Sep 13,2023 06:58

             దహావ్‌ను సందర్శించిన భారతీయులు ఎవరికైనా, ఇదే క్యాంప్‌లో నాజీలచే హత్యగా వించబడిన, భారతీయ సంతతికి చెందిన వీరవనిత నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ (1914-1944)ని గుర్తు చేసుకోకుండా, ఆమెకు నివాళి అర్పించకుండా తిరిగి రావడం సరికాదు. నూరున్నిసా (పూర్తి పేరు) నేపథ్యం అసాధారణమైనది. ఆమె టిప్పుసుల్తాన్‌ వంశీకురాలు. ఆమె తండ్రి ఇనాయత్‌ ఖాన్‌ ప్రముఖ సూఫీ గురువు, సంగీతకారుడు. గుజరాత్‌ లోని బరోడాలో శాస్త్రీయ సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఆమె తల్లి, ఇస్లాం మతాన్ని స్వీకరించిన అమెరికన్‌ మహిళ. తల్లిదండ్రులు రష్యాలో ఉన్నప్పుడు, నూర్‌ మాస్కోలో పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధపు సూచనలు పొడచూపగానే వారి కుటుంబం, ఇంగ్లాండుకి వలస వెళ్లింది. నూర్‌ విద్యాభ్యాసం అక్కడే మొదలైంది. మరి కొద్ది కాలంలోనే వారు పారిస్‌ శివార్లలో స్థిరపడ్డారు. నూర్‌ సోర్బోన్‌లో సైకాలజీ అభ్యసించింది. సంగీతం నేర్చుకుంది. ఆమె ఇంగ్లీషు, ఫ్రెంచి ధారాళంగా మాట్లాడగలిగేది. గాంధీజీ అహింసావాదం ఆమెను ఆకర్షించింది. ఆమె రచయిత్రి కావాలని అనుకున్నది. పిల్లల కోసం జాతక కథలను తిరగరాసి ప్రచురించింది. నాజీల ప్రాబల్యం పెరుగుతున్నప్పుడు, ఆమె తన సన్నిహితులతో 'మనం ఏదో ఒకటి చెయ్యాలి' అనేది. ఆ దశలోనే ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది.
             1940లో జర్మన్లు ఫ్రాన్సును ఆక్రమిస్తున్నప్పుడు నూర్‌ కుటుంబం ఇంగ్లాండు వెళ్లిపోయింది. ఆమెకున్న ఉభయ భాషా ప్రావీణ్యత బ్రిటిష్‌ సైనికాధికారుల దృష్టికి వచ్చింది. గూఢచారిగా ఆమె రాణిస్తుందని వారు భావించారు. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌లో ఆమెకు తర్ఫీదు ఇచ్చారు. వైర్‌లెస్‌ టెలిగ్రఫీలో ఆమె ప్రతిభ వెల్లడైంది. మరి కొందరితో బాటు ఆమెను విమానం ద్వారా 1943 జూన్‌లో నాజీ ఆక్రమిత ఫ్రాన్సులో దించారు. నాజీలను ప్రతిఘటిస్తూన్న గెరిల్లాలకు సహాయపడడం, తద్వారా జర్మన్‌ సైన్యాలను నిర్వీర్యం చెయ్యడం వారి లక్ష్యం. లండన్‌ లోని ప్రధాన కార్యాలయంతో వైర్‌లెస్‌ ద్వారా సంబంధాలను కలిగి ఉండడం నూర్‌ బాధ్యత. ఆమె తన విధులను సక్రమంగా నిర్వహించింది. 1943 అక్టోబర్‌లో నూర్‌ పట్టుబడింది. కస్టడీలో ఆమెను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. తప్పించుకోవడానికి మూడుసార్లు ప్రయత్నించి, దొరికిపోయింది. ఆమెపై 'అత్యంత ప్రమాదకరమైన ఖైదీ'గా ముద్ర వేశారు. సంకెళ్లు వేసి ఒంటరిగా ఉంచారు. దహావ్‌ క్యాంపుకి తరలించారు. మరో ఆరు నెలల్లో యుద్ధం ముగుస్తుందనగా, 1944 సెప్టెంబర్‌ 13న నూర్‌తోబాటు మరో ముగ్గురు మహిళా గూఢచారులను పిస్తోలుతో కాల్చి చంపారు. 1949లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమెకు జార్జ్‌ క్రాస్‌ని ప్రకటించింది.

/ ఇటీవల దహావ్‌ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌ను సందర్శించిన సందర్భంగా రాసిన వ్యాసం /

ఉణుదుర్తి సుధాకర్‌ , సెల్‌: 9000601068