- పదేళ్లలో ఎసిఎ దేశానికి రోల్‌మోడల్
- బిసిసిఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ
- విశాఖలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 70వ వార్షికోత్సవ పైలాన్ ఆవిష్కరణ
ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : వచ్చే పదేళ్లలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) దేశానికే రోల్ మోడల్ అవుతుందని బిసిసిఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ అన్నారు. ఎసిఎ ప్లాటినం జూబ్లీ వేడుకలు విశాఖలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఎసిఎ - విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఎసిఎ 70వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బిన్నీ మాట్లాడుతూ.. ముంబై, ఢిల్లీ అసోసియేషన్లకు దీటుగా ఎసిఎ రానున్న కాలంలో నిలువనుందన్నారు. 70 ఏళ్లలో ఎసిఎ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆంధ్రాలో ప్రతిభగల క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని, భవిష్యత్తులో మరింత మంది దేశ క్రికెటర్లుగా తయారయ్యే అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.శరత్ చంద్రారెడ్డి, ఎస్‌ఆర్.గోపీనాథ్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మైదానాలను అధునాతనంగా తీర్చిదిద్దడం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిళ్లకూ గురికాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఎసిఎ అవకాశం కల్పిస్తూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించిందని తెలిపారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు, మాజీ ఇండియన్ క్రికెటర్ మదన్ లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికీ ఎసిఎ విశేష కృషి చేస్తోందన్నారు. ఎస్‌ఆర్.గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరి సలహాలూ, సూచనలూ తీసుకుని మరింత ముందుకు వెళ్తామన్నారు. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ద్వారా ప్రతిభ కలిగిన క్రికెటర్లను గుర్తించడం అభినందనీయమన్నారు. ఎసిఎ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 600 మంది క్రికెటర్లను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎల్ చైర్మన్ మంచో ఫెర్రర్, ఎసిఎ జాయింట్ సెక్రటరీ రాకేష్, ట్రెజరర్ చలం పాల్గొన్నారు.










