
లక్నో : వన్డే ప్రపంచ కప్ లో వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతోన్న టీమిండియా ఆదివారం లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. మరికొద్ది గంటల్లోనే ఈ ఆట ఆరంభం కానున్న వేళ ... కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడ్డట్టు సమాచారం అందడంతో క్రికెట్ అభిమానుల్లో కలవరం మొదలైంది. రోహిత్ శర్మ కుడిచేయి మణికట్టుకు బంతి బలంగా తాకిందని 'ఇన్‌సైడర్‌స్పోర్ట్' రిపోర్ట్ పేర్కొంది. ఫిజియో వెంటనే స్పందించారని తెలిపింది. రోహిత్ గాయం టీమిండియా శిబిరంలో ఆందోళనలు రేకెత్తిస్తోందని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత ఎంత అనేది తెలియరాలేదు. దీనిపై ఇంతవరకు బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అధికారికంగా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో రోహిత్‌కు గాయం తీవ్రత ఎలా ఉంది ? ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో రోహిత్ ఆడతారా ? లేదా అని అభిమానులు కలవరపడుతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడకపోతే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించే అవకాశముంది. మరోవైపు ప్రస్తుత ప్రపంచ కప్‌లో రోహిత్ అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 62.20 సగటుతో 311 పరుగులు సాధించారు.