Oct 09,2023 07:51

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని విజరు రీడర్స్‌ సర్కిల్‌ ఏటా ఇచ్చే అనువాద పురస్కారాన్ని, రూ.50 వేల నగదు బహుమతిని, 2023 సంవత్సరానికి గానూ- తెలుగు కథా రచయిత, కవి, అనువాదకుడు జిళ్ళేళ్ళ బాలాజీ ఆదివారం నాడు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సంభాషణ.. టూకీగా ...

                                             'కె.ఎస్‌.విరుదు' అనువాద పురస్కారం పొందినందుకు మీ అనుభూతి ?

అస్సలు ఊహించలేదు. జయకాంతన్‌కు అత్యంత సన్నిహితులైన కీ.శే. కె.ఎస్‌.సుబ్రమణియన్‌ అనువాద రంగంలో చేసిన కృషి అపారం. జయకాంతన్‌ రచనలే కాదు, ఆయనపై 'రీడర్‌'నూ, తమిళ ఆధునిక కవితా సంకలనం, ఓ ప్రముఖ తమిళ కవి మొత్తం సాహిత్యంపై విమర్శనాత్మక గ్రంథం, భారతరత్న సి.ఎస్‌.పై వ్యాసాలు... ఇలా ఎన్నింటినో ఆయన ఆంగ్లంలోకి తీసుకెళ్లి తమిళనాట కీర్తి గడించారు. ఆయన మరణానంతరం ఆయన పేరు మీద ఇచ్చే పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
 

                                                           మీరు అనువాద రచనలు చేయడానికి స్ఫూర్తి ?

ఎవరూ లేరు. నిజానికి నాకు అనువాదంపై అస్సలు ఆసక్తి లేదు. కానీ నేను అనువదించిన మొదటి అనువాద నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావటంతో అనువాదాలపై మక్కువ పెంచుకుని 130కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, ఒక కవితా సంపుటి, ఒక వ్యాస సంపుటి, ఒక వచన రామాయణం తమిళం నుంచి తెలుగులోకి అనువదించాను.
 

                                                      తెలుగు నుంచి తమిళంలోకి ఏమైనా అనువదించారా ?

లేదు. ఎందుకంటే నా మాతృభాష తెలుగు. తమిళం నాకు అదనంగా ఒంటబట్టిన భాష. ఆ భాషను నేను గురు ముఖతా నేర్చుకోలేదు. మా బంధువులందరూ తిరుత్తణిలో ఉండటంతో చిన్నప్పటి నుంచి అక్కడికి వెళూ,్త అక్కడి వాళ్లతో వచ్చీరానీ తమిళంలో మాట్లాడుతూ, తమిళ సినిమాలు చూస్తూ, తమిళ పత్రికలు చదువుతూ ఆ భాష నాకు బాగా తెలిసొచ్చింది. తమిళం నుంచి ఏ రచననైనా అనువదిస్తున్నప్పుడు తమిళ పదాలకు తెలుగులో ఎన్నో పర్యాయ పదాలు వేగంగా మతికొస్తాయి. కానీ, తెలుగు నుంచి అనువాదం చెయ్యాలని ప్రయత్నించినపుడు అలా ఏమీ గుర్తుకు రావు. కనుకనే నేను తమిళంలోకి అనువాదం చేసేందుకు ప్రయత్నించలేదు.
 

                                                స్వీయ రచనకు, అనువాద రచనకు స్పష్టమైన తేడా చెప్పండి ?

స్వీయ రచన మన సొంతం. అది మన మదిలో రూపుదిద్దుకున్న రచన. ఆ రచనకు మనమే కర్తా కర్మా క్రియా అన్నీనూ. అందుకే మన అభీష్టానుసారం దానికి రూపురేఖలు దిద్దుతాం. దానికి సరిపడా సొగసులు అద్దుతాం. దానిపై మనకున్న సాధికారతతో దాని నడకను కొనసాగిస్తాం. కానీ అనువాదానికి ఆ వెసులుబాటు ఉండదు. అది మరొకరి సొంతం. స్వేచ్ఛ వాంఛనీయం కాదు. మూల రచయిత ఛాయలోనే మన నడక కొనసాగాల్సి ఉంటుంది.
 

                     తమిళ నవలలు అనేకం అనువదించాక, తెలుగు నవలలతో తులనాత్మక అధ్యయనం ఏమైనా చేశారా ?

రెండింటినీ తులనాత్మక అధ్యయనం చెయ్యలేదు. కానీ రెండూ చదివి నాకు నేను బేరీజు వేసుకుంటున్నాను. తేడాలు గ్రహిస్తున్నాను. విలక్షణమైనవేవో గుర్తించగలుగుతున్నాను.
 

                                  మీరు అనువాద రచనలు చేస్తున్నప్పుడు మీ స్వీయ రచనల ప్రభావముంటుందా ?

ఏమాత్రం ఉండదు. ఏ ప్రభావమూ పడకుండా నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను. అది మరెవరి రచనో అనీ, దాన్ని నేను అనువదిస్తున్నానన్న స్పృహ మాత్రమే ఉండేలా చూసుకుంటాను. అయితే ఆ రచనను ఎంత వీలైతే అంత మెరుగ్గా తీసుకురావటానికి ప్రయత్నిస్తాను. ఉత్తమ ప్రమాణాలను పాటిస్తాను. మన పాఠకులకు బాగా అర్థమయ్యేలా అనువాదాన్ని కొనసాగిస్తాను.
 

                    తమిళ నవలాకారుడు జయకాంతన్‌ రచనలతో ప్రయాణించినపుడు మీరు ప్రధానంగా గమనించిన విషయాలు ?

ఆయన పెద్దగా చదువుకోలేదన్న విషయం ఏ రచనలోనూ మనకు కనిపించదు. పైపెచ్చు కొన్ని నవలల్లో ఇంగ్లీషు వాడిన తీరు అద్భుతమనిపిస్తుంది. ఆయన రచన చదువుతున్నప్పుడు నెక్స్‌ ్ట డైలాగ్‌ 'అతని' నుండే వస్తుంది అని ఊహిస్తాం. కానీ ఆ డైలాగ్‌ 'ఆమె' నుండి వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు నన్ను ఆశ్యర్యంలో ముంచే వ్యవహారం. ఆయన ఏ కథా పేలవంగా ఉండదు. సాఫీగా సాగుతాయి. ఆయన నుండి ఇంకా రచనలు వచ్చి ఉండాలి అని ఇంటర్వ్యూలో నేనడిగిన ప్రశ్నకు ఆయనిచ్చిన జవాబు ఏమిటంటే ''రాయాలి అనుకున్నప్పుడు ఎంతో రాశాను. ఇక చాలు అనుకున్నా, మానేశాను.'' ఇంతకన్నా నిబద్ధత కలిగిన రచయిత ఎవరుంటారు? దటీజ్‌ జయకాంతన్‌ !
 

                                               అనువాదంలో మూల రచన సగం కోల్పోతుందనడం నిజమేనా ?

కాదు, ఇదొక అపవాదు మాత్రమే. మూల భాష తెలిసినప్పుడు, దానిపై పట్టున్నప్పుడు యథావిధిగా అనువాదంలోనూ అది కొనసాగుతుంది. అంతేకానీ, ఏదీ కోల్పోవటమంటూ జరగదు. కానీ, మీకో విషయం చెప్పాలి. చాలామంది అనువాదకులు ఆంగ్లం నుండి అనువదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన చిక్కల్లా వాళ్లకు ఆ మూల భాష తెలిసి ఉండదు. అప్పుడు మూల భాష నుండి ఆంగ్లంలోకి అనువదితమైనప్పుడు కొంతా, ఆంగ్లం నుండి అనువాద భాషలోకి వచ్చినప్పుడు మరికొంతా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. కానీ నేను మూల భాష నుండే తర్జుమా చెయ్యటం వల్ల పోగొట్టేదంటూ ఏమీ ఉండదు. వంద శాతం న్యాయం చెయ్యటానికే ప్రయత్నిస్తాను.
 

సంభాషణ : డా.పెరుగు రామకష్ణ
98492 30443