Oct 01,2023 08:32

'పటిష్టమైన పునాది.. క్రమశిక్షణ... ఆత్మవిశ్వాసం.. ఏదైనా సాధించగలననే నమ్మకం మనపై మనకు ఉంటే ఎంతటి లక్ష్యానైనా సాధించొచ్చు. విజయానికి కఠోర శ్రమ కావాలి. నిరంతరం ఓ ప్రణాళికతో నిబద్ధతతో కూడిన కృషితో ముందుకు సాగాలి. అప్పుడే ఏదైనా సాధించుకోగలం' అంటున్నారు గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష. ఆమె ఏలూరు జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఆమె రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారు. ఏలూరు జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. సంకల్పం, ఏకాగ్రతతో ప్రయత్నిస్తే విజయం సాధించటం ఏమాత్రం కష్టంకాదని ఆమె నిరూపించారు.

11


       పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్‌-1 పరీక్షలను తొలిసారి రాశారు. మొదటి ప్రయత్నంలో తొలి ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి గణేశ్న వెంకట రామాంజనేయులు ఉపాధ్యాయుడుగా పనిచేసి, ప్రస్తుతం భీమవరం డిఇఒ కార్యాలయంలో ఎపిఒగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ఉష గృహిణి. వీరికి ప్రత్యూష ఒక్కరే సంతానం. చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా రాణించేది. ఆమె ఇంటర్‌లోనూ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఢిల్లీలో పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు.
 

                                                                 చిన్నప్పటి నుంచి ప్రథమశ్రేణిలోనే...

భీమవరంలో విశ్వకవి ఇంగ్లీష్‌ మీడియం స్కూలులో ఎల్‌కెజి నుంచి 8వ తరగతి వరకూ ప్రత్యూష చదువు కొనసాగింది. తరువాత చైతన్య ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో 9, 10 తరగతులు చదివారు. చదువుతోపాటు ప్రతిభా పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటిస్థానంలో నిలిచేవారు. భీమవరంలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. ఢిల్లీలో లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ బిఎ (పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌) విద్యను అభ్యసించారు. అనంతరం ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. తొలిప్రయత్నంలోనే విజయకేతనం ఎగురవేశారు. సివిల్స్‌ మెయిన్స్‌కు కూడా ఆమె సిద్ధమవుతున్నారు.

22

 

                                                                     పులకరించిన సీసలి గ్రామం

గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్‌-1 పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించి ఏలూరు జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులై స్వగ్రామమైన సీసలి విచ్చేసినప్పుడు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామమంతా కదిలింది. పిల్లలు, పెద్దలూ అందరూ సాదరంగా జేజేలు పలికారు. సీసలి సాయిబాబా ఆలయ చైర్‌ పర్సన్‌ తోరం అనంతలక్ష్మి సత్యవతి దేవి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె ఇంటికి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిన ఘనంగా సత్కరించారు. అమ్మాయిల్లో ఆణిముత్యంగా, భావితరాలకు మార్గదర్శిగా నిలిచారని అభినందించారు. ఆ పదవికి వన్నె తేవడంతో పాటు, ప్రజల ఆకాంక్షలు, సమస్యల పరిష్కారానికి మార్గదర్శిగా నిలవాలని కోరారు.
                                                - గొట్టేటి శ్రీనివాసులు
                                         ప్రజాశక్తి కాళ్ళమండల విలేకరి,
                                                   9397139966

33


                                                            నన్ను కలెక్టర్‌గా చూడాలనేది నాన్న సంకల్పం

'నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది నా తండ్రి కల. ఇంజినీరింగ్‌ వంటి కోర్సులకు బదులుగా ఢిల్లీకి పంపి బిఎలో చేర్పించారు. డిగ్రీ పూర్తవ్వగానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించారు. ఢిల్లీలో నాతో పాటు మా అమ్మ ఉష ఉండేది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను. ఏడాది పాటు ఢిల్లీలో ఉండి ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 పరీక్షలకు సిద్ధమయ్యాను. ప్రిలిమ్స్‌ పరీక్ష యుపిఎస్‌సి స్థాయిలో ఇవ్వడంతో సులువైంది. మెయిన్స్‌ మాత్రం ప్రత్యేకంగా సిద్ధమయ్యా.
              మెయిన్స్‌ ఫలితాలు తర్వాత నమూనా ముఖాముఖికి హాజరై తర్ఫీదు తీసుకున్నాను. ముఖాముఖిలో నా అభిప్రాయాల ఆధారంగానే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. గ్రూప్‌-1లో ర్యాంకు సాధించాలంటే కొన్నాళ్లు మన ఆనందాలకు దూరంగా ఉండాలి. 100 శాతం మనం అనుకున్న లక్ష్యం వైపే మన చూపు ఉండాలి. అవసరమైన పుస్తకాలు, న్యూస్‌ పేపర్లలో వచ్చే ఆర్టికల్స్‌ను చదువుతూ ఉండాలి. వీలైనన్ని సార్లు ప్రతి సబ్జెక్టును రివిజన్‌ చేసుకోవాలి. బట్టీ పట్టి ర్యాంకు సాధిస్తామంటే అది సాధ్యమయ్యే పనికాదు. లక్ష్య సాధనకు పటిష్టమైన పునాదే ఎంతో కీలకం.
                                                                                           -గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
                                                                                                డిప్యూటీ ట్రైనీ కలెక్టర్‌, ఏలూరు జిల్లా.

                                                                   అనుకున్న లక్ష్యం సాధించింది

ప్రత్యూష పాఠశాల దశ నుంచే పెద్దయ్యాక జిల్లా కలెక్టర్‌ను అవుతా అని చెప్పేది. గ్రూప్‌-1 పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయం. ఉపాధ్యాయుడి కూతురు డిప్యూటీ కలెక్టర్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు దక్కింది. భవిష్యత్తులో ఐఎఎస్‌ సాధించి, ప్రజలకు సేవ చేస్తుందనే నమ్మకం నాకుంది.
                                                                  - గణేశ్న వెంకట రామాంజనేయులు,
                                                                                 ప్రత్యూష తండ్రి