
- అఫ్గాన్ చేతిలో అనూహ్య ఓటమి
- అఫ్గనిస్థాన్ 284/10,
- ఇంగ్లాండ్ 215/10
ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, టైటిల్ ఫేవరేట్లలో ఒకరైన ఇంగ్లాండ్ స్పిన్ వలలో చిక్కుకుంది. 285 పరుగుల ఛేదనలో అఫ్గాన్ స్పిన్నర్ల మాయలో పడి 215 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్ చాంపియన్స్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన అఫ్గనిస్థాన్ 69 పరుగులతో ఘన విజయం సాధించింది. అఫ్గనిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం.
న్యూఢిల్లీ : షాక్..షాక్. ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫిరోజ్ షా కోట్లలో అఫ్గాన్‌పై అలవోక నెగ్గుతామనే విశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన బట్లర్‌సేనకు అఫ్గనిస్థాన్ స్పిన్నర్లు పీడకల మిగిల్చారు. అఫ్గాన్ స్పిన్నర్లు ముజీబ్ రెహమాన్ (3/51), రషీద్ ఖాన్ (3/37) మూడు వికెట్ల ప్రదర్శనతో మాయజాలం చేశారు. 285 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (66, 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ మలాన్ (32, 39 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగంలో ఎవరూ రాణించలేదు. 68 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్ మళ్లీ కోలుకోలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (80, 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇక్రమ్ అలిఖిల్(58, 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిశారు. మూడు వికెట్లతో పాటు 16 బంతుల్లో 28 పరుగులు చేసిన ముజీబ్ రెహమాన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ప్రపంచకప్ గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌కు ఇది రెండో ఓటమి కాగా.. అఫ్గనిస్థాన్‌కు ఇది తొలి విజయం.
మాయలో చిక్కి.. : 285 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్ ముజీబ్ రెహమాన్ బౌలింగ్ దాడిని మొదలుపెట్టగా.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే పేసర్ ఫరూకీ బ్రేక్ సాధించాడు. జానీ బెయిర్‌స్టో (2)ను వెనక్కి పంపించాడు. జో రూట్ (11)ను ముజీబ్ అవుట్ చేయగా.. డెవిడ్ మలాన్ (32)ను మహ్మద్ నబి సాగనంపాడు. దీంతో 12.4 ఓవర్లలో 68 పరుగులకే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హ్యారీ బ్రూక్ (66) ఓ వైపు నిలిచినా.. మరో ఎండ్‌లో సహకారం దక్కలేదు. జోశ్ బట్లర్ (9), లివింగ్‌స్టోన్ (10), శామ్ కరణ్ (10), క్రిస్ వోక్స్ (9)లు దారుణంగా విఫలమయ్యారు. ఆదిల్ రషీద్ (20), మార్క్‌వుడ్ (18), టాప్లీ (15 నాటౌట్) చివర్లో ఓటమి అంతరాన్ని కుదించారు. 40.3 ఓవర్లలోనే పది వికెట్లు పడగొట్టిన అఫ్గనిస్థాన్ 69 పరుగులతో ఘన విజయం సాధించింది.
ధనాధన్ : టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు అఫ్గాన్ ఓపెనర్లు గట్టి పంచ్ ఇచ్చారు. రెహ్మనుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (30) తొలి వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడగా ఆడిన రెహ్మనుల్లా ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 33 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం వరుస వికెట్లతో ఇంగ్లాండ్ రేసులోకి వచ్చింది. రహమత్ షా (3), హస్మతుల్లా (14), ఓమర్‌జారు (19) నిరాశపరిచినా.. ఇక్రమ్ ఇలిఖిల్ (58), రషీద్ ఖాన్ (23), ముజీబ్ రెహమాన్ (28) మెరుపులతో అఫ్గనిస్థాన్ 284 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (3/50), మార్క్‌వుడ్ (2/50) రాణించారు.