
''బుడి బుడి నడల తప్పటడుగులే తరగని మాన్యాలు ... చిట్టి పొట్టి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు.. ఎదగాలీ, ఇంతకు ఇంతై ఈ పసికూన..' తమ బిడ్డ ఎదుగుతున్నప్పుడు ప్రతి అమ్మానాన్న పొందే భావన ఇది. కొందరైతే- పిల్లలు బోర్లా పడితే బొబ్బట్లు, కూర్చుంటే కాజాలు, అడుగులు వేస్తే అరిసెలు ... అంటూ బిడ్డ ఎదుగుదలలోని ప్రతి దశనూ పండగలా జరుపుకుంటారు. అయితే, పిల్లల్లో వయసుకు తగ్గట్టుగా శారీరకంగా లేదా మానసికంగా ఎదుగుదల లేకపోతే - ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పిల్లల్లో ఎదుగుదల లోపానికి ఉన్న కారణాల్లో సెరిబ్రల్ పాల్సీ ఒకటి. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించటానికి ఏటా అక్టోబరు 6న ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ అవగాహనా దినం జరపాలని సెరిబ్రల్ పాల్సీ అలియన్స్ (ఆస్ట్రేలియా), యునైటెడ్ సెరిబ్రల్ పాల్సీ అసోసియేషన్ (అమెరికా) 2012లో పిలుపునిచ్చాయి. సెరిబ్రల్ పాల్సీ పట్ల ప్రజలకు అవగాహన కలిగించడం, ఆ సమస్యతో ఉన్న వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం; వారిని సమాజంలో సమ్మిళితం చేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.

సెరిబ్రల్ పాల్సీ అంటే ...
సెరిబ్రమ్ అంటే మెదడు. పాల్సీ అంటే పక్షవాతం. సాధారణంగా మన శరీరంలో కండరాల కదలికలు, వాటి నియంత్రణ అంతా మన మెదడు నుంచి వచ్చే సంకేతాల ద్వారా జరుగుతుంది. అయితే, కొంతమంది పిల్లల్లో వివిధ కారణాలతో మెదడు దెబ్బతినడం వల్ల శరీర కండరాల మీద నియంత్రణ, కదలికల మధ్య సమన్వయం లోపిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోవడం, కదల్లేకపోవడం, నియంత్రణ లేకుండా ఎక్కువగా కదలికలు చేయడం వంటివి జరుగుతాయి.
కారణాలు అనేకం..
బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు.. : తల్లికి జ్వరంగానీ, టెటనస్, రుబెల్లా లాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, రక్తహీనత, షుగర్ నియంత్రణలో లేకపోవడం, అధిక రక్తపోటు ఉండడం.
గర్భిణీ అధికంగా పొగాకు, ఆల్కహాల్ తీసుకోవడం.
ప్రసవ సమయంలో.. : నెలలు నిండకుండా పుట్టడం (28 వారాలు)
తక్కువ బరువుతో పుట్టడం
గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీరు తాగడం, లేదా మలవిసర్జన చేయడం
ప్రసవం క్లిష్టమై మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం
ప్రసవం తరువాత..
తీవ్రమైన కామెర్లు, మెదడువాపు, ఇతర ఇన్షెక్షన్లు రావడం,
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోవడం.
వీటితో పాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.
ఏ లక్షణాలు కనిపిస్తాయి ?
సాధారణంగా ఈ సమస్య ఉన్న ఏ ఇద్దరు పిల్లలూ ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండరు. మెదడులో దెబ్బతిన్న భాగాన్ని బట్టి ఇది 3 రకాలు.
స్పాస్టిక్ సి.పి (80-90 శాతం) : మోటార్ కార్టెక్స్ దెబ్బతినడం వల్ల. కొంతమందికి రెండు చేతులు, రెండు కాళ్లు లేదా రెండు కాళ్లు, మరికొంత మందికి కేవలం శరీరంలో ఒక వైపు మాత్రమే ప్రభావితం అవుతుంది.
అటాక్సిక్ సి.పి (5 శాతం) : సెరిబెల్లం దెబ్బ తినడం వల్ల. వీరిలో కదలికలు వణుకుతున్నట్లులా ఉంటాయి. నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి బాగా ఇబ్బంది పడ్తారు.
డిస్‌కైనెటిక్ సి.పి (6శాతం) : బేసల్ గాంగ్లియా దెబ్బ తినడం వల్ల. పిల్లలకు తెలియకుండా శరీర కదలికలు ఉంటాయి. కదలికలపై నియంత్రణ లేకపోవడం డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంటాయి.
ఙ ఇవే కాకుండా వినికిడి లోపం, దృష్టి సంబంధ సమస్యలు (కంటి కండరాలు దెబ్బతినడం), ఎక్కువగా సొంగ కార్చడం (బుగ్గలోని కండరాలు దెబ్బతినడం వల్ల), సరిగ్గా మింగలేక పోవడం, ఏ వస్తువూ సరిగా పట్టుకోలేకపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యల వల్ల నేర్చుకోవడంలో వెనుకబడతారు. తద్వారా మానసిక ఎదుగుదల లోపిస్తుంది.
చికిత్స ఏమిటి ?
సెరిబ్రల్ పాల్సీకీ ప్రత్యేకంగా మందులు ఏవీ ఉండవు. కానీ లక్షణాలను బట్టి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, కండక్టివ్ ఎడ్యుకేషన్ వంటివి చేయించడం ద్వారా వారిలో మార్పులు వస్తాయి.
ఙ కొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువగా బిగుసుకుపోవడం వల్ల కదపలేకపోతారు. వారికి ఆపరేషన్ చేయాల్సి వుంటుంది.
ఙ ఫిట్స్ ఉన్న పిల్లలకు న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి మందులు వాడాలి.

అపోహలు - నిజాలు
సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలు పిచ్చివారు ..
గతంలో మన సమాజంలో ఈ విధమైన వైకల్యం ఉన్నవారిని పిచ్చివారిగా చూసేవారు. కానీ, అది అపోహ మాత్రమే! సి.పి ఉన్న చాలామంది పిల్లల్లో మానసిక ఎదుగుదల బాగానే ఉంటుంది. సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మన దేశంలోనే ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఉదాహరణకు గురుగ్రాంలో శ్రియాభట్ 94 శాతం మార్కులు సాధించారు. హర్యానాలో కర్నల్ జిల్లాలో డాక్టర్ రితేష్ సిన్హా వీల్ చైర్‌కే పరిమితమైనా వేల మందికి కంప్యూటర్ పరిచయం చేశారు. సిపి అంటే సెరిబ్రల్‌పాల్స్ కాదని, 'కాపబుల్ పర్సన్' అని సరికొత్తగా నిర్వచించి అనేక మందిలో స్ఫూర్తి నింపారు.

ఈ సమస్య వయసుతోపాటు పెరుగుతుంది !
సి.పి అనేది వ్యాధి కాదు. ఇది కొన్ని లక్షణాల సముదాయం. సాధారణంగా ఐదేళ్లలోపే ఈ లక్షణాల వల్ల పిల్లల్లో కండరాలు బిగుసుకుపోతాయి. సరైన సమయంలో థెరపీ, సర్జరీ చేయకపోవటంతో కదలికలు తగ్గిపోతాయి తప్ప వయస్సు పెరుగుతుంటే లక్షణాలు ఎక్కువవడం ఉండదు.
ఇలాంటి పిల్లలు స్వతంత్రంగా జీవితం సాగించలేరు.
ఇది కూడా పొరపాటు అభిప్రాయం. సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలను చిన్న వయసు నుంచి సరైన పద్ధతిలో ట్రైన్ చేయాలి. సహాయ పరికరాలు అందించాలి. అప్పుడు వారు ఎవరి మీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవనం సాగిస్తారు.
సెరిబ్రల్ పాల్సీ టెక్నాలజీ
ఒకప్పుడు మంచానికో, వీల్ చైర్‌కో పరిమితమైన సి.పి పిల్లలకు ఇప్పుడు టెక్నాలజీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ తన కుమారుడు పుట్టిన తర్వాతే - తనకు ఇతరులు, సహోద్యోగులు, అంగ వైకల్యం ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండటాన్ని నేర్పిందని, అదే కొత్త పరికరాల ఆవిష్కరణకు దోహదపడిందని తన హిట్ రిఫ్రెష్ పుస్తకంలో పేర్కొన్నారు. వికలాంగులకు ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇన్‌క్లూసివ్ టెక్ ల్యాబ్ నెలకొల్పారు.
సెరిబ్రల్ పాల్సీ ఉన్న వారు కంప్యూటర్ వాడటానికి వీలుగా వారి చేతిలో పట్టుకునే విధానాన్ని బట్టి త్రీడీ ప్రింటింగ్‌లో మౌస్ తయారు చేశారు. ఇంకా కృత్రిమమేధ సహాయంతో టెక్స్ట్‌ఆడియో, స్పీచ్ టు టెక్ట్స్, అలానే మనకు ఎదురుగా ఉన్న వాటి గురించి వివరించే స్మార్ట్ కళ్ళజోడు వంటి పరికరాలను వివిధ కంపెనీలు ఇప్పటికే అందుబాటులో ఉంచాయి.
ఎడాప్చుర్ డివైసెస్
ఇతరుల మీద ఆధారపడకుండా వారు పట్టుకోవటానికి వీలుగా బ్రష్, దువ్వెన, పెన్ను, కిచెన్ వస్తువులు వంటివి ఇప్పుడు లభిస్తున్నాయి. తిరగడానికి వీలుగా వీల్‌చైర్, వాకర్, స్టాండింగ్ ఫ్రేమ్ వంటి పరికరాలు కూడా అందుబాట్లో ఉన్నాయి.
ప్రత్యేక చట్టం - హక్కులు
సెరిబ్రల్ పాల్సీ, ఇతర వైకల్యం ఉన్న పిల్లలకు ఆర్‌పిడబ్ల్యుడి యాక్ట్ 2016 ప్రత్యేకమైన హక్కులు కలిగించింది. దీని ప్రకారం ... అందరితో సమానంగా కచ్చితంగా విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు అందించాలి. వారిని అగౌరవపర్చటం, వేరుగా చూడటం వంటివి చేస్తే శిక్షార్హులు అవుతారు. నివాస ప్రదేశాల్లో వారిని ఖాళీ చేయమనడం, ఇల్లు అద్దెకు ఇవ్వకపోవటం వంటివి చేయరాదు. స్కూళ్లు, పెద్ద భవనాలు, ఆఫీసుల్లో వారు వీల్‌చైర్‌తో రావటానికి అనువుగా ఏర్పాటు ఉండాలి. వీల్‌చైర్ పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఉండాలి.
ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా వికలాంగుల కోసం ఒక ప్రత్యేక కమిషనర్‌ను నియమించి కమిషనరేట్ ఉండాలి. ఉద్యోగాల్లో వికలాంగులకు ఇచ్చే 4 శాతం రిజర్వేషన్‌లో- ఒక శాతం సెరిబ్రల్ పాల్సీ ఉన్న వారికి కేటాయించాలి. ఎయిర్ పోర్టుల్లో, ఇతర ప్రయాణాల్లో వారిని ఇబ్బంది పెట్టడం, వీల్‌చైర్ సౌకర్యం అందించకపోవడం, ప్రయాణానికి అనుమతించకపోవడం చేస్తే శిక్షార్హులు. ఈ చట్టాన్ని పాటించని వారికి రూ.5000 నుంచి రూ.5 లక్షల వరకూ జరిమానా విధించొచ్చు.
ప్రభుత్వ పథకాలు
సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకు ప్రభుత్వం కొన్ని పథకాలను అందిస్తోంది. చిన్న పిల్లలకు 'దిశ', స్కూల్స్‌కు వెళ్లే వారికి 'వికాస్', అనాథ పిల్లలకు 'సమర్థ్', పెద్ద వారికి 'ఘరుండా' అనే కమ్యూనిటీ ఇళ్లు, 'నిరామయ' హెల్త్ స్కీం, డిగ్రీ, వొకేషన్ కోర్సు చదివే వారికి 'జ్ఞానప్రభ', వివిధ పరికరాలు అందించటానికి 'సంభవ్' లాంటి పథకాలు ఉన్నాయి.
సెరిబ్రల్ పాల్సీ గురించి తల్లిదండ్రులు తెలుసుకుని, నిరాశ పడకుండా టెక్నాలజీని, ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందించే పథకాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. పిల్లలను ఇంట్లో ఉంచకుండా ప్రత్యేక పాఠశాలలకు పంపించి వారి ఎదుగుదలకు కృషి చేయాలి. మనం ఏమీ చేయకుండా ఇక ఇంతే అని నిరాశ పడొద్దు. అలాగే మన ప్రమేయం లేకుండా అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడొద్దు. మనం పట్టుదలతో, ప్రత్యేక శ్రద్ధతో నేర్పిస్తేనే పిల్లలు ఎన్నో అద్భుతాలు చేయగలరని దృఢంగా నమ్మండి. లోపాలు ఉన్నా లేకున్నా ప్రతి బిడ్డ జీవితం ముఖ్యమే! ఆ జీవితాన్ని ఆనందంగా అనుభవించే హక్కు ప్రతి బిడ్డకూ ఉంది. సి.పి పిల్లలు ముందుకు వంగి నడుస్తారు. కత్తెర నడక (మోకాళ్ల దగ్గర), ముని వేళ్ల మీద నడవడం వంటివి చేస్తారు.
- డాక్టర్ దివ్య బెండి, ఎం.డి(ఆయుర్వేద)