Apr 19,2023 14:13

వాషింగ్టన్‌ : ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ 65వ స్థానంలో నిలిచిందని హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ నగరంలో అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య ఏడాదిలో 78 శాతం పెరిగిందని తెలిపింది. ఇక్కడ 11,100 మంది మిలియనీర్లు (రూ.8 కోట్ల పైగా సంపద) ఉన్నారని పేర్కొంది. హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన 'ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023' రిపోర్ట్‌ ప్రకారం.. మొత్తం 97 నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2022 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌ నుంచి ముంబయి నగరం 59,400 మంది మిలియనీర్లతో 21వ స్థానంలో, 12,600 మంది సంపన్నులతో బెంగళూరు 60వ స్థానంలో, కోల్‌కత్తా 12,100 మందితో 63వ స్థానంలో నిలిచాయి. అమెరికాలోని న్యూయార్క్‌ నగరం 3,40,000 మంది మిలియనీర్లతో అగ్ర స్థానంలో నిలిచింది. జపాన్‌ రాజధాని టోక్యో 2,90,300 మంది మిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్‌, సింగపూర్‌, లాస్‌ ఏంజెల్స్‌, హాంకాంగ్‌, బీజింగ్‌, షాంఘై, సిడ్నీ నగరాలు టాప్‌ 10లో వరుసగా ఉన్నాయి.