Oct 18,2023 11:43

ఇంటర్‌నెట్‌ డెస్క్‌ : గాజాలో బాంబు దాడులు ఆపితే బందీలందరినీ విడిచిపెట్టేస్తామని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు 'ఎన్‌బీసీ న్యూస్‌' కథనం వెల్లడించింది. 'గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు తమ సైనిక దురాక్రమణ, వైమానిక దాడులను నిలిపివేస్తే.. గంటలోనే మా వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులను విడిచిపెడతాం. ప్రస్తుతం వారిని విడిచిపెట్టేందుకు సురక్షిత ప్రదేశం లేదు' అని హమాస్‌ సీనియర్‌ అధికారి చెప్పినట్లు ఈ అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఆ అధికారి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.

                                                          హమాస్‌ చెరలో దాదాపు 200 మంది బందీలు..!

అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌ పై మెరుపుదాడిగా రాకెట్లతో విరుచుకుపడిన హమాస్‌.. తర్వాత ఆ దేశంలోకి చొరబడి భీకర దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొంతమందిని హమాస్‌ కిడ్నాప్‌ చేసి వారిని గాజాలో బంధించింది. హమాస్‌ చెరలో దాదాపు 200 మంది బందీలుగా ఉన్నట్లు ఇటీవల 'ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌' ధ్రువీకరించింది.