Oct 01,2023 11:42

ఇస్లామాబాద్‌ : ప్రభుత్వ రహస్యాలను లీక్‌ చేయడానికి సంబంధించిన సిఫర్‌ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషిలను దోషులుగా పాకిస్తాన్‌ ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఎ) శనివారం ప్రకటించింది. తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ చైర్మన్‌ అయిన ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన డిప్యూటీ ఖురేషిపై ఎఫ్‌ఐఎ ప్రత్యేక కోర్టుకు చార్జిషీట్‌ను అందజేసింది. ఇరువురు ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌పై జైల్లో వున్నారు. గత నెల్లో ఖాన్‌ను అరెస్టు చేశారు. తక్షణమే పిటిఐ నేతలను విచారించి, వారికి చట్ట ప్రకారం శిక్ష విధించాల్సిందిగా ఎఫ్‌ఐఎ కోర్టును కోరింది. ఈ కేసులో పిటిఐ మాజీ ప్రధాన కార్యదర్శి అసద్‌ ఉమర్‌ పేరును ఎఫ్‌ఐఎ ప్రస్తావించలేదు. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్షిగా మాజీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆజం ఖాన్‌ను పేర్కొన్నారని జియో టివి తెలిపింది. గతేడాది మార్చి 27న ఇమ్రాన్‌ ఖాన్‌, ఖురేషి ప్రసంగాల ప్రతిని ఎఫ్‌ఐఎ చార్జిషీట్‌తో జత చేసింది. మొత్తంగా 28మంది సాక్షుల పేర్లను అది సేకరించింది.