చందమామ చిక్కిన రోజు..
జాతిజనుల సజల నేత్రాల్లో..
అంతరిక్ష అద్భుత దృశ్యాలు..
ఆవిష్కృతమైన శుభ గడియలు
తొలి అడుగులు నడిచిన రోజు
నింగిలోని మామ అందాలన్నీ..
నట్టింట్లో వెలసిన రోజు !
విక్రమిస్తే విజయం తథ్యమని..
వైఫల్యాలే కసికి ఇంధనాలని..
చందమామను చేరిన రోజు !
వెన్నెల వన్నె తరగల నెలరాజు..
ఒడిలో రాజసంగా కాలిడి..
వంకలు పెట్టక నెలవంకను తాకి..
మానవాళి స్మృతిపేటికల్లో..
చిరస్మరణీయంగా నిలుస్తూ..
వ్యోమనౌక చంద్రయాన్-3..
తెరితీసిన శోధన ద్వారాలు !
నరకన్ను సోకని నెలరేడు..
దక్షిణ ధృవాన ఒడుపుగా వాలి..
తొలి కీర్తి కిరీటాన్ని ధరించ..
భరతమాత ఉప్పొంగిన రోజు !
మానవ సహిత చంద్ర యాత్రలు
చుక్కల రేడుపై ఆవాస నివాసాలు
గ్రహరహస్యాల గుట్టు అన్వేషణలు
అంతరిక్ష విఫణి వీధిల్లో..
అప్రతిహత ప్రస్థాన బాటలు
రోదసి శోధనలో అభినివేశం..
త్రిదేశాల సరసన సగర్వంగా..
భారత్‌ను చేర్చె ఇస్రో వీరులు
సగర్వంగా సమున్నత కక్ష్యలో !
మధుపాళీ
9949700037