
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):కేంద్రంలోని మోడీ సర్కారు ఆదేశాలతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కర్మాగారం ప్రగతిని దిగజార్చేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1005వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ సిఒసిసిపి విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, మొహిద్దిన్, వరసాల శ్రీనివాసరావు మాట్లాడారు. ప్లాంట్ పరిస్థితి ఇంతలా దిగజారడానికి యాజమాన్యం చర్యలే కారణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంటు ప్రగతిని దిగజారుస్తూ దొడ్డిదారిన ప్రయివేటు యాజమాన్యాలను తీసుకురావాలని చూడడం దుర్మార్గమన్నారు. ఇంటి దొంగల పని పట్టి ప్లాంటును పరిరక్షించుకోవడం ప్రతి ఉద్యోగి బాధ్యతని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాజమాన్యానికి కొమ్ముకాసే అధికారులను కార్మికులు క్షమించరని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు తాండ్ర కనకరాజు, కామేష్, దేముడు, నాయుడు, పరమేష్ రమణ, సుబ్బారావు పాల్గొన్నారు.