మనదేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ పుట్టి నేటికి 164 ఏళ్లు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు. గతేడాది స్వాతంత్య్ర అమృతోత్సవాలు కూడా ఘనంగా జరుపుకున్నాం. మరి మనం స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలను సాధించామా? కనీసం ఆ దిశగా సాగుతున్నామా? ఆ పరిశీలన స్వయంగా గాంధీజీ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి స్థితిగతులను చూసి, ఆయన ఏమంటారు.. ఎలా వ్యాఖ్యానిస్తారు... గాంధీజీ స్వీయ చరిత్ర 'సత్యశోధన', ఇతర రచనల ఆధారంగా చేసిన సృజనాత్మక స్వగత కథనం.. ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకం..
76 ఏళ్ల స్వాతంత్య్రం అన్న మాట వింటుంటేనే నా మనసు పులకించిపోతోంది. ఎక్కడి నుంచి ఎక్కడిదాకా పయనించాం! ఎన్నెన్ని ఆటంకాలూ అవరోధాలూ దాటి వచ్చాం! ఎన్నెన్ని త్యాగాలూ బలిదానాలతో ఇక్కడిదాకా వచ్చాం... దేశ ప్రజలు మాన ప్రాణాలను ఎదురొడ్డి సాధించుకున్న స్వాతంత్య్రం ఇది. స్వాతంత్య్రాన్ని అనుభవిస్తూ స్వాతంత్య్రం గురించి మాట్లాడుకోవటం వేరు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లేని కటిక చీకటిని అనుభవించి, స్వాతంత్య్రమనే వెలుగును ఆస్వాదించటం వేరు. స్వాతంత్య్ర పోరాటం జరిగి, నాలుగైదు తరాలు గడిచిపోయాయి. మీలో చాలామందికి ప్రత్యక్ష అనుభవం ఉండే అవకాశమే కాదు. అలా అనుభవం ఉన్న వారి అనుభవాలను విన్న అవకాశం కూడా ఉండి ఉండదు. పైగా కొత్త రకాల చదువులు మొదలై, చరిత్రను చదివే, తెలుసుకునే అవసరం కూడా మీకు లేకుండాపోయింది. వాట్సాపులో, ఇతర సామాజిక మాధ్యమాల్లో చెలామణి అవుతున్న అడ్డగోలు రాతలే ఇప్పుడు చరిత్రగా మారిపోతోంది. ఇది ప్రమాదకర పరిణామం. చరిత్రను వక్రీకరించటం అంటే - మనల్ని మనం అవమానించుకోవటం; మన వీరుల, యోధుల అసమాన త్యాగాలను విస్మరించటం; మన స్వాతంత్య్ర సమరం అందించిన అపూర్వ వారసత్వాన్ని మర్చిపోవడం; స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తికి ద్రోహం చేయడం.
ఏ చరిత్రా వర్తమానాన్ని తేజోవంతం చేయదు. కానీ, ఆ చరిత్ర సారాంశం వర్తమానాన్ని చక్కదిద్దుకోవటానికి చక్కని అవకాశం అవుతుంది. గొప్ప తోడ్పాటుని ఇస్తుంది. గతంలోనే అంతా ఉందనుకోవడం ఎంత భ్రమ అవుతుందో, అసలు గతమే వద్దనుకోవడం అంత అజ్ఞానమవుతుంది. అందుకనే ఒకసారి నేను నడయాడిన రోజుల్లోకి తొంగి చూద్దాం. వర్తమానానికి వర్తింపచేస్తూ, మాట్లాడుకొందాం.
పరిస్థితులే మార్చాయి !
మీకు తెలుసు. గుజరాత్‌లోని పోరుబందరులో 1869 అక్టోబరు 2వ తేదీన పుట్టాను నేను. పుట్టుకతోనే అర్భకుడిని. ఎందుకనో చిన్నప్పటి నుంచి సిగ్గు ఎక్కువ. ఎవరితోనన్నా మాట్లాడాలంటే భయం. పాఠశాల రోజుల్లో కూడా తోటి పిల్లలతో స్నేహం చేయడం, కలసి మెలసి ఆడుకోవడం బహు తక్కువ. అలాంటి నేను స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనటం, కోట్లాదిమంది ప్రజలతో మాట్లాడ్డం ఒక అద్భుతమే కదా! పుట్టుకతోనే ఎవరూ ఏమీ కారు. పరిస్థితులే మనుషులను మారుస్తాయి. గాలివాటున కొట్టుకుపోవడం కాకుండా ఎదురైన పరిస్థితులను అర్థం చేసుకొని, వాటికి ఎదురీదితే మనం గట్టి పడతాం. పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాం. నిజానికి ప్రజలతో మమేకమై పనిచేయడం అన్నిటికన్నా పెద్ద విద్య. ప్రజల గుండె చప్పుళ్లను వినగలిగితే- వాటిని మన మనసులో లయం చేసుకోగలిగితే- మనం మారి తీరుతాం. ప్రజల ఆశల, ఆకాంక్షల గొంతుగా మారతాం. నా జీవితమే అందుకు నిదర్శనం.
విస్తర్లో అన్నీ వడ్డించాక ఏది రుచిగా ఉందో, ఏది అరుచిగా ఉందో క్షణాల్లో తీర్పు ఇచ్చేయొచ్చు. తామైతే ఎంత అద్భుతంగా చేయగలరో ఉపన్యాసాలు కూడా దంచేయొచ్చు. ఇక్కడ మనకు ముఖ్యమైనవి ఆ తీర్పులూ, ఉపన్యాసాలూ కాదు. ఆ వంటకు, వడ్డనకు ముందు జరిగిన కృషి ప్రధానం. ఎన్నెన్ని వ్యయప్రయాసలకోర్చి, ఆ దినుసులు సమకూర్చారో; ఎంత శ్రమపడి వండి వార్చారో ముందుగా గుర్తించాలి. అప్పుడే ఆ వంట ఔన్నత్యం అర్థమవుతుంది. వండిన వారి, వడ్డించిన వారి అంతరంగం, అభిమాన గుణం అవగతమవుతాయి. ఇప్పుడు కొంతమంది దేశం గురించి, చరిత్ర గురించి చెబుతున్న కబుర్లు... విస్తరి ముందు కూచొని ఇస్తున్న ఉపన్యాసాల మాదిరిగానే ఉంటున్నాయి. అలాంటివాళ్లే పాలకులై, ఉద్రేక, ఉద్వేగపూరిత ఉపన్యాసాలు ఇస్తుంటే- చరిత్రను అధ్యయనం చేయని తరం చెవులప్పగించి వింటోంది. అదే నిజమనుకొని పూనకంతో ఊగిపోతోంది. ఇది దేశానికి, దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం !
సమైక్యత, సామరస్యం మన వారసత్వం !
రెండొందల ఏళ్లకు పైగా మన దేశాన్ని బ్రిటీషువాళ్లు పరిపాలించారు. ఇక్కడ ఉన్న వనరులు అన్నింటినీ తమ దేశానికి తరలించుకుపోయారు. మన దేశ ప్రజల మీద అనేక విధాలుగా అణచివేత సాగించారు. దేశంలో అక్కడక్కడ విడివిడిగా నిరసనలు, ప్రతిఘటనలూ ఉన్నప్పటికీ- అవన్నీ ఒక ఉద్యమంగా మారటానికి చాలా ఏళ్లు పట్టింది. ''ఈ పోరాటం మాది'' అని ప్రజలు అనుకోవటానికి ఇంకా ఎక్కువ సమయం పట్టింది. ప్రజలు మమేకం కాకుండా ఉండటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. పేదల మీద పెత్తందారులు సాగిస్తున్న దౌర్జన్యాలు ఉన్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కటిక పేదరికపు బతుకులు ఉన్నాయి. అక్షరం ముక్క అందని అసమాన స్థితి దేశమంతటా ఉంది. సాటి మనుషులను మనుషులుగా చూడని అగ్రవర్ణ అహంకారం ఉంది. శ్రామిక కులాల్లో తప్ప మిగతా ఎక్కడా మహిళలు బయటకు రాలేని స్థితి ఉంది. ఇంకా రకరకాల ఆచారాలూ, నమ్మకాలూ అడ్డంకిగా ఉన్నాయి. అలాంటి ప్రజలు ఏనాడైనా 'స్వాతంత్య్రం' అనే భావనను అనుభవించి ఉంటే కదా, లేని స్వాతంత్య్రాన్ని బలంగా కోరుకునేది! పనిచేసే చోట, నివసిస్తున్న చోట తమకు తెలిసిన మనుషుల ద్వారా దోపిడీకి, అణచివేతకు గురవుతున్నప్పుడు - ఆ బాధితులు ఎవరి నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటారు ?
నేను దేశంలో విస్తారంగా పర్యటించాను. అప్పుడే ఈ విషయాలన్నీ నా అనుభవం లోకి వచ్చాయి. వేధిస్తున్న తక్షణ సమస్యలను పరిష్కరించాలని అనుకున్నాను. మనుషులను వేరు చేస్తున్న తప్పుడు భావనలను రూపుమాపాలని భావించాను. మతం పేరుతో మనుషులను విడదీసే విపరీత స్వభావాలను అరికట్టాలని అనుకున్నాను. క్షేత్రస్థాయిలో అలాంటి ఉద్యమాలను నిర్మించటానికి కృషి చేశాను. మతసామరస్యం, అస్పృశ్యత నిర్మూలన, మహిళలు, యువతరం, పారిశుధ్యం వంటి 13 అంశాల ఆధారంగా నిర్మాణ కార్యక్రమం రూపొందించాను. ఇలా స్థానిక అంశాల మీద, తక్షణ సమస్యల మీద వివిధ తరగతుల ప్రజలను సమీకరించాను. వారిలో సమైక్యత, సామరస్యం ఎంత అవసరమో ఆచరణాత్మకం గా పాదుగొల్పాము. స్వాతంత్య్ర సమరంలో దేశ ప్రజలంతా పాల్గొనటానికి, మేమిచ్చే పిలుపులకు ఉమ్మడిగా స్పందించటానికి ఈ క్షేత్రస్థాయి నిర్మాణం ఎంతగానో దోహద పడింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడితనం మన బలం. అది స్వాతంత్య్రోద్యమం ప్రసాదించిన ఘనమైన వారసత్వం.
అలాంటి బలమైన వారసత్వానికి చిల్లులు పెడుతున్న వాచాలత్వం నేడు కనిపిస్తోంది. మతాల మధ్య చిచ్చు పెట్టే కుతంత్రాలు చట్టాలుగా మారిపోతున్నాయి. ఇది కాదు- మనం కోరుకున్నది. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన దార్శనికతే మన దేశానికి బలం, బలగం. దానిని గుర్తించకపోతే, ఏకత పేరిట ఏదొక ఆధిపత్య భావజాలాన్ని బలవంతంగా రుద్దితే- అది మన ఐక్యతకు భంగకరం. ఇలాంటి ప్రయత్నం స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో సాధించిన ఐక్యతకు పూర్తి వ్యతిరేకం. ఆనాడు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని శక్తులు ఇలాంటి విభజన, విద్వేష తంత్రాలనే ప్రయోగించే ప్రయత్నం చేశాయి. అయితే, ప్రజల సమైక్యత ముందు ఆ పాచిక పారలేదు. స్వాతంత్య్రం పొంది, ఎంతో సాధించారని అనుకుంటున్న ఇప్పుడు - ఇలాంటి సంకుచితాలకు, స్వార్థ చింతనలకు పట్టం కట్టటమే నాకు భరించరాని బాధగా ఉంది.
ఏ మతమూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు..
నేను అచ్చమైన మతాభిమానిని. నా జీవితంలో అడుగడుగునా నేను నమ్మిన దానిని పాటించాను. నిరంతరం రామనామం పఠించాను. భగవద్గీతను వందల సార్లు చదివాను. కానీ, ఎప్పుడూ నా మతమే గొప్పదని అనుకోలేదు. పరమతాలను ద్వేషించలేదు. పైగా ఎంతో ప్రేమించాను. ఖురాన్, బైబిల్, ఆదిగ్రంధ్ తదితర గ్రంథాలన్నీ ఇష్టంగా చదివాను. ''ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించు'' అన్న వాక్యం బైబిల్ నుంచే గ్రహించాను. మతం మన వ్యక్తిగత అభిమతం మాత్రమే! ప్రతి మనిషికి ఒక క్రమబద్ధమైన నడవడికను ఇవ్వటానికి మతం ఒక ఆలంబన మాత్రమే! మతాన్ని నమ్మినవారిని మాత్రమే కాదు; నమ్మనివారిని సైతం నేను అంతగానే ప్రేమించాను.. ఆదరించాను. దేన్నయినా నమ్మొచ్చు, నమ్మకపోవొచ్చు. ఆ నమ్మిన లేదా నమ్మని అభిమతాన్ని కచ్చితంగా పాటించాలి. నా విషయంలో నేను అలాగే ప్రవర్తించాను.. పాటించాను. నా దృష్టిలో ఏ మతమూ ఎక్కువ కాదు; మరేదీ తక్కువ కాదు. పాటించేవాళ్లు చిత్తశుద్ధితో పాటించాలి. ఎక్కువ తక్కువలనే వాదనలు ముందుకు తెచ్చి, ఎదుటివారితో కొట్లాడడం అర్థరహితం. అది ఏ మత ధర్మానికీ అనువైనది కాదు. నా దృష్టిలో తోటి మనిషి పట్ల ప్రేమను, దయను, మానవతనూ ప్రదర్శించని మతం మతమే కాదు. పాటించని మనుషులు మనుషులే కారు.
సనాతనం శాశ్వతం కాదు..
కాలం మారే కొద్దీ మనుషులు మరింత మానవీయంగా మారాలి. సాటి మనుషుల పట్ల ప్రేమమయంగా ఉండాలి. ఆ క్రమంలో అడ్డొచ్చే ఆచారాలను వదిలించుకోవాలి. నా జీవితంలో ఇలాంటివి అనేకం చవిచూశాను. నేను న్యాయవిద్య చదవటానికి ఇంగ్లాండు వెళుతున్నప్పుడు - మా ఊళ్లో, మా కులం వారి నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురైంది! నేను అప్పుడు ఇంగ్లాండు వెళ్లటానికి సన్నాహాల్లో ఉన్నాను. ఒకరోజు కుల పెద్దల నుంచి రమ్మని పిలుపు వచ్చింది. ధైర్యంగా వెళ్లి నిలుచున్నాను. ''సముద్రం దాటడం సనాతన ధర్మానికి విరుద్ధం. మన కులం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ధర్మ విరుద్ధమైన పని ఎవరూ చేయలేదు. నువ్వూ వెళ్లటానికి వీల్లేదు.'' అని కుల పెద్దలు చెప్పారు.
''నేను చదువుకోవటానికి వెళుతున్నాను. అక్కడ ధర్మ విరుద్ధమైన పనులేవీ చేయను. మద్యం ముట్టనని, మాంసం తిననని మా అమ్మకు మాటిచ్చాను. ఆ మాట కచ్చితంగా పాటిస్తాను!'' అని చెప్పాను.
అసలు సముద్రం దాటడమే శాస్త్ర సమ్మతం కాదని వారు వాదించారు. నేను వెళ్లక తప్పదని చెప్పాను. ''అయితే, నీ ఇష్టం'' అన్నారు. నేను అక్కడి నుంచి వచ్చి, ఆ మర్నాడే బొంబాయి వెళ్లాను. అటు నుంచి ఓడ మీద ఇంగ్లాండుకు ప్రయాణమయ్యాను. నేను అలా వెళ్లటాన్ని సమర్ధించి, సహాయ పడినవారు కూడా ఉన్నారు. సముద్రం దాటడం ధర్మ విరుద్ధం అని చెబితే - ఇప్పుడు మీరంతా నవ్వుతారు. కొన్ని ఆచారాలు అంతే! మన ప్రగతికి అడ్డుపడితే వాటిని వదిలించుకుంటాం. మొదట్లో చాదస్తులు వద్దని వాదిస్తారు. ముందుకు వెళ్లాల్సినవారు వాటిని దాటుకొని వెళతారు. కాలం ఎప్పుడూ మార్పు వెనకాలే ఉంటుంది.
మహిళలకు సంబంధించి కూడా ఇలాంటి నమ్మకాలూ, ఆచారాలూ అప్పట్లో అమల్లో ఉండేవి. పరదాల చాటున చాలామంది మహిళలు మగ్గాల్సి వచ్చేది. నేను దానిని బలంగా వ్యతిరేకించాను. మహిళలు లేనిదే స్వాతంత్య్ర పోరాటం లేదు. వారు ఇంటిని దాటి ఉద్యమంలోకి ఉరికినప్పుడే పోరాటానికి బలం వచ్చింది. ఆనాడు మహిళలు ఆంక్షల కంచెలను దాటి బయటికి వచ్చారు. తమ ఆభరణాలను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్లలో మగ్గారు. భర్తలు జైలు పాలైతే ధైర్యంగా కుటుంబాలను సాకారు. కొంతమంది తల్లులు జైళ్లలోనే బిడ్డలను కన్నారు. నానా ఇబ్బందులూ పడ్డారు. సాంప్రదాయ సంకెళ్ల మధ్య వారు ఇంటికే పరిమితమై ఉంటే- ఈ రోజు వారి గురించి చెప్పుకోవటానికి ఏముంటుంది ?
సమాజంలో సగంగా ఉన్న స్త్రీలు ఇంకా ఎదగాలి. అన్నిటా సాధిస్తున్న విజయాలను చూస్తుంటే ఆనందం కలుగుతోంది. అదే సందర్భంగా ఇప్పటికీ మహిళల మీద ఇన్నిన్ని అకృత్యాలు జరుగుతున్నాయని తెలిసి మనసు రగిలిపోతోంది. మహిళలను ఇప్పటికీ ఇంటికే పరిమితం చేసే సూక్తులు వినిపిస్తున్న వారిని చూసి, వెగటు పుడుతోంది. ''అర్ధరాత్రి వేళ మహిళ ఒంటరిగా, స్వేచ్ఛగా, ధైర్యంగా నడివీధిలో తిరుగాడే రోజు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్టు..'' అని అప్పట్లో అన్నాను. స్వాతంత్య్రానికి అమృతోత్సవాలు జరుగుతున్నా- అదింకా సాధ్యం కాలేదు. పైగా పట్టపగలైనా భద్రతలేని స్థితిలో స్త్రీలు ఉండడం చాలా చాలా బాధాకరం. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు ఆమోదించినందుకు సంతోషించాలో, 2029 వరకూ అమల్లోకి రాని స్థితికి బాధపడాలో నాకర్థం కావటం లేదు.
ఎవరి తిండి వారిది..
సమాజంలో ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. వాటిని మనం గౌరవించాలి. మనకు ఇష్టం లేనిది మనం తినం. అంతమాత్రాన దానిని ఇతరులు తినరాదని తీర్మానించటం పరమ తప్పు. నేను ఇంగ్లాండు వెళ్లినప్పుడు తొలుత ఆహారపు సమస్యే ఎదురైంది. నేను శాకాహారిని. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం ముట్టనని అమ్మకి వాగ్దానం చేశాను. ఓడ ప్రయాణంలోనే నాకు తిండి ఇక్కట్లు మొదలయ్యాయి. మాంసం తినటం తప్పనిసరి అని తోటి ప్రయాణికులు ఒప్పించే ప్రయత్నం చేసినా నేను ఒప్పుకోలేదు. మాంసం కలిసిన ఏ పదార్థాన్నీ తినకూడదని అనుకోవటం వల్ల ఇంగ్లాండులో అనేక ఇబ్బందులు పడ్డాను. చాలాసార్లు తిండి ఉండేది కాదు. ఒక మిత్రుడు ఒకసారి నా చేత ఎలాగైనా మాంసాహారం తినిపించాలని అనుకున్నాడు. శరీరానికి మాంసాహారం ఎంత అవసరమో లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేశాడు.
అప్పుడు నేను చెప్పాను... : ''మిత్రమా, నేను మాంసాహారానికి వ్యతిరేకం కాదు. అవసరం లేదనీ చెప్పను. నీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ, నేను తినను. ఎందుకంటే- నేను తిననని మా అమ్మకు మాటిచ్చాను. ఆ మాటను కచ్చితంగా పాటిస్తాను.'' అని చెప్పాను. ఆ మిత్రుడు నన్ను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఎప్పుడూ మాంసాహారం గురించి మాట్లాడలేదు. తోటి మనుషుల ఆహారపు అలవాట్లను గౌరవించటం అంటే అదే !
ఇప్పుడు దేశంలో కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే కొంతమందిని తక్కువగా చూడడం దారుణం. వారు సమాజానికి హాని చేస్తున్నట్టుగా ప్రచారం చేసి, ప్రాణాలు తీయడం మరీ ఘోరం! నేను ఎప్పుడూ ఇలాంటి అమానవీయ, ఆధిపత్య ధోరణులను సహించలేదు.
ఒకసారి ఖిలాఫత్ ఉద్యమం గురించి ముస్లిములు సభ జరుపుతూ, హిందువుల సహాయం కోరారు. ఆ సభకు సంబంధించి నాకూ ఆహ్వానం అందింది. ఆ సభలో పాల్గొనే ముస్లిమేతర ప్రతినిధులు గోసంరక్షణ డిమాండును ప్రస్తావించాలని, ముస్లిములు అంగీకరిస్తేనే వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనీ ఆ కరపత్రంలో రాసి ఉంది. నేను దానితో విభేదించాను. ఆ రెండు అంశాలూ వేర్వేరు. ఒకదానికి ఒకటి ముడిపెట్టడం తప్పు. ఆ సభకు హాజరైన శ్రద్ధానందకు అదే చెప్పాను. ఆయన నాతో ఏకీభవించి, ఆ సభలో ఖిలాఫత్ గురించి మాట్లాడారు తప్ప- గోసంరక్షణ గురించి ప్రస్తావించలేదు. రాజకీయ సమస్యతో ఆహారపు అలవాట్లను ముడివేసి మాట్లాడడం తప్పు. విశాల ప్రాతిపదికన ప్రజలను ఐక్యం చేయటానికి నేను భిన్నత్వాన్ని గౌరవించాను. ఏకత్వాన్ని సాధించే ప్రయత్నం చేశాను. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ ఆత్మ. అదే స్వాతంత్య్రోద్యమ సారాంశం. ఇప్పటితరం దీనిని అర్థం చేసుకొని మసలాలనేదే నా ఆకాంక్ష.
కులాధిపత్యాలు .. ఇంకానా ?
కులమతాల విభేదాలూ, ఆధిపత్య ధోరణులు ఇంకా మన సమాజాన్ని వదిలిపోలేదు. ఇది నన్ను తీవ్రంగా వేధించే మరొక అంశం. మొత్తం సమాజంలో భాగంగా ఉంటూ, నిరంతర శ్రామికులుగా ఉన్న ప్రజలను సమాజానికి దూరంగా పెట్టి, హీనంగా చూడడం ఆనాడు నన్ను ఎంతో బాధించింది. అందుకనే అస్పృశ్యతా నిర్మూలన నా కార్యక్రమాల్లో కీలకంగా మారింది. అనేక సామాజిక కార్యకలాపాల్లో వారిని భాగస్వాములను చేయటానికి ఎంతో కృషి చేశాము. భూస్వాముల్లో, పెత్తందారుల్లో హృదయ పరివర్తన ద్వారా అంటరానితనం పోవాలని నేను పరితపించాను. ఆ పేదలకు సొంత భూమి ఉండడం ద్వారా, ఆ భూమిపై సొంతంగా బతకటం ద్వారా వారు గౌరవస్థితిని సాధిస్తారని కమ్యూనిస్టులు పోరాడారు. స్వాతంత్య్రం తరువాత కొంత మార్పు వచ్చినా ఆధిపత్య ధోరణులు మాత్రం తగ్గలేదు. దళిత పిల్లవాడు నీటికుండను ముట్టుకున్నాడని ఒక ఉపాధ్యాయుడే చావ చితకబాదడం ఎంత దుర్మార్గం? ఆవు చర్మాన్ని వొలిచిన దళితులపై దాడులు చేయడం ఎక్కడి నాగరిక లక్షణం? విచారకరం ఏమిటంటే- ఇలాంటి అగత్యాలకు పాలక పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభించటం! ఇలాంటి స్థితి దేశంలో వేళ్లూనుకొని ఉందంటే - ఇక మన
స్వాతంత్య్రానికి అర్థం ఏముంది!?
ఇంకా మేము ఆనాడు కోరుకున్న సమాజం ఇంకా సాకారం కానేలేదు. పరిశ్రమలు, గ్రామ స్వరాజ్యం, స్వపరిపాలన, స్త్రీలకు స్వాతంత్య్రం, అందరికీ ఆదరువునిచ్చే విద్య, గ్రామ పారిశుధ్యం... వంటివి ఇప్పటికీ సంపూర్ణం కాలేదు. పైగా ప్రభుత్వం నెలకొల్పిన పరిశ్రమలను సంపన్నులకు ధారాదత్తం చేస్తున్నారు. ప్రగతి గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడ్డం మానేసి, అవసరం లేని మతోన్మాదాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. గతం అంతా గొప్పది అంటూ సాధించిన ప్రగతిని, సమైక్య భారత వారసత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు. దేశాన్ని ఈ పరిస్థితిలో చూస్తుంటే - మనసు కకావికలం అవుతోంది. ఇదేనా స్వాతంత్య్ర ఫలితం అని నిర్వేదం కలుగుతోంది.
అందుకనే నవతరం మేల్కోవాలి. స్వాతంత్య్ర ఉద్యమం ఎలా నిర్మితమైందో, ఎలా సాగిందో, ఎన్నెన్ని త్యాగాలూ బలిదానాలూ చేసిందో, ఏయే ఆశల, ఆకాంక్షల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందో చరిత్రను అధ్యయనం చేయాలి. నవ నవోన్మేష సమైక్య, సమతా భారతిని నిర్మించుకోవాలి. ఏ జాతీ, ఏ దేశమూ ఉన్మాదాల మీదా, ఉద్రేకాల మీదా నిర్మాణం కాదు. ఆలోచన, ఆచరణల మేలిమి కలయిక మన పునాది. మనది త్యాగాల వారసత్వం.. సామరస్య వారసత్వం.. మనది సమతా మానవతా భావాల సమ్మిళిత ప్రగతితత్వం. ఆ దిశగా సాగాలనేది నా ఆశ.. ఆకాంక్ష. సాగుతారు కదూ! సాధిస్తారు కదూ!!
గాంధీజీ ఏమన్నారు?
''ఆహారం మూడు రకాలు. 1. శాకాహారం 2. మాంసాహారం 3. మిశ్రమాహారం. పాలను మనం ఏవిధంగానూ శాకాహారంలోకి చేర్చటానికి వీల్లేదు. పాలు నిజానికి మాంసం యొక్క రూపమే! కానీ, లౌకిక వ్యవహారరీత్యా దీనిని మాంసం అని అనము. మాంసంలో ఉన్న గుణాలు పాలలో కూడా ఉన్నాయి. అందుకనే డాక్టర్లు దానిని 'యానిమల్ ఫుడ్' అంటారు. గుడ్లను సాధారణంగా మాంసాహారంగా లెక్కిస్తారు. పాలు మాదిరిగా పరిగణిస్తే- గుడ్లు కూడా మాంసాహారం కాదు. కనుక పాలు తాగటానికి సంకోచించనివాళ్లు గుడ్లను తినటానికి సంకోచించకూడదు.'' జాతీయ సమైక్యత..
''జాతీయ సమైక్యతకు మత సామరస్యం చాలా అవసరం. మత సామరస్యం అనేది హృదయవర్తిగా జరగాల్సిన వ్యవహారం. దీనివల్ల ఎవరి మనసూ గాయపడకూడదు. నాయకులు ఏ మతానికి సంబంధించిన వారు అయినప్పటికీ- తాము ఆ మతానికే ప్రాతినిధ్యం వహించటం లేదని గుర్తించాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పారసీ, యూదు తదితర అన్ని మతాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావించాలి. దేశంలో నివసిస్తున్న అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకోవాలి. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. తమ మతాన్ని ఆదరించినట్టే ఇతర మతాలనూ ఆదరించాలి.
మనం ఈ స్థితిని సాధిస్తే- రైల్వే స్టేషన్లలో హిందూ టీ, ముస్లిం టీ అనే కేకలు వినబడవు. నిజానికి ఇటువంటి కేకలూ, మాటలూ ఎంతో సిగ్గుచేటు. ప్రజల మధ్య సమైక్యత అన్నిచోట్లా రావాలి. స్కూళ్లు, కాలేజీలు, హాస్పటళ్లు ... ఇలా అన్నిటా సామరస్యం వెల్లివిరియాలి. కంచాలు, చెంబులు, గ్లాసుల్లో తేడాలు పోవాలి. దీనిని సాధించటమే పెద్ద విప్లవం.''
''చట్ట సభల ద్వారా అధికారం వస్తుందని భావించటం చాలా తప్పు. నిజానికి అధికారం ప్రజల మధ్య ఉంటుంది. ప్రజల చేతుల్లో ఉంటుంది. అధికారం ప్రజలదే! తమ ప్రతినిధులు అని భావించినవారికి కొద్దికాలం ప్రజలు ఆ అధికారాన్ని అప్పగిస్తారు.''
సత్యాజీ
94900 99167