Aug 11,2023 07:31

            భారత జాతీయోద్యమంలో ఒక ప్రధాన ఘట్టంగా నిలిచిన క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా క్విట్‌ కార్పొరేట్‌ అంటూ ఆగస్టు 9న కార్మిక, రైతు, వ్యవసాయకార్మిక సంఘాలు ఉమ్మడిగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం స్వాగతించదగినది. సంపద సృష్టి కోసం తమ స్వేదాన్ని చిందించే శ్రామిక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు, సంస్థలూ ఈ కార్యక్రమాలను చేపట్టడం ముదావహం. నరేంద్రమోడీ నేతృత్వంలోని కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలనను తిప్పికొట్టడానికి బలమైన ఐక్య ప్రతిఘటన అవసరం. అంతవరకూ అనేక సందర్భాల్లో మొండిగా వ్యవహరించిన మోడీ ప్రభుత్వం ఏడాదికిపైగా సాగిన ఢిల్ల్లీ రైతు ఉద్యమానికి తలొగ్గక తప్పలేదు. తొలిసారి దేశ ప్రజలకు బహిరంగంగా ప్రధాని క్షమాపణ చెప్పారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఐక్య ఉద్యమాలు సాగాయి, సాగుతున్నాయి. ఆ క్రమంలోనే కేంద్ర ట్రేడ్‌యూనియన్లు, రైతు ఉద్యమానికి సారథ్యం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చాలోని భాగస్వామ్య సంఘాలు, సంస్థల మధ్య ఐక్యత, ఐక్య కార్యాచరణ పెంపొందాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో, కొన్ని రాష్ట్రాల్లో జిల్లా, తాలూకా స్థాయిలోనూ సదస్సులు, ఉమ్మడి సమావేశాలు నిర్వహించి దశలవారీగా ఉద్యమ కార్యాచరణను రూపొందించడం ద్వారా శ్రామికుల సంఘాలమధ్య ఐక్యత పెంపొందింది. వివిధ రంగాలకు సంబంధించిన శ్రామిక ప్రజల సమస్యల పట్ల పరస్పర సంఘీభావం, ఏకీభావం బలోపేతం కావడం హర్షణీయం.
           ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలపై ఐక్యంగా పోరాడాలని ఆగస్టు 9 కార్యక్రమాల్లో జనం నినదించారు. దేశంలో నరేంద్ర మోడీ విచ్ఛిన్న రాజకీయాలను ఎదుర్కొనేందుకు కార్మికులు, రైతులనే కాకుండా ఉద్యోగులు, వ్యవసాయ కూలీలను మరింతగా సంఘటితం చేయాలన్నది సత్సంకల్పం. ఇప్పుడున్న కార్పొరేట్‌ కంపెనీలు బ్రిటీష్‌కు చెందిన ఈస్ట్‌ ఇండియా కంపెనీని మించి లూటీ చేస్తున్నాయని ఆయా సభల్లో వక్తలు వివరించారు. జాతీయోద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని సంఫ్‌ుపరివార్‌ శక్తులు ప్రస్తుతం అధికారంలోకి వచ్చి ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నాయి. సదస్సు నినాదమైన క్విట్‌ మోడీ.. సేవ్‌ ఇండియా నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించారు. దోపిడికి వ్యతిరేకంగా కార్పొరేట్‌ శక్తులను పారద్రోలేందుకు జాతీయోద్యమ స్ఫూర్తితో క్విట్‌ కార్పొరేట్‌ ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. కాశ్మీర్‌, మణిపూర్‌లలో సృష్టించిన మత ఛాందస వాదాన్ని ఇప్పుడు హర్యానాకు తీసుకొచ్చారని, ఈ జాడ్యాన్ని దేశమంతా పాకేలా కుట్ర చేస్తున్నారని వారు సరిగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే విమానాశ్రయాలు, ఎయిర్‌ ఇండియా, ఓడరేవులను, రోడ్లను అమ్మేసిన నరేంద్ర మోడీ ప్రజల త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కుట్రకు వ్యతిరేకంగా ప్రజల అండదండలతో స్టీల్‌ కార్మికులు, యావత్‌ రాష్ట్ర కార్మికవర్గం సాగిస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ప్రత్యేక హోదాను తిరస్కరించి, విభజన హామీలను గాలికొదిలేసి బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే అధికార వైసిపి, ప్రతిపక్షంలోని టిడిపి, జనసేన నిలదీయాల్సిందిపోయి లొంగిపోవడం దివాళాకోరుతనమని ఆ యా సభల్లో వివిధ సంఘాల నేతలు ఎండగట్టడం సరైనదే !
              ఈ ఉద్యమం తదుపరి దశగా ఆగస్టు 14 రాత్రి ఆట పాట వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్న పిలుపు సముచితమైనది. శ్రామిక వర్గాల డిమాండ్లపై కేవలం వారు మాత్రమేగాక యావత్‌ ప్రజానీకమూ ఉద్యమాల్లో పాల్గొనడం అవసరం. అటువంటి విశాల ఉద్యమంగా అభివృద్ధి కావడానికి సాంస్కృతికంగానూ ఏకీభావం రూపొందాలి. అంటే శ్రామికులందరి కుటుంబ సభ్యులూ ఉద్యమాల్లో పాల్గొనాలి, లేదా గట్టి చేదోడునివ్వాలి. సాంస్కృతిక సమ్మేళనాలు అందుకు దోహదపడతాయన్నది నిర్వివాదాంశం. ఆగస్టు 14న చేపట్టే వివిధ కార్యక్రమాల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొని, శ్రామికోద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిద్దాం. కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలనకు బుద్ధి చెబుతారని ఆకాంక్షిద్దాం.