
- మొరాయించిన ఎత్తిపోతల పథకం
- ఎండుతున్న వరి నాట్లు
- జంఝావతి ఆయకట్టు దుస్థితి
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : జలాశయం నిండా నీరు... రబ్బరు డ్యాం గరిష్టంగా ఎత్తివేసినా నిరంతరాయంగా ఉప్పొంగుతున్న గంగ. అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ నీరంతా నాగావళి నదిలోకిపోతోంది. ఇదీ పార్వతీపురం మన్యం జిల్లాలోని జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని పరిస్థితి. ఈ ప్రాజెక్టుకు 1986లో శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు (కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, గరుగుబిల్లి, మక్కువ) మండలాల్లోని 24,640 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ముంపు సమస్య కారణంగా అప్పటి ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో సుమారు 20 ఏళ్లు ముందుకు సాగలేదు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయకట్టు స్థాయిని 12 వేల ఎకరాలకు తగ్గించి రబ్బరు డ్యాం నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ఇది ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యాముగా ప్రసిద్ధికెక్కింది. అందుకు తగ్గట్టే ఒడిశా కొండకోనల్లో కురుస్తున్న వర్షపునీరు జలాశయంలోకి పరవళ్లు తొక్కుతూ వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రబ్బరు డ్యాం సామర్థ్యానికి తగ్గట్టు 249 క్యూసెక్కులకు మించి నీరు జలాశయంలోకి వస్తోంది. కాలువల నిర్మాణంలో నెలకొన్న లోపాలు, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయకట్టు భూములకు తగినంతగా సాగునీరు అందడం లేదు. ముఖ్యంగా ఎత్తిపోతల పథకం (కుడికాలువ) ద్వారా ఈ ఏడాది చుక్కనీరు కూడా విడుదల చేయలేదు. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు నుంచే ఈ ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయకపోయినా మరమ్మతులు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఆరు వేల ఎకరాలకు సాగు నీరందించాల్సిన ఈ కాలువ ద్వారా చుక్కనీరు కూడా రావడం లేదు. తమ మండలంలో 250 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, చుక్క నీరు అందడం లేదని సీతానగరం మండలం ఇప్పలవలసకు చెందిన అలమండ శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాధారంగానే వరి నాట్లు వేశామని, ఇటీవల వర్షాలు లేకపోవడంతో నాట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎడమ కాలువ ద్వారా అందించాల్సిన ఆరు వేల ఎకరాల్లో రెండు వేల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. కొమరాడ మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే నీరందుతోందని, మిగిలిన గ్రామాలకు అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి విడుదల విషయంలో అధికారుల లెక్కలకు, క్షేత్ర స్థాయి పరిస్థి తులకు పొంతన లేకుండా ఉందని చెప్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేసే పనిలోనే ఉన్నాం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేయించే పనిలో ఉన్నాం. సమస్యను కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టాం. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్‌ను కొంచెం అటుఇటుగా కదపడానికి ప్రొక్లెయినర్ అవసరం. ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఉండ డంతో ఆపరేటర్లెవరూ ముందుకు రావడం లేదు
- అప్పారావు, జంఝావతి ప్రాజెక్టు ఇఇ

చుక్క నీరు కూడా రాలేదు
ప్రాజెక్టుకు కూతవేటు దూరంలోనే ఉన్నాం. అయినా, ఈ సంవత్సరం చుక్క నీరు కూడా అందలేదు. కాలువలు సరిగాలేవు. ఈ ఏడాది మోటార్లు ద్వారా నీరు పంపలేదు. ఆయకట్టు భూమి అయినప్పటికీ వర్షాధారంగానే సాగు చేయాల్సి వస్తోంది.
- రాయల వెంకటరమణ, డంగభద్ర, కొమరాడ మండలం

రికార్డుల్లోనే ఆయకట్టు
అధికారులు, నాయ కులు రికార్డుల్లో చెప్పుకోవడం తప్ప ఆచరణలో మా ఊరికిగానీ, మండలానికిగానీ ఎప్పుడూ జంఝావతి నీరు అందలేదు. వర్షపు నీటితో అతికష్టంమీద వరి నాట్లు వేసుకున్నాం. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో నాట్లు ఎండిపోతున్నాయి.
- గొల్ల తిరుపతిరావు, ఇప్పలవలస, సీతానగరం మండలం