లాస్ ఏంజెల్స్ : స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ - అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్ (ఎస్‌ఎజి-ఎఎఫ్‌టిఆర్‌ఎ) సమ్మెకు గ్లోబల్ ఐకాన్, ప్రముఖ హీరోయిన్ ప్రియాంకచోప్రా తన మద్దతును ప్రకటించింది. శుక్రవారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎస్‌ఎజి-ఎఎఫ్‌టిఆర్‌ఎ సమ్మెకు మద్దతు తెలుపుతూ పోస్ట్‌ను షేర్ చేశారు. 'నేను నా యూనియన్, సహోద్యోగులకు అండగా ఉంటాను. మేము సంఘీభావంతో రేపటిని మంచిగా నిర్మిస్తాము' అని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. ప్రియాంక చేసిన పోస్టుకు తన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, నటీనటులు, రచయితలు కలిసి సమ్మె చేయడం హాలీవుడ్ చరిత్రలోనే ఇది రెండోసారి అని అమెరికాకు చెందిన 'వెరైటీ' అనే మ్యాగజైన్ పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో ఒకసారి ఈ యూనియన్ సమ్మె చేసింది. ఆ తర్వాత మరోసారి జూలై 13వ తేదీ గురువారం ఈ యూనియన్ సమ్మె చేసింది. గురువారం చేసిన ఈ సమ్మె వల్ల నటీనటులు ప్రీమియర్‌లకు హాజరు కాలేదు. ఇంటర్వ్యూలు, అవార్డుల కార్యక్రమాలకు వెళ్లలేదు. సోషల్‌మీడియాలో ప్రాజెక్టులను ప్రచారం చేయలేదని వెరైటీ మ్యాగజైన్ నివేదించింది. ఇక ఈ సమ్మెపై ఎస్‌ఎజి-ఎఎఫ్‌టిఆర్‌ఎ యూనియన్ అధ్యక్షుడు ఫ్రాన్ మీడియాతో మాట్లాడుతూ.. 'సరైన వేతనాల కోసం మేము చేసే సమ్మెకు చాలామంది మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలను మేము పరిగణనలోకి తీసుకోము' అని ఆయన అన్నారు.
అమెరికాకు చెందిన రైటర్ గిల్డ్ ఆఫ్ అమెరికాకు చెందిన 11 వేల మంది సభ్యులు మే నెలలో తమకు సరైన వేతనాలు అందడం లేదనే కారణంతో సమ్మెను ప్రారంభించారు. 'స్ట్రీమింగ్ యుగంలో కూడా మాకు సరైన వేతనాలు అందడం లేదు. మాకు సరైన వేతనాలు అందించమని మేము స్టూడియోలతో చర్చలు జరిపాము. కానీ స్టూడియోలు మా ప్రతిపాదనల పట్ల స్పందించలేదు. దీంతో రచయితలు ఎదుర్కొంటున్న అస్తిత్వ సంక్షోభం దృష్ట్యా మేము సమ్మెను ప్రారంభించాం' అని ఈ యూనియన్ ప్రకటన వెల్లడించింది.










