే కొన్ని రౌండ్ల చర్చలు జరిగాయని, ఇథనాల్‌ సాంకేతికతను భారత్‌తో పంచుకోవడానికి బ్రెజిల్‌ సిద్ధంగానే ఉందని అధికారి చెప్పారు. వాహనాలకు ఉపయోగించే పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం ద్వారా చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్‌ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌లో 20 శాతం వరకూ ఇథనాల్‌ కలపడానికి కొన్ని వాహనాలకు కేంద్రం అనుమతించింది. 2025 నాటికి అన్ని వాహనాలకు 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను ఉపయోగించాలని లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇథనాల్‌ సాంకేతికతను బ్రెజిల్‌ అందిస్తే, అందుకు ప్రతిగా భారత్‌ ఏదైనా సహాయం అందించాల్సి ఉంటుంది.