Jul 07,2023 12:45

ఏలూరు : కైకలూరు నియోజకవర్గంలో అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలను తక్షణం ఆపాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎ.రవితోపాటు సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు డి.ఎన్‌.వి.డి.ప్రసాద్‌, పళ్లెం కిషోర్‌, జిల్లా నాయకులు కె.శ్రీనివాస్‌, ఎం.మహంకాళి ఉన్నారు. అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలు వ్యతిరేక పోరాట గ్రామాల నాయకులతో కలిసి ఈ సమావేశం నిర్వహించారు.

గురువారం కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలు జరిగే గ్రామాలను, కైకలూరు మండలం నర్సాయపాలెంలో నిర్మిస్తున్న ఫిషరీస్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణ ప్రదేశంలో సిపిఎం జిల్లా బృందం పర్యటించిందన్నారు. తాము పర్యటించిన గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా యదేచ్ఛగా, అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాపై వచ్చే ఆదాయానికి ఆశించి విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇస్తుందని ఆరోపించారు. ఈ సమయంలో ప్రజారోగ్యాన్ని విస్మరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే తవ్విన ఆక్వా చెరువుల మురుగు పలుచోట్ల ఆర్‌ అండ్‌ బి రహదారుల మీదకు కూడా వచ్చిందని, వానలు ఎక్కువైతే ఆ మురుగునీరంతా ఇళ్లలోకి చేరుతుందని ఈ విషయం తమ పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. జిఒ నెంబర్‌ 7,14,ఇతర నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా చెరువులు తవ్వుతున్న యజమానులపై కాకుండా స్థానిక ప్రజలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానుకొల్లులో 50 మంది పోలీసులు మోహరించారని, గ్రామంలో యువకుల్ని కొద్దిగంటలపాటు స్టేషన్లో నిర్భందించి, బీభత్సం సఅష్టించారని చెప్పారు. ఎస్‌ఆర్పి అగ్రహారంలో గ్రామస్తులపై రెండు కేసులు నమోదు చేసి ఆందోళన ఆపకుంటే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. కైకలూరుఎమ్మెల్యే డి.నాగేశ్వరరావు అండతోనే అక్రమ ఆక్వాచెరువుల తవ్వకాలు, ఫిషరీస్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం సాగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే కైకలూరు సర్కిల్లోని పోలీసు యంత్రాంగం, తహసిల్దార్లు, జిల్లా ఫిషరీస్‌ అధికారులు ఈరకంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు ? ప్రజారోగ్యం, పర్యావరణమే ప్రధాన లక్ష్యంగా చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫిషరీస్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రజల ఆవాసాలు, మంచినీటి చెరువులు, పొలాలకు దూరంగా నిర్మించుకునేలా అనుమతులు మార్చాలని డిమాండ్‌ చేశారు. ప్రజలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలని పోలీసుల అనుచిత జోక్యం, నిర్బంధం ఆపాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఉంటారో పెత్తందారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయిలో జరుగుతున్న ఉద్యమాన్ని జిల్లావ్యాప్త ఉద్యమంగా విస్తరిస్తామని అందుకు తగిన కార్యచరణ కూడా రూపొందిస్తామని హెచ్చరించారు.