సంగారెడ్డి (హైదరాబాద్) : ఐఐటి విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. వారం రోజుల క్రితం ఈనెల 17న క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ మృతదేహం మంగళవారం విశాఖలో కనిపించింది. తమ కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తాండాకు చెందిన సంగారెడ్డి కార్తీక్ ఐఐటిలో చదువుతున్నాడు. 18వ తేదీన కార్తీక్‌కు తల్లిదండ్రులు ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో 19 న కార్తీక్ తల్లిదండ్రులు ఐఐటి క్యాంపస్‌కు వచ్చారు. కార్తీక్ క్యాంపస్‌లో లేకపోవడంతో ఆందోళన చెందిన అతడి తల్లిందండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తీక్ సెల్‌ఫోన్ సిగల్ ఆధారంగా విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించారు. తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి రూరల్ పోలీసులు విశాఖపట్నంకు వెళ్లారు. కార్తీక్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, కార్తీక్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కెజిహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.